
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామ శివారులోని గాడుదుల గండి గుట్ట వద్ద మంథని-కాటారం ప్రధాన రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో బెల్లంపల్లి నుంచి హనుమకొండకు వెళుతున్న పరకాల డిపో బస్ ఏపీ 36జెడ్ 0161 మంథని వైపుకు వస్తున్న కారు టీఎస్ 04ఎఫ్ సీ 9774ను ఢీ కొట్టి బస్ లోయలో పడిపోయింది.
దీంతో కారు డ్రైవర్ తాటి వినీత్(21) అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న 12మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ ప్రయాణికులను మంథని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. వీరిలో ఒక వృద్ధురాలు పరిస్థితి విషమంగా ఉంది. మంథని మండలం ఖాన్ సాయిపేట్ గ్రామానికి చెందిన మృతుడు వినీత్ మంథనిలో కార్ కేర్ సెంటర్‌లో మెకానిక్‌గా పని చేస్తున్నాడు.
కారు డ్రైవర్ తాటి వినీత్
మంత్రి విచారం
లోయలో పడిన బస్సు దుర్ఘటనపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బెల్లంపల్లి నుంచి హనుమకొండ వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడటం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కరీంనగర్, వరంగల్ రీజినల్ మేనేజర్లకు మంత్రి ఆదేశించారు. క్షతగాత్రులకు కావల్సిన వైద్య సేవల కోసం సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. గాయాలకు గురైన ప్రయాణీకులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ బాధిత కుటుంబసభ్యులకు తమ విచారం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment