ఏడుగురిని బలిగొన్న విష వాయువులు  | Poisonous gases deceased seven people at Oil Mill | Sakshi
Sakshi News home page

ఏడుగురిని బలిగొన్న విష వాయువులు 

Published Fri, Feb 10 2023 3:55 AM | Last Updated on Fri, Feb 10 2023 3:55 AM

Poisonous gases deceased seven people at Oil Mill - Sakshi

ఘటన జరిగిన ఆయిల్‌ ట్యాంక్‌ వద్ద మృతదేహాలు.. రోదిస్తున్న కుటుంబసభ్యులు, బంధువులు

సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, పాడేరు/పెదబయలు: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి. రాగంపేటలోని అంబటి సుబ్బ­న్న ఆయిల్స్‌లో విష వాయువులు ఏడు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. వంట నూనెల కర్మాగారానికి చెందిన ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు ట్యాంక్‌లోకి దిగిన కార్మికులు ఒకరి తర్వాత ఒకరుగా అర­గంట వ్యవధిలో ఏడుగురు మృతి చెందారు. 

మృతులలో ఐదుగురు అల్లూరి సీతా­రామరాజు జిల్లా పాడేరు డివిజన్‌లోని పెదబయలు మండలానికి చెందిన వారు కాగా, ఇద్దరు కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం పులిమేరు వాసులు. మృతులంతా రోజు వారి కూలీలే. అంతా 45 ఏళ్ల లోపు వారే..

గురువారం ఉదయం 7 – 7.30 గంటల మధ్య ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పెద్దాపురం పరిసర గ్రామాల నుంచి స్థానికులు బాధిత కుటుంబాలకు మద్ధతుగా ఫ్యాక్టరీ వద్దకు తరలిరావడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రమాద విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు అన్ని విధాలా తోడ్పాటు అందివ్వాలని కాకినాడ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. కుంటుంబానికి రూ.25 లక్షలు వంతున పరిహారం ప్రకటించారు. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, ప్రత్యక్ష సాకు‡్ష్యలు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 
 
ఉక్కిరి బిక్కిరి.. 

జి రాగంపేటలోని అంబటి సుబ్బన్న ఆయిల్స్‌ ఫ్యాక్టరీ ఆవరణలోని ఏడు ఆయిల్‌ ట్యాంకర్లలో ఐదో నంబర్‌ ట్యాంక్‌ను గురువారం శుభ్రం చేయాలనుకున్నారు. 24 అడుగుల లోతున్న ఈ ట్యాంక్‌లో అడుగున ఉండే వంట నూనె మడ్డిని తొలగించేందుకు వీరు ట్యాంక్‌లోకి దిగారు. ట్యాంకులో నిల్వ చేసిన నూనెను ప్యాకింగ్‌కు తరలించిన తర్వాత క్లీన్‌ చేశాకే తిరిగి మరోసారి ఆయిల్‌తో నింపుతుంటారు.

అలా ఖాళీ అయిన ట్యాంకర్‌ను శుభ్రం చేసేందుకు ఎనిమిది మంది కార్మికులను ప్లాంట్‌ సూపర్‌వైజర్‌ రాజు పురమాయించారు. ఈ క్రమంలో ఒక్కొక్కరూ ట్యాంక్‌లోకి దిగారు. తొలుత ట్యాంక్‌లోకి దిగాక, కళ్లు తిరిగి ఊపిరాడక పోవడంతో బయటకు వచ్చిన వెచ్చంగి కిరణ్‌ మాత్రమే ప్రాణాలతో బయట పడ్డాడు.

ఇతని పరిస్థితి గమనించి కూడా, మిగతా వారిని లోపలకు దింపడం దారుణం అని మిగతా కార్మికులు మండిపడుతున్నారు. ట్యాంక్‌లో ఆక్సిజన్‌ 20 శాతం లోపు ఉండటంతోనే కార్బన్‌ డయాక్సైడ్, మోనాక్సైడ్‌తో కూడిన విష వాయువులు కమ్మేసి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ రాధాకృష్ణ ‘సాక్షి ప్రతినిధి’కి చెప్పారు.

ఈ ఫ్యాక్టరీలో ట్యాంకుల్లో నిల్వ చేసుకునేందుకు అనుమతి ఉందా లేదా అనే విషయాలను పరిశీలిస్తున్నామన్నారు. ఇక్కడున్న ఏడు ట్యాంకులన్నీ 18 నుంచి 24 అడుగుల లోతున ఉన్నాయి. మృతులను బయటకు తీసుకువచ్చేందుకు ట్యాంకర్‌ను కట్‌ చేయాల్సి వచ్చింది.  
 
ఫ్యాక్టరీ సీజ్‌.. దర్యాప్తునకు ఆదేశం 

కాకినాడ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కృతికా శుక్లా, ఎం రవీంద్రనాథ్‌బాబు రెవెన్యూ, పోలీసు అధికారులతో కలిసి సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. ఫ్యాక్టరీని సీజ్‌ చేసి, కార్యకలాపాలను నిలిపివేశారు.  యాజమాన్యంపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. ఈ మొత్తం ఘటనపై విచారణకు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పర్యవేక్షణలో ఫ్యాక్టరీస్, కార్మిక శాఖ అధికారులతో త్రిసభ్య కమిటీని కలెక్టర్‌ ఏర్పాటు చేశారు.

త్వరగా విచారణ పూర్తి చేసి, నివేదిక అందజేయాలని ఆదేశించారు. కాగా, పెద్దాపురం వద్ద కూడా ఇదే యాజమాన్యం ఏఎస్‌ ఆయిల్స్‌ పేరుతో మరో ఫాక్టరీని నడుపుతోంది.  
 
అందరూ రెక్కాడితే కానీ డొక్కాడని వారే.. 
మృతులంతా పొట్టకూటి కోసం వలస వచ్చిన వారే. రోజువారీ రూ.650 చొప్పున పని చేస్తున్నారు. ప్యాకింగ్‌ సెక్షన్‌లో పని చేసే వారిని ట్యాంక్‌లు శుభ్రంచేసే పనికి పురమాయించడం వల్లే అవగాహన లేక చనిపోయారని మృతుల కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. ఇక తమకు ఎవరు దిక్కంటూ జగదీష్, ప్రసాద్‌ కుటుంబ సభ్యులు మృతదేహాల వద్ద కన్నీటి పర్యంతమయ్యారు.

పోస్టుమార్టం కోసం ఇద్దరి మృతదేహాలను పెద్దాపురం ఆస్పత్రికి, ఐదుగురి మృతదేహాలను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అనంతరం వారి స్వగ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి వేణుగోపాలకృష్ణ చెప్పారు. 
 
బాధితులకు అండగా సీఎం జగన్‌ ప్రభుత్వం 
మృతుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు.

ఫ్యాక్టరీ యాజమాన్యం నుంచి మరో రూ.25 లక్షలు వంతున ఇచ్చేలా ఒప్పించారు. మొత్తంగా ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షలు సాయం అందేలా చర్యలు తీసుకున్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబంలో అర్హులైన వారికి పింఛన్‌ సహా ఇతర ప్రయోజనాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  
  
కార్మికుల మృతి విచారకరం : గవర్నర్‌  
సాక్షి, అమరావతి : కాకినాడ జిల్లా జి.రాగంపేటలోని అంబటి ఆయిల్స్‌ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతి చెందడంపై గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారని రాజ్‌భవన్‌ వర్గాలు గురువారం ఓ ప్రకటరలో పేర్కొన్నాయి. ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.  
  
నలుగురికి 20 మంది పిల్లలు  
పెదబయలు మండలానికి చెందిన దగ్గరి బంధువులు ఐదుగురి మృతితో మన్యంలో విషాదం నెలకొంది వీరంతా సంక్రాంతి పండగకు స్వగ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడిపారు. రెండు వారాల క్రితమే ఫ్యాక్టరీకి తిరిగి వెళ్లారు. ఇంతలోనే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

కొర్రా రామారావుకు భార్య కొమాలమ్మ, ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు. పిల్లలందరూ చిన్న వయసు వారే. వెచ్చంగి కృష్ణారావుకు భార్య లక్ష్మితో పాటు నలుగురు పిల్లలు. కుర్తాడి బొంజన్నకు భార్య నీలమ్మతో పాటు నలుగురు పిల్లలు ఉన్నారు. వెచ్చంగి సాగర్‌కు వివాహం కాలేదు. తల్లిదండ్రులు సీతారామ్, సత్యవతి, చెల్లెళ్లు ఇతనిపైనే ఆధారపడి ఉన్నారు. నర్సింగరావుకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. 

మృతులు వీరే.. 
అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా పెదబయలు మండలం పరేడ∙ గ్రామ పంచాయతీ లక్ష్మీపురానికి చెందిన వెచ్చంగి కృష్ణారావు (36), వెచ్చంగి నరసింగరావు (40), వెచ్చంగి సాగర్‌ (23), ఉంచేడుపుట్టు గ్రామం కురుతాడుకు చెందిన కుర్తాడి బొంజుబాబు(35), బాండపల్లి గ్రామ పంచాయతీ సంపాపుట్టు గ్రామం కొర్రా రామారావు (45), పెద్దాపురం మండలం పులిమేరు గ్రామానికి చెందిన కట్టమూరి జగదేష్‌ (25), యల్లమిల్లి ప్రసాద్‌ (27). పెదబయలు మండలానికి చెందిన ఐదుగురూ దగ్గర బంధువులు. 
  
ఒక్కొక్కరం లోపలకు దిగేశాము. ఏదోలా అనిపించింది. వెంటనే ఊపిరాడక కళ్లు బైర్లు కమ్మేశాయి. ట్యాంక్‌ లోపల అరస్తూ పడిపోతున్న కృష్ణారావును పైకి లాగుదామనుకున్నా. అయితే అప్పటికే నాలో శక్తి సన్నగిల్లింది. ఎలాగోలా మిచ్చెన పట్టుకుని బయటికొచ్చి పడిపోయాను. 
– ప్రత్యక్ష సాక్షి కిరణ్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement