సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘మేం మావోయిస్టులం మాట్లాడుతున్నాం.. పార్టీ చందా కోసం రూ.5 లక్షలు కావాలి. కరీంనగర్ బస్టాండుకు తీసుకురావాలి’అంటూ బెదిరించిన నకిలీ మావోలు పోలీసులకు చిక్కారు. ఇటీవల రామగుండం మేయర్ బంగి అనిల్‌కుమార్, పంకెన సర్పంచి శ్రీనివాస్‌కి మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖల గుట్టును పోలీసులు ఛేదించారు. దీని వెనక మావోయిస్టులు లేరని, తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు నలుగురు యువకులు పన్నిన పన్నాగమని తేల్చారు.
శుక్రవారం భూపాలపల్లి పోలీసులు ఈ కేసు వివరాలు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. భూ పాలపల్లి జిల్లా పంకెన గ్రామానికి చెందిన ఎర్ని సోమయ్య, పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఎలుకలపెల్లికి చెందిన చిలుముల తిరుపతి, రామగుండం మండలం గోదావరిఖనికి చెందిన ఈర్ల రాంచందర్ ఎలాగైనా సులువుగా డబ్బు సంపాదించాలని అనుకున్నారు. ఈ క్రమంలో మావోయిస్టుల పేరుతో నాయకులను బెదిరించాలని నిర్ణయించారు.
ఇందుకోసం గోదావరిఖనికి చెందిన జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు టేకుల సుదీర్ సాయం తీసుకున్నారు. యూట్యూబ్‌లో మావోయిస్టుల లెటర్‌హెడ్‌లను చూసి అలాంటివే నకిలీవి సృష్టించారు. పంకెన సర్పంచి శ్రీనివాస్, రామగుండం మేయర్ బంగి అనిల్‌కుమార్‌లకు పార్టీకి రూ.5 లక్షలు విరాళంగా ఇవ్వాలని బెదిరిస్తూ లేఖలు పంపారు. ఈనెల 15వ తేదీన ఈ లేఖలను హైదరాబాద్ నుంచి పోస్టు చేశారు.
రెండు రోజుల అనంతరం వారిద్దరికి ఫోన్ చేసి కరీంనగర్ బస్టాండుకు వచ్చి డబ్బులు అప్పగించాలని బెదిరించారు. దీనిపై సర్పంచి శ్రీనివాస్ ఫిర్యాదుతో పోలీసులు నిఘా పెట్టి ముందు సోమయ్యను అదుపులోకి తీసుకున్నారు. అతనిచ్చిన సమాచారంతో మిగతావారిని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment