ఖమ్మం క్రైం: గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయా ల్సిన పోలీసులే ఆ పనికి తెగబడ్డారు. ఇటీవల ఖమ్మం జిల్లాకు చెందిన జీఆర్‌పీ కానిస్టేబుల్ ఒకరు గంజాయి రవాణాలో చిక్కిన విషయం తెలిసిందే. ఇది మరువకముందే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లు గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వ్యవహారం పోలీసు శాఖలో కలకలం సృష్టిస్తోంది.
ఈ దందాలో ఓ జైలు వార్డర్ ప్రమేయం కూడా ఉందని చెబుతున్నారు. రెండు రోజుల కిందట జరిగిన ఘటనలో ఐదుగురి పాత్ర ఉండగా.. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కాగా, ఈ కానిస్టేబుళ్లు భారీ ఎత్తున స్మగ్లింగ్ సాగిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఖమ్మం సీపీ విష్ణు ఎస్.వారియర్ ఆధ్వర్యంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
పరారీలో ముగ్గురు..
ఖమ్మం పోలీసు హెడ్ క్వార్టర్‌లోని ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్, భద్రాద్రి కొత్తగూడెంలోని హెడ్ క్వార్టర్‌లో పనిచేస్తున్న మరో ఏఆర్ కానిస్టేబుల్ కొంత కాలంగా గంజాయి రవాణా చేస్తున్నారు. ఖమ్మం మమత రోడ్డులోని హార్వెస్ట్ స్కూల్ సమీపంలో మంగళవారం గంజా యి తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఖమ్మం అర్బన్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరి వద్ద తనిఖీ చేయగా ఐదు కేజీల గంజాయి లభించినట్లు ఏసీపీ ఆంజనేయులు తెలిపారు.
వీరిని విచారించగా.. ఖమ్మంకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కొండ సతీశ్, కొణిజర్ల మండలం పల్లిపాడుకు చెందిన రైతు పల్లెబోయిన వెంకటేశ్వరుగా తేలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ తమ సమీప బంధువైన కారేపల్లి మండలం తుడితెలగూడెంకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి కొనుగోలు చేసిన ఐదు కేజీల గంజాయిని కానిస్టేబుల్ సతీష్‌కు ఇచ్చినట్లు వెంకటేశ్వర్లు తెలిపాడు. ఈ కేసులో భద్రాద్రి జిల్లా కానిస్టేబుల్, విద్యార్థితో పాటు ఖ మ్మం జైలు వార్డర్ కూడా పరారీలో ఉన్నట్లు సమాచారం. వీరిని త్వరలోనే పట్టుకుంటామని ఏసీపీ తెలిపారు.
జైలుకు వచ్చే నేరస్తులతో పరిచయం
ఓ కానిస్టేబుల్, రైతును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నా ఖమ్మం జైలు వార్డర్‌తోపాటు మరో వ్యక్తిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో జైలు వార్డర్.. జైలుకు వచ్చిన స్మగ్లర్లతో పరిచయం పెంచుకుని వారి ద్వారా ఈ దందాలోకి దిగినట్లు సమాచారం. ఇద్దరు కానిస్టేబుళ్లు, జైలు వార్డర్ ఒకే బ్యాచ్‌కు చెందిన వారు కావడంతో వీరి మధ్య స్నేహం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పాత నేరస్తుల ద్వారా గంజాయి ఎక్కడ కొనాలి, ఏయే మార్గాల్లో తరలిస్తే సాఫీగా రవాణా సాగుతుందో తెలుసుకుని వీరు గంజాయి దందా చేస్తునట్లు సమాచారం.
భారీగా స్మగ్లింగ్..?
గంజాయి అక్రమ రవాణాలో కీలకంగా ఉన్న ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లు, జైలు వార్డర్ భారీ ఎత్తున దందా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంత కాలంగా వీరు హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాలకు గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్నారని తెలిసింది. వీరికి స్థానికంగా ఉండే గంజాయి అమ్మకందారులతో కూడా పరిచయాలు ఉన్నట్లు వెల్లడైంది. గంజాయి స్మగ్లింగ్‌ను అడ్డుకోవాల్సిన పోలీసులే స్మగ్లింగ్ కేసులో ఇరుక్కోవడంతో పోలీసు శాఖ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment