వివరాలు వెల్లడిస్తున్న బాలానగర్ డీసీపీ పద్మజారెడ్డి
సాక్షి, కుత్బుల్లాపూర్: ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ పూర్తి చేసిన వ్యక్తి బుద్ధి వక్రమార్గంలో మళ్లింది. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో అల్ఫ్రాజోలమ్ గుళికలను హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లోని కల్లు కాంపౌండ్‌లకు మరో వ్యక్తితో కలిసి సరఫరా చేస్తున్నాడు. వీరికి సహకరించిన మరో ఇద్దరిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 8.50 కోట్ల విలువ చేసే 140 కిలోల అల్ఫ్రాజోలమ్ డ్రగ్‌తో పాటు రూ.50 వేల నగదు, బొలారో, ఎర్టికా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను బాలానగర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు కార్యాలయంలో డీసీపీ పి.వి.పద్మజారెడ్డి సోమవారం మీడియాకు వివరించారు.
బాలానగర్‌లో ముడిసరుకులు.. విజయవాడలో తయారీ
మెదక్ జిల్లా శంకరంపేట్‌కు చెందిన గుడికాడి లింగాగౌడ్ (37) ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ పూర్తి చేశాడు. ఇతనికి సింథటిక్ డ్రగ్ తయారీలో పరిజ్ఞానం ఉంది. అయితే కులవృత్తిలో భాగంగా కల్లు తయారీలో కొంత మత్తు పదార్థం కలపడాన్ని చూసిన లింగాగౌడ్ తనకున్న పరిజ్ఞానంతో అల్ఫ్రాజోలమ్ తయారుచేసి కల్లు కాంపౌండ్‌లకు విక్రయించడం మొదలుపెట్టాడు. కొండాపూర్‌లో నివాసముంటూ గౌడ్ లేబొరేటరీస్ పేరుతో గత ఐదేళ్లుగా ఈ అక్రమ వ్యాపారం చేస్తున్నాడు. అల్ఫ్రాజోలమ్ తయారీకి ఉపయోగించే ముడి పదార్థాన్ని బాలానగర్ ప్రశాంత్‌నగర్ ఇండస్ట్రీ ప్రాంతంలోని నర్మద కెమికల్స్ నుంచి కొనుగోలు చేసేవాడు. వీటిని తన స్నేహితుడు కిరణ్‌కు చెందిన విజయవాడలోని ఫార్మస్యూటికల్ పరిశ్రమకు పంపించి అక్కడా ప్రాసెసింగ్ చేయించేవాడు. కిరణ్ ఆల్ఫ్రాజోలమ్ గుళికలను తన డ్రైవర్ వినోద్ (27) ద్వారా విజయవాడ నుంచి హైదరాబాఉఉద్‌కు వాహనంలో పంపిస్తుంటాడు.
ఏఆర్ కానిస్టేబుల్ సహకారం
అయితే పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు లింగాగౌడ్ వరుసకు బామమరిది అయ్యే మెదక్‌లో ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మదురి రామకృష్ణ గౌడ్(36) సహకారాన్ని తీసుకుంటున్నాడు. ఈ డ్రగ్ కల్లు కాంపౌండ్‌కు తరలించే సమయంలో మార్గం మధ్యలో పోలీసుల తనిఖీ లేకుండా జాగ్రత్తగా వ్యవహరం నడిపేవాడు. ఇందుకుగాను రామకృష్ణగౌడ్‌కు వచ్చిన ఆదాయంలో 30 శాతం వరకు కమిషన్ ఇస్తున్నాడు. అయితే విజయవాడ నుంచి కిరణ్ డ్రైవర్ వినోద్ వాహనంలో అల్ఫ్రాజోలమ్ తీసుకొచ్చాడని విశ్వసనీయ సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్ రమణారెడ్డి, పేట్‌బషీరాబాద్ ఇన్‌స్పెక్టర్ రమేష్ నేతృత్వంలోని బృందం జీడిమెట్ల పైపులైన్‌న్ రోడ్డులో దాడులు చేసి బొలేరో (టీఎస్ 08 యుహెచ్ 8029), ఎర్‌టికా ( టీఎస్ 35 సీ 7237) వాహనాల నుంచి 139 కిలోల అల్ఫ్రాజోలమ్‌ను స్వాధీనం చేసుకున్నారు. లింగాగౌడ్, డ్రైవర్ వినోద్‌లను అరెస్టు చేశారు. అనంతరం మెదక్ జిల్లా హవేలీ ఘన్‌పూర్ మండలం పరిధార్ గ్రామంలోని రామకృష్ణగౌడ్ ఇంట్లో మరో కిలో అల్ఫ్రాజోలమ్ డ్రగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడికి కూడా అరెస్టు చేశారు. పరారీలో ఉన్న కిరణ్ కోసం గాలిస్తున్నారు.
చదవండి:
పొలిమేరలో ఉన్న సమీప బంధువు ఇంటికి తీసుకెళ్లి..
ఫోన్‌కు ఓటీపీలు వస్తాయి చెప్పమ్మా అంటూ..
Comments
Please login to add a commentAdd a comment