Malla Reddy Murder Case: Police Inquiry Behind Warangal Advocate Murder Case - Sakshi
Sakshi News home page

Malla Reddy Murder Case: మల్లారెడ్డి హత్య వెనుక భారీ స్కెచ్‌.. రూ.10 లక్షలకుపైనే సుపారీ! 

Published Wed, Aug 3 2022 2:00 AM | Last Updated on Wed, Aug 3 2022 11:08 AM

Police Inquiry Behind Advocate Malla Reddy Murder Case - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డి హత్యకు ఓ గ్యాంగ్‌ రూ.10 లక్షలకుపైనే సుపారీ మాట్లాడుకున్నట్లు తెలిసింది. అయితే ఆ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చిందెవరు?.. మల్లారెడ్డిని హత్యచేసే అవసరం ఎవరికుంది?.. ఆయనను మట్టుపెడితే మేలు ఎవరికీ?.. ఈ హత్యకు కారణం మైనింగ్‌ వివాదమా.. భూ వివాదాలా?.. మర్డర్‌కు ప్రణాళిక రచించిందెవరు? ఘటనలో పాల్గొన్నదెవరు?.. సోమవారం రాత్రి ములుగు జిల్లా పందికుంట సమీపంలో హత్యకు గురైన మూలగుండ్ల మల్లారెడ్డి ఘటనపై సర్వత్రా సాగుతున్న చర్చ ఇది. మల్లంపల్లి మాజీ సర్పంచ్‌ రవి సహా 10మందినిపైగా విచారించి వదిలేసిన పోలీసులు కీలక వ్యక్తులపై ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు. 

పక్కా స్కెచ్‌తో.. 
మల్లారెడ్డి మర్డర్‌పై మంగళవారం రాత్రి వరకు స్పష్టత రాకపోగా.. భిన్న కథనాలు వినిపించాయి. ఎర్రమట్టి క్వారీలు, భూ వివాదాల పరిష్కారం కోసం సోమవారం కూడా ములుగు రెవెన్యూ, పోలీసు అధికారులను కలిసినట్లు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ హత్య జరిగే నాలుగు రోజుల ముందు మల్లారెడ్డి ఇద్దరితో తీవ్రస్థాయిలో గొడవపడినట్లు చెబుతున్నారు. తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో ఒకరితో జరిగిన గొడవ తారస్థాయికి చేరగా, అవతలి వ్యక్తి లేపేస్తానని మల్లారెడ్డిని హెచ్చరించాడని అంటున్నారు.

మల్లారెడ్డి హత్యకు హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో పథకానికి రూపకల్పన జరిగినట్లు ములుగు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. హంతకులకు రూ.10 లక్షలకుపైనే సుపారీ ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు. హంతకులు కూడా హైదరాబాద్‌కు చెందిన వారుగా భావిస్తుండగా, హత్య జరిగిన సమయంలో హంతకులు మాస్క్‌లు ధరించి తెలుగు మాట్లాడారని చెబుతున్నారు. హత్యకు వాడిన కత్తులు, మారణాయుధాలను చూస్తే హైదరాబాద్‌ నుంచి గానీ, ఆన్‌లైన్‌లో గాని తెప్పించినవిగా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది.  

హత్య కుట్రలోని ఆ ఇద్దరు ఎవరు..  
మల్లారెడ్డి భార్య భాగ్యలక్ష్మి పేర్లు చెప్పకుండా హత్య వెనుక ఇద్దరి హస్తముందని మంగళవారం మీడియాతో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మల్లంపల్లి ఎర్రమట్టి క్వారీలతో పాటు పలుచోట్ల భూవివాదాల్లో ఆయనను అడ్డు తొలగించుకునేందుకు వ్యూహం రూపొందించినట్లు పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్‌లో హత్యకు వ్యూహరచన చేసి, 3 రోజులు ములుగు, హనుమకొండలో రెక్కీ నిర్వహించినట్లుగా సమాచారం.

చివరకు పందికుంట వద్ద పధకం అమలు చేసినట్లు తెలిసింది. హత్య వెనుకున్న ఆ ఇద్దరు ఎవరనే కోణంలో ఆరా తీస్తున్న పోలీసులు బుధవారం గుట్టువిప్పే అవకాశం ఉంది. ములుగు మండలం ఉమ్మాయినగర్, కేఎన్‌ఆర్‌ కాలేజీ సమీపంలోని ఐదుగురు ఎర్రమట్టిæ క్వారీల యజమానులను మంగళవారం వేర్వేరుగా విచారించారు. అలాగే మల్లారెడ్డి భార్య భాగ్యలక్ష్మి, కూతురు అనూషకు సంబంధించిన 113 ఎకరాల భూమి విషయంలోనూ ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా, మెడ చుట్టూ పది, పొత్తి కడుపులో మూడు చోట్ల.. మొత్తం 13 చోట్ల మల్లారెడ్డిపై కత్తులతో దాడి జరిగినట్లు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ధ్రువీకరించారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement