Mahabubabad Kidnap Case: Police Investigation On Dikshit Reddy Murder Case | మరో నలుగురి పేర్లు! - Sakshi
Sakshi News home page

దీక్షిత్‌ హత్య.. మరో నలుగురి పేర్లు!

Published Fri, Oct 23 2020 3:47 PM | Last Updated on Fri, Oct 23 2020 7:10 PM

Police Investagation On Deekashit Reddy Murder Case - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : మహబూబాబాద్‌లో కిడ్నాప్, ఆపై హత్యకు గురైన దీక్షిత్‌రెడ్డి(9) హత్య కేసులో నిందితుడి వివరాలపై పలు అనుమానాలు తలెత్తున్నాయి. ఇంటర్‌ చదివి ఆటో మెకానిక్‌గా పనిచేస్తున్న సాగర్‌ ఒక్కడే కిడ్నాప్, హత్యచేయటం, ఇంటర్‌నెట్‌ ద్వారా ఫోన్‌ చేసి డబ్బు డిమాండ్‌ చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, ఎవరైనా రూ.10 లక్షలు, రూ.20లక్షల అడుగుతారు కానీ ప్రత్యేకంగా రూ.45 లక్షలే డిమాండ్‌ చేయడం ఏమిటనే ప్రశ్న కూడా ప్రజలను వెంటాడుతోంది.

ఒక్కడే చేశాడా?
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు అనంతరం హత్యలో సాగర్‌ ఒక్కడి ప్రమేయమే ఉందని వెల్లడించారు. అయి తే, నిందితుడు మరో నలుగురి పేర్లు చెప్పినా, కావాలనే చెప్పినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎస్పీ తెలిపారు. కాగా, కేవలం డబ్బు మాత్రమే నిందితుడి టార్గెట్‌ కాకపోవచ్చని, డబ్బులే కావాల్సి ఉంటే హత్య చేయకపోయి ఉండేవాడని చెబుతున్నారు. నలుగురు కలిసి ప్లాన్‌ చేశారని, దీక్షిత్‌ సమాచారం ఇచ్చిన దగ్గరి వ్యక్తికి రూ. 15లక్షలు, మిగిలిన వారు తలా రూ.10లక్షల చొప్పున తీసుకునేలా నిర్ణయించుకుని ఉంటారని బాలుడి బంధువులు ఆరోపిస్తున్నారు. (దీక్షిత్‌ హత్య: నిందితుల ఎన్‌కౌంటర్‌?)

రూ.1,500 కోసమే హత్యకు బీజం పడిందా?
దీక్షిత్‌ తండ్రి రంజిత్‌రెడ్డి ఓ ఛానెల్‌లో వీడియో జర్నలిస్టుగా పనిచేస్తూ రెండు ట్రాక్టర్ల ద్వారా ఇసుక వ్యాపారం చేసేవాడు. అలాగే, రంజిత్‌ భార్య వసంత చీటీల వ్యాపారం చేసేది ఈ క్రమంలో ఖాళీగా ఉన్న తమ దగ్గరి బంధువును డబ్బు వసూలు కోసం తీసుకువచ్చారు. ఆయన ఓసారి ట్రాక్టర్‌ ఇసుకను రూ.7,500కు పోసి, రంజిత్‌కు రూ.6వేలే ఇచ్చాడని సమాచారం. దీంతో విషయం తెలిసి రంజిత్‌ ఆయనను పక్కకు పెట్టడంతో కక్ష్య పెంచుకుని, మంద సాగర్‌ ఇతరులతో కలిసి హత్యకు బీజం వేసినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం అవన్నీ తప్పు డు ప్రచారాలని కొట్టిపారేశారు.

ఎవరూ లేనప్పుడు డబ్బు తీసుకుందామని..
నిందితుడు సాగర్‌ బాలుడి తల్లికి బుధవారం ఫోన్‌చేసి డబ్బును తన మెకానిక్‌ షాపు ఉన్న మూడు కొట్ల చౌరస్తా వద్దకు తీసుకురమ్మని చెప్పాడు. దీంతో రంజిత్‌రెడ్డి డబ్బులను బ్యాగ్‌లో ఉంచి చౌరస్తా వద్ద వాహనంతో పాటు వేచి చూశాడు. అప్పటికే అక్కడ మఫ్టీలో ఉన్న పోలీసులు వెళ్లిపోయాక తెచ్చుకోవాలని భావించినా సాధ్యం కాలేదని సమాచారం. అందుకే రాత్రి మరోసారి ఫోన్‌ చేసి ఇంకో స్థలం వద్దకు రమ్మనడం, అంతలోనే పోలీసులు సాగర్‌ను అదుపులోకి తీసుకున్నారని సమాచారం. ఇక రంజి త్‌ డబ్బుతో వేచి ఉన్నప్పుడు అక్కడికి సమీపంలోని సొంత మెకానిక్‌ షాపులో ఉన్న నిందితుడు సాగర్‌ ఓసారి ఆయన దగ్గరకు వెళ్లి విషయమేమిటని ఆరా తీసినట్లు తెలిసింది. దీంతో అక్కడ నుంచి వెళ్లిపోవాలని రంజిత్‌ సూచించాడట. అంతేకాకుండా సాగర్‌ షాపులోనే కొంద రు మఫ్టీ కానిస్టేబుళ్లు ఉండగా, వారిని చూసి అందరినీ ఫూల్స్‌ చేయడంపై తనలో తాను నవ్వుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడని సమాచారం.

నిందితుడు చిక్కింది ఇలా..
కిడ్నాప్, హత్య కేసులో నిందితుడు మంద సాగర్‌ డబ్బును తన మెకానిక్‌ షాపు ఎదురుగా ఉన్న మూడు కొట్ల చౌరస్తా దగ్గరికి తీసుకుమ్మని ఫోన్‌ చేయగా, డబ్బు సంచితో బాలుడి తండ్రి రంజిత్‌ వచ్చి రోడ్డుపై నిలబడ్డాడు. అలాగే, చుట్టూ పోలీసులు మప్టీలో ఉండి కిడ్నాపర్‌ కోసం వేచిచూస్తున్నారు. ఇందులో కొందరు పోలీసులు కిడ్నాపర్‌ మెకానిక్‌ షాపులో కూర్చున్నారు. ఈ మేరకు షాపుకు వచ్చిన కొందరు మాట్లాడుతూ బ్యాగ్‌లో రూ.45 లక్షలు లేవని, నకిలీ నోట్లు ఉండవచ్చ ని చర్చించుకోవడం నిందితుడు విన్నాడు. దీంతో మరోసారి బాలుడి తండ్రికి ఫోన్‌ చేసి ‘బ్యాగ్‌లో నకిలీ నోట్లు ఉంచి నన్ను మోసం చేయాలనుకుంటున్నావా, నేను అంతా చూస్తున్నా.. డ్రోన్‌ కెమెరా, మఫ్టీ పోలీసులు’ అంటూ మాట్లాడాడు. అయితే, ఇవి నిజమైన నోట్లేనని రంజిత్‌ చెప్పగా, అప్పటి వరకు వాయిస్‌ ఛేంజ్‌ యాప్‌ ద్వారా ఇంటర్‌నెట్‌ కాల్‌ చేసిన నిందితుడు... ఆ తర్వాత స్కైప్‌ ద్వారా ఫోన్‌ చేసి బ్యాగులోని నోట్లను చూశాడు. తన ముఖం కనపడకుండా జాగ్రత్తపడినా.. ఆయన మాట్లాడిన ఫోన్‌ నంబర్‌ డిస్‌ప్లే కావడంతో సైబర్‌ క్రైం టీం నిందితుడిని అరెస్టు చేసింది.

వెలుగులోకి వస్తున్న నేరాలు
నిందితుడు సాగర్‌ ఇద్దరు బావలు పోలీసుశాఖలో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. వారి కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తానని పదేపదే చెప్పేవాడట. అందులో భాగంగానే ఈజీ మనీ సంపాదించడం కోసం యూట్యాబ్‌ ద్వారా నిరంతరం టెక్నాలజీ మీద పట్టు సాధించాడు. గతంలో ఇజ్రాయిల్‌ కంపెనీకి చెందిన ఒక యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోని, ఒక యువతిని వేధించాడు. ఈ వేధింపుల కేసులో సాగర్‌ పోలీసులకు చిక్కలేదు. తాజా ఘటనతో సాగర్‌ లీలలు ఒక్కొక్కొటిగా బయటకు వస్తున్నాయి. 

యూట్యాబ్‌లో చూసి ఇంటర్‌నెట్‌ కాలింగ్‌ నేర్చుకున్న నిందితుడు
‘ఐ డోంట్‌ వాంట్‌ ఏ ఫర్‌ఫెక్ట్‌ లైఫ్‌... ఐ వాంట్‌ ఏ హ్యాపీ లైఫ్‌’ ఇదీ దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్, హత్య కేసులో నిందితుడు మంద సాగర్‌ తన ఫేస్‌బుక్‌ వాల్‌పై రాసుకున్న వ్యాఖ్యలు. సులువుగా డబ్బు సంపాదించడం, జల్సా చేయడానికి డబ్బు కోసం అభంశుభం తెలియ ని తొమ్మిదేళ్ల దీక్షిత్‌ను నిందితుడు మంద సాగర్‌ కిరాతంగా గొంతునలిమి చంపి, ఆపై పెట్రోలు పోసి తగులబెట్టినట్లు పోలీసులు గుర్తించారు. దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ సమయాన కూడా ఆయన ‘గ్రేట్‌ పోలీస్‌’ అంటూ ఫేస్‌బుక్‌లో కామెంట్‌ చేశాడు. ఇప్పుడు కూడా నిందితుడు సాగర్‌ను దిశ నిందితుల మాదిరిగా ఎన్‌కౌంటర్‌ చేసి తగిన బుద్ధి చెప్పాలని హత్య జరిగిన గుట్ట వద్ద ప్రజలు ధర్నా నిర్వహించటం చర్చనీయాంశంగా మారింది.

కంట్రోల్‌ చేయలేక గంటలోనే హత్య
జల్సాలకు అలవాటుపడిన నిందితుడు సాగర్‌ సులువుగా డబ్బు సంపాదించేందుకు తమ ఇంటి పక్కనే ఉన్న రంజిత్‌రెడ్డి కుమారుడిపై కన్ను పడింది. బాలుడిని కిడ్నాప్‌ చేసి డబ్బు డిమాండ్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. తాత –నానమ్మ ఉన్న శనిగపురానికి బాలుడు వచ్చినప్పుడు చనువు పెంచుకున్నాడు. ఇందులో భాగంగా మహబూబాబాద్‌ కృష్ణా కాలనీలో ఆదివారం ఆడుకుంటున్న దీక్షిత్‌(9)ను నిందితుడు మంద సాగర్‌ బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. జిల్లా కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నారం శివారు దానమయ్య గుట్టపైకి తీసుకెళ్లాడు. అయితే, తెలిసిన వ్యక్తే కావడంతో దీక్షిత్‌ స్నేహితులకు టాటా చెప్పి వెళ్లాడు. కొద్దిసేపటికి చీకటి పడగా ఇంటికి తీసుకెళ్లాలని దీక్షిత్‌ గొడవ చేశాడు. ఎలా కంట్రోల్‌ చేయాలో తెలియక అప్పటికే తన వద్ద ఉన్న మత్తు గోళీ వేసినా దీక్షిత్‌ పడుకోకపోవడంతో గొంతు నులిమి, తలను బండ రా యికి బాదగా మృతి చెందాడు. ఆ తర్వాత జిల్లా కేంద్రానికి వెళ్లి పెట్రోలు తీసుకుని మృతదేహం వద్దకు వచ్చి పెట్రోల్‌ పోసి కాల్చివేశాడు. హత్య చేసిన అనంతరమే రాత్రి 9.15 గంటలకు ఇంటర్‌నెట్‌ కాల్‌ చేసి డబ్బు డిమాండ్‌ చేశాడు. 

రైలులో ప్రయాణించేటప్పుడు..
పోలీసుల విచారణలో భాగంగా నిందితుడు ఇంటర్‌నెట్‌ ద్వారా కా లింగ్‌ చేయటంపై తెలుసుకున్న ఆసక్తికర విషయాన్ని చెప్పినట్లు సమాచారం. ఒకసారి రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తన స్నేహితు డు ఇంటర్‌నెట్‌ కాలింగ్‌ ద్వారా సాగర్‌కు ఫోన్‌ చేసి వేరెవరో ఫోన్‌ చేసినట్లు ఆట పట్టించాడు. అలా మొదటిసారి ఇంటర్‌నెట్‌ కాలింగ్‌ వివరాలను ఇంటర్‌ చదివిన ఆటో మెకానిక్‌ మంద సాగర్‌ తెలుకున్నాడు. ఆ తర్వాత యూట్యూబ్‌ ద్వారా అవగాహన పెంచుకున్నాక, అదే విధానంలో బాలుడి తల్లికి ఫోన్‌ చేశాడు.

ఆది నుంచి వివాదాలే..
నిందితుడు మంద సాగర్‌ శనిగపురంలో ఆది నుంచి వివాదాస్పదంగా ప్రవర్తించేవాడని స్థానికులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం ఆయనకు ఓ యువతితో వివాహం నిశ్చయం కాగా, ఆ అమ్మాయిని శివా రు ప్రాంతానికి పిలిచి అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. అలాగే ఇటీవల తన తాత చేయి విరగొట్టాడని సమాచారం. గతంలో పోలీసుల వద్ద డ్రైవర్‌గా పని చేసిన సాగర్‌ పట్టణంలో రెండేళ్లుగా మెకానిక్‌ షాపు నిర్వహిస్తున్నాడు.

గుట్టపైనే పంచనామా, స్వగ్రామంలో అంత్యక్రియలు
దీక్షిత్‌రెడ్డి మృతదేహంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించడంతో మృతదేహం పూర్తిగా గుర్తుపట్టలేని స్థితికి చేరుకుంది. దీంతో ఘటనా స్థలా నికే ఫోరెన్సిక్‌ నిపుణులు, జిల్లా ప్రధాన వైద్యశాల వైద్యులను తీసుకొచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహన్ని పోలీసులు ఆయన తండ్రి స్వగ్రామమైన శనిగపురానికి తరలించగా వారి వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement