
అనంతపురం క్రైం: పోక్సో కేసులో ఇద్దరిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వివరాలను గురువారం అనంతపురం మూడో పట్టణ సీఐ కత్తి శ్రీనివాసులు వెల్లడించారు. నగరంలోని హనుమాన్ కాలనీకి చెందిన రమణకు ఇద్దరు భార్యలు. జులాయిగా తిరిగే రమణ మద్యం, ఇతర వ్యసనాలకు బానిస. ఇతని ప్రవర్తనతో విసిగిపోయిన మొదటి భార్య వేరుగా జీవనం సాగిస్తోంది. కొన్ని నెలలుగా మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీకి చెందిన బాలికను ప్రేమ పేరుతో నమ్మించి గత నెల 25న ధర్మవరానికి తీసుకెళ్లాడు.
మరుసటి రోజు అక్కడే ఓ ఆలయంలో బాలికను పెళ్లి చేసుకుని స్నేహితుడు మహేష్ సాయంతో ధర్మవరంలోనే ఓ ఇంటిలో బాలికను ఉంచాడు. బాలిక కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు గత నెల 25న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గత నెల 30న బాలికను గుర్తించి పోలీసు స్టేషన్‌కు తరలించారు. విచారణ అనంతరం బాలిక ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా రమణపై పోక్సోతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సహకరించిన మహేష్‌పై కూడా కేసులు నమోదయ్యాయి. గురువారం ఉదయం స్థానిక రైల్వేస్టేషన్‌లో నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
(చదవండి: ఫోర్జరీ కేసు కీలక మలుపు)