
హైదరాబాద్, సాక్షి: ప్రముఖ జ్యువెలరీ స్టోర్ లలితాలో జరిగిన చోరీ మిస్టరీ వీడింది. సేల్స్‌మెన్ దృష్టి మళ్లించి ఓ మహిళ నగలు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఈ మిస్టరీని పోలీసులు చేధించారు. ఆ కిలాడీ లేడీని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
నగరంలోని చందానగర్ లలితా జ్యువెలరీ స్టోర్ బ్రాంచ్‌లో డిసెంబర్ 31వ తేదీన నగలు కనిపించకుండా పోయాయి. దీంతో చోరీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. స్టోర్‌లో పలువురిని విచారించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినా.. తొలుత లాభం లేకపోయింది. దీంతో ఈ కేసు మిస్టరీగా మారింది. అయితే పదే పదే ఫుటేజీలను గమనించిన క్రమంలో.. మెరుపు వేగంతో నగలు మాయం చేసిన ఓ మహిళ కనిపించింది.
ఖతర్నాక్ కిలాడీ
ఈ కేసులో చోరీకి పాల్పడిన మహిళను సరూర్ నగర్‌కు చెందిన గౌతమిగా గుర్తించారు. విశేషం ఏంటంటే.. గౌతమి నగరంలో 13 చోరీ కేసుల్లో నిందితురాలు. రద్దీగా ఉండే జ్యువెల్లరీ షాపులే లక్ష్యంగా చేసుకుని చేతివాటం ప్రదర్శిస్తూ వస్తోంది. క్షణాల్లో దొంగతనాలు చేసి మాయమైపోవడంలో దిట్ట అయిన గౌతమిని మొత్తానికి పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment