9 మంది నిందితుల రిమాండ్
పక్కా స్కెచ్.. ఆపై రీల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్
నమ్మిన స్నేహితుడే ఈ కేసులో కీలకం
రెండు రోజుల్లోనే కేసును ఛేదించిన బాచుపల్లి పోలీసులు
హైదరాబాద్: ప్రగతినగర్‌లో జరిగిన ప్రతీకార హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. 9 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరో నలుగురు మైనర్లు ఉన్నారు. ఎస్‌హెచ్‌ఓ ఉపేందర్ కథనం ప్రకారం వివరాలు.. గత ఏడాది అక్టోబర్ 24న తెల్లవారుజామున ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి దాసారం బస్తీలో తరుణ్‌రాయ్ హత్యకు గురయ్యాడు.
ఈ కేసులో ఏ–1గా షేక్ షరీఫ్ అలియాస్ అమీర్ షరీఫ్, ఏ–2గా అభిషేక్, అలియాస్ అభి, ఏ–3గా పిల్లి తేజస్ అలియాస్ తేజు, అలియాస్ డీల్, ఏ–4గా బండ నాగరాజు, ఏ–5గా రాహుల్, ఏ–6గా రాబిన్ బెన్నీలు నిందితులు. వీరిని ఎస్‌ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. షేక్ షరీఫ్, తేజస్‌లు రెండు నెలల క్రితం బెయిల్‌పై విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన వీరిని ఎలాగైనా హత్య చేయాలని తరుణ్‌రాయ్ అనుచరులు పథకం రచించారు. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన తేజస్ బోరబండ నుంచి ప్రగతినగర్‌కు వచ్చి తన తల్లితో కలిసి అద్దె ఇంటిలో ఉండేవాడు.
పక్కా ప్రణాళికతో..
తరుణ్‌రాయ్ బంధువులైన రోహిత్‌తో పాటు అతని అనుచరులు దినేష్ తదితరులు తేజస్‌ను హత్య చేయాలని పథకం వేసుకున్నారు. ఈ క్రమంలో ఎవరికీ అనుమానం రాకుండా శివప్పను ప్రగతినగర్‌లో ఉంటున్న తేజస్ దగ్గరకు మద్యం తాగడానికి పంపించారు. దీంతో శివప్పతో పాటు కౌశిక్, మహేశ్ ముగ్గురూ ఈ నెల 7న ప్రగతినగర్‌లోని తేజస్ ఇంటికి చేరుకుని రాత్రి 11 గంటల వేళ మద్యం తాగుతున్నారు. ఇదే సమయంలో మోతీనగర్‌లోని అల్‌సఫా హోటల్‌లో రోహిత్‌తో పాటు మరో 13 మంది తేజస్ హత్యపై చర్చించారు. శివప్ప ప్రగతినగర్‌లోని ఇంటి లొకేషన్‌ను షేర్ చేశాడు. తెల్లవారుజాము 2 గంటల సమయంలో సమీర్, సిద్ధేశ్వర్ నాయక్, జయంత్‌లు బైక్‌పై వచ్చారు. రోహిత్, దినే‹Ù, ప్రతీక్, రాహుల్, సునీల్, గానప్ప, సంతోష్, శ్రీకర్‌లు బైక్‌లపై లొకేషన్‌కు చేరుకుని చుట్టు పక్కల ప్రాంతాలను పరిశీలించారు.
ఇదే సమయంలో శివప్ప సిగరెట్ తాగేందుకు కిందికి వెళదామనడంతో అందరూ కలిసి వచ్చారు. మద్యం మత్తులో ఉన్న తేజస్‌ను శివప్ప తన స్కూటీపై ఎక్కించుకుని సమీర్, జయంత్, సిద్ధేశ్వర్‌ల ఎదుట నిలిపాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన తేజస్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించే లోపే జయంత్, సిద్ధేశ్వర్ కత్తులతో తేజస్‌పై దాడి చేశారు. వెంటనే సమీర్ సిమెంట్ రాయితో తలపై బలంగా కొట్టాడు. అప్పటికే తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయిన తేజస్ రోడ్డుపై పడిపోయాడు. దాడి చేసే క్రమంలో సిద్ధేశ్వర్ చేతికి గాయమైంది. దీంతో వెంటనే శివప్ప.. సిద్ధేశ్వర్ నుంచి కత్తి తీసుకుని తేజస్ గొంతు కోశాడు. మర్మాంగాలపై రాళ్లతో దాడి చేశాడు. తేజస్ చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం అందరూ అక్కడి నుంచి డాన్సులు చేసుకుంటూ బైక్‌పై రీల్స్ చేసుకుంటూ వెళ్లిపోయారు.
తేజస్ ఇంటిని అదీనంలోకి తీసుకుని..
ప్రగతినగర్‌లో నివాసం ఉంటున్న తేజస్ నివాసానికి తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో చేరుకున్న సుమారు 10 మందికి పైగా అతని ఇంటి పరిసరాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. దాడి అనంతరం 10 నిమిషాల్లోనే తేజస్‌ను హత్య చేసి పరారయ్యారు.
సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. రోహిత్, సమీర్, సిద్ధేశ్వర్, శివప్ప, గణేశ్, సునీల్, రాహుల్, తిరుమల్, మహేశ్‌లను రిమాండ్‌కు తరలించారు. దినేష్‌ను అరెస్ట్ చేయాల్సి ఉందని, ఈ కేసులో నలుగురు మైనర్లు సైతం ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితులు వినియోగించిన ఆరు సెల్ ఫోన్లు, నాలుగు బైక్‌లు స్వా«దీనం చేసుకున్నారు. బాలానగర్ జోన్ డీసీపీ ఆదేశాలతో కూకట్‌పల్లి ఏసీపీ శ్రీనివాస్‌రావు నేతృత్వంలో కేసును ఛేదించిన ఎఎస్‌ఎహ్‌ఓ ఉపేందర్, ఎస్‌ఐలు మహేశ్, సత్యనారాయణ, కానిస్టేబుళ్లు రాజేశ్, యాదగిరి, బాల్‌రాజ్‌లను ఉన్నతాధికారులు అభినందించారు.
నాడు తేజస్.. నేడు శివప్ప..
తరుణ్‌రాయ్ హత్య కేసులో ఏ–3గా ఉన్న తేజస్.. తరుణ్‌రాయ్‌కి నమ్మకంగా ఉండేవాడు. దీంతో అప్పట్లో ప్రత్యర్థులు తేజస్‌ను నమ్మకంగా వాడుకుని తరుణ్‌కు సంబంధించిన కదలికలను తెలుసుకుని అనువైన సమయం కోసం వేచి చూసి హత్య చేశారు. ఇదే క్రమంలో తరుణ్‌రాయ్ అనుచరులు సైతం తేజస్‌కు నమ్మకంగా ఉండే శివప్పను ప్రలోభపెట్టి తేజస్‌ను హత్య చేయడం గమనార్హం.
అందరూ నేర చరిత్ర కలిగిన వారే..
తేజస్ హత్యకేసు నిందితుల్లో అందరూ నేర చరిత్ర కలిగిన వారే ఉన్నారు. తిరుమల్ రౌడీ షీటర్ కాగా..సిద్ధేశ్వర్ మర్డర్ కేసులో నిందితుడు. మిగతా వారిపై సైతం పలు రకాల కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. కాగా అందరూ 25 సంవత్సరాల వయసు లోపు వారే కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment