సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్య ఉదంతం కేసుపై డీసీపీ వెంకటేశ్వర్లు శనివారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలియజేశారాయన.
ప్రవళిక 15 రోజుల కిందటే హాస్టల్‌లో చేరింది. ఆమె శివరామ్ రాథోడ్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఆ సంగతి ఆమె తల్లిదండ్రులకు తెలుసు. కానీ, అతను ఆమెను మోసం చేశాడు. వేరే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. అది తెలిసి ప్రవళిక డిప్రెషన్‌లోకి వెళ్లింది. వాట్సప్ ఛాటింగ్, సీసీటీవీ ఫుటేజీలతో ఈ వ్యవహారం బయటపడింది. అది తట్టుకోలేక ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది అని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.
సూసైడ్ నోట్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాం. శివరామ్‌తోనే ఆమె చివరిసారిగా కాల్ మాట్లాడింది. పూర్తి దర్యాప్తు తర్వాత అతనిపై చర్యలు ఉంటాయని డీసీపీ స్పష్టం చేశారు.
ప్రవళిక మృతికి.. పరీక్ష వాయిదాకి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటివరకు ప్రవళిక ఎలాంటి పోటీ పరీక్షకు హాజరు కాలేదు. పూర్తిగా వ్యక్తిగతమైన అంశాలే ప్రవళిక ఆత్మహత్యకు కారణం. కాబట్టి.. ఎటువంటి అవాస్తవాలు ప్రచారం చేయొద్దు అని డీసీపీ వెంకటేశ్వర్లు కోరారు.
కేసు వివరాలు..
వరంగల్ జిల్లా బిక్కాజీపల్లికి చెందిన మర్రి ప్రవళిక.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ గ్రూప్-2 పరీక్షకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో.. శుక్రవారం ఎవరూ లేని టైంలో గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే.. ఆమె పరీక్ష వాయిదా కారణంగానే ఆమె తీవ్ర మనోవేదనకు గురైందని.. ఆ ఒత్తిడిలోనే ఆత్మహత్యకు పాల్పడిందని విద్యార్థి జేఏసీ ప్రతినిధులు, విపక్ష పార్టీ సభ్యులు, కొందరు ఉద్యోగాభ్యర్థులు ఆందోళనకు దిగారు. దీంతో శుక్రవారం అర్ధరాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆపై నిరసనకారుల్ని అరెస్ట్ చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
మరోవైపు ఆత్మహత్య కాదని.. పరీక్షల వాయిదాతో ప్రభుత్వం చేసిన హత్య అంటూ రాజకీయ విమర్శలు తెరపైకి వచ్చాయి. ఇదిలా ఉండగానే.. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సైతం ప్రవళిక మృతిపై పోలీస్ శాఖను నివేదిక కోరారు. పోలీస్ బందోబస్తు మధ్య.. శనివారం మధ్యాహ్నం తర్వాత ప్రవళిక అంత్యక్రియలు పూర్తయ్యాయి. చివరకు.. ఆమె మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని దర్యాప్తు ద్వారా పోలీసులు తేల్చి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment