చంద్రగిరి మండలంలోని రామిరెడ్డిపల్లి, కూచువారిపల్లిల్లో విధ్వంసంపై చర్యలు
అల్లరిమూకల అరెస్టుకు రంగం సిద్ధం
చంద్రగిరి/తిరుపతి లీగల్: ఎన్నికల నేపథ్యంలో సోమవారం తిరుపతి జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని రామిరెడ్డిపల్లి పంచాయతీ కూచువారిపల్లిల్లో టీడీపీ నాయకుల విధ్వంసకాండపై పోలీసులు కేసులు నమోదు చేశారు. టీడీపీ, వైఎస్సార్‌సీపీ బాధితుల ఫిర్యాదు మేరకు రెండు వర్గాలకు చెందిన పలువురిపై కేసులు పోలీసులు నమోదు చేసినట్లు సమాచారం.
ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి గన్‌మెన్ ఈశ్వర్‌రెడ్డి, పీఏ వేణుగోపాల్‌రెడ్డిపై దాడి చేసి గాయపరచడంతో పాటు వారిని నిర్బంధించిన ఘటనపైనా కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఇదే దుర్ఘటనలో సర్పంచ్ కొటాల చంద్రశేఖర్‌రెడ్డితో పాటు అయన అనుచరుల్ని తీవ్రంగా గాయపర్చడంతో పాటు హత్యాయత్నానికి పాల్పడి, సర్పంచ్ ఇంట్లో విలువైన వస్తువులు, ఆభరణాలను దోచుకెళ్లి, ఇంటిని పూర్తిగా కాల్చి ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనిపై సుమారు 100 మందికి పైగా పచ్చగూండాలపై కేసులు నమోదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
విధ్వంసకాండపై కేసుల నమోదు
రామిరెడ్డిపల్లి, కూచువారిపల్లిల్లో చోటు చేసుకున్న విధ్వంసకాండపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. కర్రలు, రాడ్లు, రాళ్లు, కత్తులతో దాడులు చేసి తీవ్రంగా గాయపరచడం, వాహనాలకు నిప్పంటించడం, ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి దాడులకు పాల్పడటం, ఇంట్లోని విలువైన బంగారం, వెండి, నగదుతో పాటు ఇతర వస్తువులను దోచుకెళ్లడం, ఇళ్లను ధ్వంసం చేసి, దగ్ధం చేయడం వంటి ఘటనలపై సెక్షన్ 143, 147, 452, 427, 323, 324, 380, 435, 436, ఐపిసీ రెడ్‌విత్ 149 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఆ గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
హింసాకాండ ఘటనలో 13 మందికి రిమాండ్
శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద వైఎస్సార్‌సీపీ, టీడీపీ నేతల మధ్య జరిగిన ఘటన కేసులో ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు 13 మందిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. వీరికి ఈనెల 29 వరకు రిమాండ్ విధిస్తూ తిరుపతి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వాణిశ్రీ గురువారం ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment