
డ్రైవర్ నిద్ర మత్తులో తూగడంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, నలుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు.
రాప్తాడు (అనంతపురం జిల్లా): డ్రైవర్ నిద్ర మత్తులో తూగడంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, నలుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన రాప్తాడు వద్ద జాతీయ రహదారి-44పై మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటలకు చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... బెంగళూరుకు చెందిన ఎస్‌ఆర్‌ఎస్ ట్రావెల్స్ బస్సు (కేఏ51 ఏసీ 6440) హైదరాబాద్ నుంచి బెంగళూరుకు సోమవారం రాత్రి 20 మంది ప్రయాణికులతో బయలుదేరింది.
మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు అనంతపురంలోని తపోవనం ప్రాంతానికి చేరింది. తపోవనంలో మరొక డ్రైవర్ షఫీవుల్లా డ్రైవింగ్ తీసుకున్నాడు. రాప్తాడు దగ్గరకు రాగానే నిద్రమత్తులో తూగాడు. బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి దిగింది. దాదాపు 500 మీటర్ల దూరం వెళ్లి బోల్తా పడింది. డ్రైవర్ షఫీవుల్లాతో పాటు బెంగళూరుకు చెందిన సురేష్ గౌడ్, మహమ్మద్ షఫీవుల్లా, మహమ్మద్ షేక్ ఆరిఫ్, మహమ్మద్ షమీవుల్లాకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని హైవే సిబ్బంది 108 వాహనంలో సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ ఆంజనేయులు కేసు నమోదు చేశారు.