ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, సూర్యాపేట క్రైం : రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో గుట్టుగా వ్యభిచారం సాగుతోంది. పట్టణంలోని అంజనాపురి కాలనీకి చెందిన ఓ మహిళ బాలికల చేత వ్యభిచారం చేయిస్తున్నట్లు సమాచారం. ఈమెతోపాటు మరో ముగ్గురు కలిసి వివిధ చోట్ల వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్నట్లు గురువారం వెలుగుచూడడంతో ఈ విషయం జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి సమయంలో హైటెక్ బస్టాండ్ సమీపంలో ఓ బాలిక (13) ఫూటుగా మద్యం సేవించి ఉండడంతో ఓ వ్యక్తి 181 సఖి కేంద్రానికి సమాచారం చేరవేశారు. సఖి కేంద్రం నిర్వాహకులు ఆ బాలికను అదుపులోకి తీసుకుని విచారించారు. (పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో..)
తన స్వస్థలం సూర్యాపేట పట్టణమేనని.. తనకు తల్లి కూడా ఉన్నట్లు విచారణలో చెప్పింది. అంజనాపురి కాలనీకి చెందిన మహిళ తనతోపాటు మరో 15మంది బాలికల చేత వ్యభిచారం చేయిస్తున్నట్లు సమాచారం ఇచ్చింది. ఈ క్రమంలో మూడు రోజులక్రితం ఆ బాలిక వారినుంచి తప్పించుకుంది. దీంతో సఖి కేంద్రం నిర్వాహకులు ఈ విషయాన్ని సూర్యాపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెతికి మళ్లీ ఆ బాలికను సఖికేంద్రం వారికి అప్పగించారు. బాలికను గురువారం నల్లగొండ శిశు సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు సూర్యాపేట సఖి కేంద్రం నిర్వాహకులు తెలిపారు.
బాలికలకు డ్రగ్స్, మద్యం
సదరు మహిళ.. బాలికలకు మద్యం, గుట్కాలు, డ్రగ్స్, గంజాయి అలవాటు చేయడంతోపాటు హార్మోన్ ఇంజెక్షన్లు కూడా వేయిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యభిచారం మార్చి నుంచే జిల్లా కేంద్రంలో నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. అంజనాపురి కాలనీలోనే కాకుండా విద్యానగర్‌లో కూడా వ్యభిచారం దందా నడిపిస్తున్నట్లు సమాచారం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బాలికల చేత వ్యభిచారం నడిపిస్తున్న ముఠా సభ్యుల గుట్టు రట్టు చేయడంలో పోలీసుల గోప్యతపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదే విషయమై సూర్యాపేట డీఎస్పీ ఎస్.మోహన్‌కుమార్‌ను వివరణ కోరగా.. బాలికలచే జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ వ్యభిచార గృహం నడిపిస్తున్నట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో పక్కా సమాచారంతో నేరుగా వ్యభిచార గృహంపై దాడి చేసి మహిళ గుట్టు రట్టు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం తమ అదుపులో వ్యభిచార గృహం నిర్వహించే ముఠా సభ్యులు ఎవరూ కూడా లేరన్నారు. (రూరల్ సీఐ పోలీసు వాహనం చోరీ)
ఆమె చెరలో పలువురు బాలికలు
అంజనాపురి కాలనీలోని మహిళ తన నివాసంతో పాటు మరో రెండు నివాస గృహాలను అద్దెకు తీసుకొని వ్యభి చారాన్ని నడిపిస్తున్నట్లు సమాచారం. ఆమెతో పాటు మరో ముగ్గురు కలిసి విద్యానగర్ తదితర ప్రాంతాల్లో ఈ దందాను నడిపిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బాలికలను టార్గెట్ చేసుకుని వారిని వ్యభిచార రొంపిలోకి దింపుతున్నట్లు తెలిసింది. మరో 15మంది బాలికలు వ్యభిచార గహాల్లో ఉన్నట్లు బాలిక ఇచ్చిన సమాచారంతో వెలుగుచూసింది. (కాసేపట్లో పెళ్లి.. అంతలోనే మరో యువతి ఎంట్రీ)
కూతవేటు దూరంలో ఠాణాలు.. ఇంటలిజెన్స్ సీఐ కార్యాలయం
అంజనాపురి కాలనీకి సూర్యాపేట పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లు కూతవేటు దూరంలోనే ఉంటాయి. కానీ పోలీసులు పూర్తిస్థాయిలో రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిరంతరం ఆ రహదారిపై పోలీసు అధికారులు, సిబ్బంది తిరగడమే కాకుండా.. అదే ప్రాంతంలో ఇంటలిజెన్సీ సీఐ కార్యాలయం కూడా ఉంటుంది. కానీ, హైటెక్ బస్టాండ్ సమీపంలో బాలిక తిరుగుతుండగా.. అజ్ఞాతవాసి సఖి కేంద్రానికి ఇచ్చిన సమాచారంతో వెలుగుచూసిన సెక్స్ రాకెట్ లీలలను కనుగొనలేకపోవడంలో ఆంతర్యమేమిటో అంతుచిక్కడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment