
సాక్షి, విశాఖపట్నం : విశాఖ రెల్లివీధిలో మనిషి పుర్రె కలకలం సృష్టించింది. ఓ పాడుబడిన ఇంటి వద్ద కాల్చిన మనిషి పుర్రె వెలుగు చూడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం రెల్లి వీధిలో ఓ పాడుబడిన ఇల్లు ఉంది. ఆ ఇంటికి దగ్గరలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. పాడుబడ్డ ఇంటి వద్ద ఆదివారం వారికి అనుమానాస్పదంగా ఓ సంచి కనిపించింది. కర్ర సహాయంతో దాంట్లో ఏం ఉందో చూసే ప్రయత్నం చేయగా.. అందులో నుంచి కాల్చి ఉన్న ఓ మనిషి పుర్రె బయటపడింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన వారు కేకలు వేయగా స్థానికులు గుమిగూడారు. ( లోపల మహిళ శవం.. పైన కూరగాయలు)
కాగా, పాడుబడిన ఇంట్లో రావెలపూడి రాజు(20) అనే యువకుడు ఉంటున్నాడని, ప్రతి రోజు రాత్రి అక్కడికి వస్తూ ఏం చేస్తున్నాడో తెలియడం లేదని స్థానికులు భయపడుతున్నారు. సదరు యువకుడు చెడు వ్యసనాలకు బానిసై సైకోగా మారి మనిషి పుర్రెను కాల్చుకుని తింటూ ఉండవచ్చని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో సదరు యువకుడు అక్కడికి రాగా.. కాలనీవాసులు పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే అతడు పారిపోయాడు. ఆ అనంతరం స్థానికుల కేకలు విని పాడుబడిన ఇంట్లో నుంచి ఓ యువతి బయటకు వచ్చింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సదరు యువతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే యువకుడిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
Comments
Please login to add a commentAdd a comment