మృగాడి చేతిలో ఛిద్రమైన ఆ సోదరి.. ఆరు రోజులపాటు కారడవిలో అలాగే ఉండిపోయింది. ఆకలి, దప్పికలు లేక అల్లలాడిపోయింది. ప్రాణం పోయేలోపు తాను పడ్డ నరకం గురించి ఎవరికైనా చెప్పాలన్న తాపత్రయమే ఆమెకు కొన ఊపిరితో ఉంచింది. ఆమె సంకల్పానికి వైద్యులు సైతం ‘అద్భుతం’ అంటూ ఆశ్చర్యపోయారు. కానీ, ఈ లోపే నష్టం జరిగిపోయింది.
రాజస్థాన్‌లో తాజాగా సంచలనం సృష్టించిన మహిళ అత్యాచార ఘటన విషాదాంతంగా ముగిసింది. 35 ఏళ్ల బాధితురాలు వారం రోజుల నరకయాతన తర్వాత తుది శ్వాస విడిచింది. ఆమెను కాపాడి ఆస్పత్రిలో చేర్చినప్పటి నుంచి వెంటిలేటర్ మీదే చికిత్స పొందుతోందని, నిందితుల దాడిలో తీవ్రంగా గాయపడడంతో ఆమె బ్రెయిన్ ఆక్సిజన్‌ను తీసుకోవడం కష్టంగా మారిందని, చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం బాధితురాలు కన్నుమూసిందని నాగౌర్ ఎస్పీ రామ్ మూర్తి శుక్రవారం మీడియాకు వెల్లడించారు.
మిస్సింగ్.. దర్యాప్తుపై నిరసనలు
ఫిబ్రవరి 4వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాధితురాలు.. తిరిగి రాలేదు. దీంతో అంతా వెతికిన కుటుంబ సభ్యులు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. అయితే రోజులు గడుస్తున్నా కేసులో పురోగతి లేకుండా పోయింది. ఈ కేసును దర్యాప్తు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తూ వచ్చారు నాగౌర్ పోలీసులు. దీంతో గ్రామస్తులు రోడ్డెక్కి రహదారిని మూసేయడంతో ఈ కేసు మీడియా దృష్టిని ఆకర్షించింది. విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు పోలీస్ యంత్రాగం కదిలింది. ఈలోపు.. ఫిబ్రవరి 10వ తేదీన అదే గ్రామం శివారులోని అడవిలో ఆమె ఒంటిపై దుస్తులు లేకుండా గాయాలతో.. అచేతనంగా పడి ఉండడం కొందరు గుర్తించారు. అయితే ఆమె కొన ఊపిరితో ఉందని ఆస్పత్రికి తరలించారు.
మైనర్ సాయంతో మృగాడు..
అది దట్టమైన అడవి ఏరియా.. అలా ఆమె అన్నేసి రోజులు స్పృహ లేకుండా ఉండడం పోలీసులను, డాక్టర్లను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. వెంటనే ఆమెను మంచి చికిత్స కోసం జైపూర్‌కు తరలించారు. ఆస్పత్రిలో చేర్చిన తర్వాత కొన ఊపిరితో ఉన్న ఆమె ఇచ్చిన వాంగ్మూలంతో.. నిందితుడిని, అతనికి సహకరించిన ఓ మైనర్‌ను ఎట్టకేలకు పోలీసులు ట్రేస్ చేయగలిగారు. ఫిబ్రవరి 4వ తేదీన ఇంటికి బయలుదేరిన ఆమెను.. ఓ మైనర్ పిలగాడి సాయంతో ఆటోలో కిడ్నాప్ చేశాడు దుండగుడు. నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆపై బండరాయితో ఆమెపై దాడి చేసి.. చనిపోయిందనుకుని దూరంగా అడవిలో ఆమె శరీరాన్ని విసిరేసి వెళ్లిపోయాడు. ఎట్టకేలకు ఆమె వాంగ్మూలం సాయంతోనే పోలీసులు నిందితుడిని, సహకరించిన మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు నాగౌర్ ఎస్పీ.
Comments
Please login to add a commentAdd a comment