అల్లిపురం (విశాఖ దక్షిణ): విశాఖపట్నం మధురవాడలోని వికలాంగుల కాలనీలో ప్లాస్టిక్ డ్రమ్ములో పుర్రె, అస్తిపంజరం బయటపడిన కేసులో చిక్కుముడి వీడింది. పోలీసుల విచారణలో మృతురాలు శ్రీకాకుళం జిల్లా మోదంటి వీధికి చెందిన బమ్మిడి ధనలక్ష్మి(24)గా గుర్తించారు. నిందితుడు శ్రీకాకుళం జిల్లా మందస గ్రామానికి చెందిన దండు రిషివర్ధన్ అలియాస్ కొప్పిశెట్టి రిషివర్ధన్ అలియాస్ రిషిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీస్ కమిషనర్ సీహెచ్.శ్రీకాంత్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. కొమ్మాదిలో వెల్డింగ్ దుకాణం నడుపుతున్న నండూరి రమేష్‌కు వికలాంగుల కాలనీలో ఓ ఇల్లు ఉంది. ఆ ఇంటిని తన వద్ద పనిచేస్తున్న రిషికి 2020 సెప్టెంబర్‌లో అద్దెకు ఇవ్వగా.. అతడు కొంతకాలంగా అద్దె చెల్లించడం లేదు. ఆ ఇంటికి సంబంధించిన కరెంటు బిల్లును మే 2021 నుంచి చెల్లించకపోవడం, బిల్లు ఎక్కువగా వస్తుండటంతో రమేష్ ఆ ఇంటిని చూసేందుకు ఈ నెల 4వ తేదీన వెళ్లాడు.
ఇంటికి తాళం వేసి ఉండగా.. ఇంట్లో లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. ఫ్యాన్లు తిరుగుతున్నాయి. ఇంటి వెనుక తలుపు తీసి ఉండటంతో లోపలకు వెళ్లి చూడగా.. ఓ పక్కన ప్లాస్టిక్ డ్రమ్ము పీవీసీ టేప్‌తో సీల్ చేసి ఉండటం, దుర్వాసన రావటంతో పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి డ్రమ్ము తెరిచిచూడగా.. పుర్రె, అస్థి పంజరం, జుట్టు కనిపించాయి.
వివరాలు వెల్లడిస్తున్న పోలీస్ కమిషనర్ సీహెచ్.శ్రీకాంత్
చున్నీ బిగించి.. డ్రమ్ములో దాచేశాడు
నిందితుడు రిషివర్ధన్ తన భార్యతో కలిసి రమేష్ ఇంట్లో అద్దెకు ఉండేవాడు. భార్య గర్భవతి కావటంతో 2021 జనవరిలో తన అత్తగారి ఊరైన శ్రీకాకుళం బల్లిగూడకు కాన్పు నిమిత్తం పంపించాడు. ఆ తరువాత తరచూ భార్యను చూసేందుకు వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలో 2021 మే 29న శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సు కోసం వేచి ఉండగా.. బమ్మిడి ధనలక్ష్మి (24) అనే మహిళ పరిచయమైంది. ఇద్దరూ ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు.
అక్కడి నుంచి ఇద్దరు కలసి ఆటోలో నాతవరం వరకు ప్రయాణించారు. అదే నెల 30న రిషికి ధనలక్ష్మి పలుమార్లు ఫోన్ చేసింది. తన భార్య ఇంటివద్ద లేదని రిషి చెప్పటంతో ధనలక్షి ఆ రోజు రాత్రి అతడి ఇంటికెళ్లింది. వేకువజామున 4.30 గంటల సమయంలో ధనలక్ష్మి రూ.2 వేలు కావాలని డిమాండ్ చేసింది. తన వద్ద 100 రూపాయలే ఉన్నాయని రిషి చెప్పగా.. అతడి భార్య దుస్తులు, టీవీ ఇమ్మని అడిగింది.
అందుకు తిరస్కరించగా.. తాను అడిగినవి ఇవ్వకపోతే బయటకు వెళ్లి గొడవ చేస్తానని హెచ్చరించడంతో రిషి కోపంతో ఆమె మెడకు చున్నీ బిగించటంతో ప్రాణం విడిచింది. మృతదేహాన్ని బ్లాంకెట్ ప్లాస్టిక్ జిప్ కవర్‌లో ప్యాక్ చేసి.. ఇంట్లోని ప్లాస్టిక్ డ్రమ్‌లో దించి మూతను సెల్లో టేప్‌తో మూసివేశాడు. అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయి తన సెల్‌ఫోన్‌ను 13 రోజులు స్విచ్ఛాఫ్ చేసి ఉంచాడు. ఆ తరువాత ఇంటిని ఖాళీ చేసిన రిషి వెల్డింగ్ షాపులో పని కూడా మానేసి తన అత్తగారింటికి వెళ్లిపోయాడు.
ఇలా దొరికాడు
ఘటనా స్థలంలో మృతురాలు ధనలక్ష్మికి చెందిన బ్యాగ్ లభించగా.. అందులో రిషి ఫోన్ నంబర్ రాసి ఉన్న ఓ స్లిప్ దొరికింది. కాల్ లిస్ట్ ఆధారంగా ఘటన జరగడానికి ముందు మృతురాలి నంబర్ నుంచి అతడి నంబర్‌కు ఫోన్లు రావడాన్ని గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టి మృతురాలి వివరాలతోపాటు నిందితుడిని గుర్తించారు.
ధనలక్ష్మికి తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు ఎవరూ లేకపోవటంతో ఆమె కనిపించడం లేదని ఎక్కడా మిస్సింగ్ కేసు కూడా నమోదు కాలేదు. నిందితుడి ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేయగా.. అతడు 6 నెలలుగా కొమ్మాదిలోని ఒక హాస్టల్‌లో అసిస్టెంట్ కుక్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే కేసు ఛేదించినట్లు కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment