
బారాబంకి (యూపీ): ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లక్నో –అయోధ్య హైవే మీద కొత్వాలి రామ్‌సానెహైగట్ ప్రాంతంలో ఆగి ఉన్న డబుల్ డెక్కర్ బస్సును మితిమీరిన వేగంతో వెనుక నుంచి వచ్చిన ట్రక్కు ఢీ కొంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో బస్సు లోపల, వెలుపల ఉన్నవారు, బస్సు ముందు పడుకొని ఉన్న కూలీలు 18 మంది మరణించారు. మరో 25 మంది గాయపడ్డారు.
పంజాబ్‌లోని లూథియానా నుంచి బిహార్‌కు 130 మంది ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేటు బస్సు మార్గమధ్యంలో యూపీలోని కొత్వాలి ప్రాంతంలో సాంకేతిక సమస్యతో ఆగిపోయింది. దీంతో బస్సుని మరమ్మతు చేయడానికి ఓ పక్కగా ఆపి ఉంచారు. కొందరు ప్రయాణికులు బస్సులో నిల్చొని ఉండగా, కొందరు బస్సులో, కొందరు బస్సు దగ్గర రోడ్డుపై నిద్రిస్తున్నారు. ట్రక్కు హఠాత్తుగా బస్సుని ఢీకొనడంతో 18 మంది మరణించారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల నష్టపరిహారం ప్రకటించారు.