సాక్షి, నాగర్‌కర్నూల్/హైదరాబాద్/ఉప్పునుంతల: శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం వెళుతున్న నలుగురు.. మల్లన్నను దర్శించుకుని తిరిగొస్తున్న మరో నలుగురు.. రెండు కార్లూ వేగంగా దూసుకెళ్తున్నాయి. రెప్పపాటులో భారీ ప్రమాదం.. రెండు కార్లు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొని నుజ్జునుజ్జు అయ్యాయి. ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి (765 నంబర్)పై నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం పిరట్వాన్‌పల్లి–చెన్నారం గేటు మధ్య శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళుతున్న కారులో ఉన్న శివకుమార్ (30), ఆయన తల్లి సుబ్బలక్ష్మి (61), లవమూర్తి (41), అతడి కుమారుడు వెంకటరమణమూర్తి (15) చనిపోయారు. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న కారులో వంశీ (32), వెంకటేశ్ (29), కార్తీక్ (30) మృత్యువాత పడ్డారు. నరేశ్ అనే యువకుడు గాయపడ్డాడు. నరేశ్‌ను మొదట అచ్చంపేట ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఎల్.శర్మన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
తోటి ఉద్యోగి వద్ద కారు తీసుకుని..
మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌కు చెందిన శివకుమార్ సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ హోటల్‌లో షిఫ్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఇప్పటికే వివాహం కాగా విడాకులు తీసుకున్నాడు. మళ్లీ వివాహం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. మంగళవారం పెళ్లిచూపులకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో శ్రీశైలం వెళ్లి మొక్కుకుని రావాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ప్యారడైజ్ హోటల్‌లోనే పనిచేసే భాస్కర్ వద్ద కారు తీసుకున్నాడు. తన తల్లి సుబ్బలక్ష్మి, మిత్రుడు లవమూర్తి, ఆయన కుమారుడు వెంకటరమణమూర్తిలతో కలసి శుక్రవారం మధ్యాహ్నం శ్రీశైలానికి బయలుదేరారు. సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. శివకుమార్ స్వస్థలం ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. 15 ఏళ్ల క్రితమే వారి కుటుంబం హైదరాబాద్ వచ్చి స్థిరపడింది. శివకుమార్ తండ్రి కూడా నాలుగేళ్ల కింద రోడ్డు ప్రమాదంలోనే చనిపోయారు. ఇక ప్రమాదంలో మరణించిన లవమూర్తి స్వస్థలం ఏపీలోని విశాఖపట్నం జిల్లా తుని. శ్రీశైలం మల్లన్న దర్శనానికి రావాలని శివకుమార్ కోరడంతో.. కుమారుడు వెంకటరమణమూర్తిని వెంట తీసుకుని వచ్చారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
స్నేహితులంతా కలిసి వెళ్లి..
హైదరాబాద్‌లోని జీడిమెట్లకు చెందిన వంశీ, నిజాంపేటకు చెందిన వెంకటేశ్, పటాన్‌చెరుకు చెందిన కార్తీక్, అమీన్‌పూర్ మండలం గండిగూడకు చెందిన నరేశ్ నలుగురు స్నేహితులు. వారంతా 2011లో కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు కాలేజీలో కలిసి ఇంటర్మీడియట్ చదివారు. అంతా కలిసి గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బయలుదేరి శ్రీశైలం వెళ్లారు. రాత్రికి అక్కడే ఉండి దర్శనం చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు.
ఇంట్లో చెప్పకుండా వెళ్లి..
నిజాంపేటకు చెందిన తలారి శంకరయ్య, బాలామణిల రెండో కుమారుడు వెంకట్. గురువారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి శ్రీశైలం వెళ్లాడు. అక్కడికి వెళ్లాక కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. తిరిగి ఇంటికి రాకుండానే కన్నుమూశాడు. ఇక వంశీ యూత్ కాంగ్రెస్ నాయకుడు. ఇంకా వివాహం చేసుకోలేదు. తండ్రి వీరాస్వామి, తల్లి అనసూయతో కలిసి జీడిమెట్లలో ఉంటున్నాడు. గండిగూడకు చెందిన నరేశ్ ఓ కొరియర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రమాదం జరిగిన తర్వాత నరేశ్ తమకు ఫోన్ చేశాడని, బాగానే ఉన్నట్టు చెప్పాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
అతివేగమే కారణం?
హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఇతియోస్ కారు, శ్రీశైలం నుంచి హైదరాబాద్ వస్తున్న ఫిగో కారు ఎదురెదురుగా వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. హైదరాబాద్ నుంచి వస్తున్న కారు 100– 120 కిలోమీటర్ల వేగంతో వస్తూ అదుపు తప్పిందని, ఎదురుగా వస్తున్న ఫిగో కారును బలంగా ఢీకొట్టి, కుడివైపు దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్టు తెలిసింది. అత్యంత వేగంగా ప్రయాణిస్తుండటంతో రెండు కార్లు కూడా నుజ్జునుజ్జు అయ్యాయి. మృతదేహాలు కార్లలోనే చిక్కుకున్నాయి. బయటికి తీసేందుకు పోలీసులు గంటన్నరకుపైగా శ్రమించాల్సి వచ్చింది. ఇక కార్లలో ఎయిర్ బెలూన్లు ఉన్నప్పటికీ తెరుచుకోలేదని.. మృతిచెందిన వారిలో ఎవరూ సీట్ బెల్టు పెట్టుకున్న దాఖలాలు లేవని పోలీసులు చెప్తున్నారు.
మృతుల కుటుంబాలకు ప్రధాని సాయం
నాగర్‌కర్నూల్ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రుడి కుటుంబానికి రూ.50 వేలు పరిహారం ఇస్తున్నట్టు ప్రకటించారు.
సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవాలని, తగిన సహాయం అందించాలని స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment