సైదాబాద్‌ చిన్నారి కేసు: ఉన్మాది కథ ముగిసింది! | Saidabad rape accused found dead on railway tracks near Jangaon | Sakshi
Sakshi News home page

సైదాబాద్‌ చిన్నారి కేసు: ఉన్మాది కథ ముగిసింది!

Published Fri, Sep 17 2021 3:39 AM | Last Updated on Fri, Sep 17 2021 7:52 AM

Saidabad rape accused found dead on railway tracks near Jangaon - Sakshi

రాజు మృతదేహాన్ని రైలుపట్టాలపైనుంచి తరలిస్తున్న పోలీసులు

జనగామ/ స్టేషన్‌ఘన్‌పూర్‌/ హైదరాబాద్‌: గురువారం ఉదయం 8 గంటల సమయం.. రైలుపట్టాల దగ్గర ఓ యువకుడు కూర్చుని ఉన్నాడు.. ఆ పక్కనే ఉన్న పొలాలకు వెళ్తున్న రైతులు అతడిని చూశారు.. అనుమానంతో దగ్గరికి వెళ్లారు. వారిని చూసిన యువకుడు పారిపోయే ప్రయత్నం చేశాడు. దొరికిపోతాననే భయంతో అటుగా వస్తున్న రైలు కిందపడి చనిపోయాడు.  

వారం రోజుల కింద..
హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై దారుణంగా హత్యాచారానికి పాల్పడ్డ పల్లకొండ రాజు (28) కథ ఇలా ముగిసింది. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గం చిల్పూరు మండలం నష్కల్‌ స్టేజీ సమీపంలో ఈ ఘటన జరిగింది. కాజీపేట నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్తున్న భువనేశ్వర్‌–ముంబై కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొట్టడంతో రాజు శరీరభాగాలు ఛిద్రమయ్యాయి. మృతదేహం చేతిపై ఉన్న ‘మౌనిక’అనే పచ్చబొట్టు, ఇతర గుర్తుల ఆధారంగా అతడిని రాజుగా నిర్ధారించారు. మృతదేహానికి వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.  

వారం రోజుల కింద.. 
ఈ నెల 9న సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిని అదే ప్రాంతానికి చెందిన రాజు అత్యాచారం చేసి చంపేసిన విష యం తెలిసిందే. అప్పటి నుంచి పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. అతడి ఫొటోలను విడుదల చేశారు. పట్టించిన వారికి రూ.10 లక్షలు రివార్డు ఇస్తామని కూడా ప్రకటించారు. అయితే రాజు ఎవరి కంట పడకుండా నిర్మానుష్య ప్రాంతాల్లో తిరుగుతూ వచ్చాడు. ఈ క్రమం లో రైల్వేట్రాక్‌ వెంబడి వెళ్తూ.. గురువారం జనగామ జిల్లా నష్కల్‌ స్టేజీ సమీపంలోని రాజారాం బ్రిడ్జి 309/1–3 కిలోమీటరు రాయి వద్దకు చేరుకున్నాడు. ఉదయం 8 గంటల సమయంలో రైల్వే కీమెన్లు కుతాటి సారంగపాణి, తాటి కుమార్‌లు ట్రాక్‌ను తనిఖీ చేస్తుండగా.. గడ్డం, పొడవాటి జుట్టుతో ఒక యువకుడు అనుమానాస్పదంగా కనిపించాడు. పట్టాల దగ్గర ఏం చేస్తున్నావని కీమెన్లు అతడిని నిలదీయగా.. ‘మీకెందుకంటూ’ఎదురు వాదనకు దిగాడు. దీంతో వారు రాజు దగ్గరికి వెళ్లగా పట్టాల పక్కన ఉన్న పొదల్లోకి వెళ్లిపోయాడు. కాసేపు వేచి చూసిన కీమెన్లు.. పట్టాలను తనిఖీ చేసుకుంటూ వెళ్లిపోయారు. 

రైతుల కంట పడటంతో.. 
కీమెన్లు వెళ్లిపోయాక రాజు మళ్లీ  పట్టాల దగ్గరికి వచ్చాడు. ఆ పక్కన ఉన్న పొలాల్లోని రైతులు భూక్యా రామ్‌సింగ్, గౌతమ్‌సింగ్‌ పట్టాలపై రాజును చూశారు. హైదరాబాద్‌ చిన్నారి హత్యాచార ఘటన నిందితుడిలా ఉన్నాడని గుర్తించారు. పక్కనే పొలంలో ఉన్న సోదరుడు సురేశ్‌కు ఫోన్‌ చేసి పిలిచారు. ముగ్గురు కలిసి దూరం నుంచే.. ‘‘ఎవరు నువ్వు.. ఇక్కడేం చేస్తున్నావు’’అని ప్రశ్నించారు. రాజు ఆహార్యం, అడ్డదిడ్డంగా సమాధానాలు చెప్పడం చూసి.. కాస్త దూరంలోనే నిలబడ్డారు. ఆ సమయంలో కాజీపేట వైపు వెళుతున్న గూడ్స్‌ రైలు కింద దూకేందుకు రాజు ప్రయత్నించి, ఆగిపోయాడు. అది చూసిన రైతులు.. ‘‘ఏమైంది? ఎందుకు చనిపోదామనుకుంటున్నావు?’’అని ప్రశ్నిస్తూ దగ్గరికి వెళ్లారు. సుమారు 8.45 గంటల సమయంలో కాజీపేట నుంచి సికింద్రాబాద్‌ వెళ్తున్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రావడంతో.. దాని కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైతులు వెంటనే కీమెన్లకు ఫోన్‌ చేయగా.. వారు పోలీసులకు, నష్కల్‌ రైల్వేస్టేషన్‌ మాస్టర్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. రాజు కుడిచేయి మణికట్టు వరకు తెగిపోయింది. ముఖం, శరీరభాగాలు ఛిద్రమయ్యాయి. 

సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం: సీపీ తరుణ్‌ జోషి 
చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న రాజు.. నష్కల్‌ రైల్వే ట్రాక్‌ వరకు ఎలా వచ్చాడనే దానిపై ఆరాతీస్తున్నట్టు వరంగల్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి తెలిపారు. రాజును పట్టుకోవడం కోసం తమ పరిధిలోని ప్రజలను అప్రమత్తం చేశామని, పోలీసు బలగాలతో నిఘా పెట్టామని చెప్పారు. ఈ క్రమంలోనే నష్కల్‌ సమీపంలో పట్టాలపై రాజు మృతదేహం ఉన్నట్టు సమాచారం వచ్చిందని తెలిపారు. ఈ అంశంలో సమగ్ర విచారణ జరిపిస్తున్నామన్నారు. 

రైల్వే పోలీసుల విచారణ 
రైల్వే జీఆర్పీ సీఐ రామ్మూర్తి నేతృత్వంలోని పోలీసు బృం దం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, క్లూస్‌ టీంతో ఆధారాలు సేకరించామని రైల్వే ఎస్సై అశోక్‌కుమార్‌ తెలిపారు. గురు వారం రాత్రి పొద్దుపోయాక సికింద్రాబాద్‌ ఎస్సీ అనూ రాధ సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఘటన స్థలంలో సిమ్‌కార్డులు లేని రెండు సెల్‌ఫోన్లు లభించినట్టు ప్రకటిం చారు. కాగా, రాజు ఉదంతంపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు ఆమె చెప్పారు. 

గంటకు 120 కిలోమీటర్ల వేగంతో..! 
భువనేశ్వర్‌–ముంబై కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. గురువారం ఉదయం 8.30 గంటలకు కాజీపేటకు చేరుకున్న ఆ రైలు.. 8.33 నిమిషాలకు సికింద్రాబాద్‌ వైపు బయలుదేరింది. ఈ మధ్యలో రైలు ఎక్కడా ఆగదు. వీలైనంత వరకు వేగంగా ప్రయాణిస్తుంది. రాజు రైలు కింద పడిన సమయంలో రైలు గరిష్ట వేగంతో ఉన్నట్టు భావిస్తున్నారు.


బాలిక కుటుంబ సభ్యులకు చెక్కు ఇస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్‌. చిత్రంలో మంత్రి మహమూద్‌ అలీ

బాలిక కుటుంబానికి రూ.20 లక్షల చెక్కు 
సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని హోంమంత్రి మహమూద్‌ అలీ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ గురువారం ఉదయం పరామర్శించారు. ప్రభుత్వం తరఫున రూ.20 లక్షల ఆర్ధిక సాయం చెక్కును వారికి అందజేశారు. ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలని బాలిక తల్లిదండ్రులు మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తప్పనిసరిగా తగిన చర్యలు తీసుకుంటుందని వారు హామీ ఇచ్చారు.  

మేం చూస్తుండగానే.. 
ఉదయం 6.30 గంటలకు ఇద్దరు తమ్ముళ్లతో కలిసి వ్యవసాయ బావి వద్దకు వచ్చిన. ఆ సమయంలో ఓ వ్యక్తి ట్రాక్‌పై కూర్చొని కనిపించాడు. పంటపై కోతులు దాడి చేయడంతో.. తమ్ముడు రాంసింగ్, నేను వాటిని తరమడానికి వెళ్లాం. 8.40 గంటల సమయంలో మరో తమ్ముడు గౌతమ్‌సింగ్‌ నా వద్దకు వచ్చాడు. పట్టాల వద్ద గడ్డం, పొడవాటి జుట్టుతో ఓ వ్యక్తి ఉన్నాడని చెప్పడంతో దగ్గరికి వెళ్లాం. అతన్ని చూసి రాజులా ఉన్నాడని అనుకున్నాం. కానీ అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ మేం ముగ్గురం ఉండడంతో.. దొరికిపోతాననే భయంతో అటువైపు వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు వెళ్లిపోయాక దగ్గరికి వెళ్లి చూశాం. చేతిపై మౌనిక అనే పచ్చబొట్టు కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాం.     – రైతు సురేశ్, ప్రత్యక్ష సాక్షి  

పారిపోవడంతో రాళ్లు విసిరినం 
పట్టాలపై ఒక వ్యక్తి కనిపించడంతో పట్టుకునేందుకు ప్రయత్నించాం. కానీ పొదల్లోకి పారి పోయాడు. బయటికి రప్పించేం దుకు రాళ్లు విసిరాం. ఎంతకూ రాకపోవడంతో పిచ్చోడేమో అనుకుని యథావిధిగా ట్రాక్‌ తనిఖీ కోసం వెళ్లాం. కాసేపటికే కొందరు రైతు లు ఓ వ్యక్తి రైలు కిందపడి చనిపోయాడని సమా చారం ఇచ్చారు. వెంటనే స్టేషన్‌ మాస్టర్‌కు సమాచారం అందించాం. 
– తాటి కుమార్, రైల్వే కీమెన్‌ 

పిచ్చోడేమో అనుకున్నాం 
ఉదయం 8 గంటలకు విధుల్లోకి వచ్చాం. ఆ సమయంలో ట్రాక్‌ పక్కన ఉన్న వ్యక్తిని మందలించాను. గడ్డం, జుట్టును చూసి అనుమానం వచ్చింది. కాగితా లు ఏరుకునేవాడో, పిచ్చివాడో అనుకున్నం. ఎవరది అని అరుస్తూ దగ్గరికి వెళ్లినం. కోపంగా చూసుకుంటూ పొదల్లోకి వెళ్లిపోయాడు.     
– కుతటి సారంగపాణి, రైల్వే కీమెన్‌ 

ఎంజీఎం: రైలు పట్టాలపై లభించిన రాజు మృతదేహానికి వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో డాక్టర్‌ రజామ్‌ ఆలీఖాన్‌ ఆధ్వర్యంలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. రాజు ఒంటిపై అనుమానాస్పద గాయాలేమీ లేవని వారు తెలిపారు. రైలు ఢీకొనడంతో తల నుజ్జునుజ్జు అయిందని, రెండు చేతులకు తీవ్రగాయాలయ్యాయని వెల్లడించారు. పోస్టుమార్టం ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీశామని.. రాజు శరీర అవయవాల శాంపిల్స్‌ను హైదరాబాద్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్‌)కు పంపామని తెలిపారు. కాగా.. రాజు మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకువచ్చిన సమయంలో స్థానికులు ఆగ్రహంతో అంబులెన్స్‌పై చెప్పులు విసిరారు. రాజు బావమరదులు కేదిరి సురేశ్, కేదిరి మహేశ్‌లకు మృతదేహాన్ని, ఆనవాళ్లను చూపించగా.. రాజుదేనని వారు గుర్తించారు. తర్వాత రాజు తల్లి వీరమ్మ, భార్య మౌనిక, ఇతర బంధువులకు మృతదేహాన్ని చూపించారు. లాంఛనాలు పూర్తయ్యాక రాజు మృతదేహాన్ని బంధువులకు అప్పగించగా.. వరంగల్‌ పోతన శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు.


సింగరేణిలో నిందితుడు రాజు ఇంటిని కూల్చేస్తున్న స్థానికులు   

మృతదేహాన్ని చూస్తేగానీ నమ్మం
హత్యాచార నిందితుడు రాజు చనిపోయాడని చెప్తే నమ్మబోమని.. మృతదేహాన్ని తాము కళ్లారా చూస్తేనే నమ్ముతామని బాలిక తల్లిదండ్రులు సభావత్‌ రాజు, జ్యోతి అన్నారు. గురువారం సింగరేణికాలనీలోని నివాసంలో వారు మాట్లాడారు. ముఖం గుర్తుపట్టకుండా ఉన్న మృతదేహం రాజు అని ఎలా చెప్తున్నారని ప్రశ్నించారు. మృతదేహాన్ని సింగరేణికాలనీకి తేవాలని, తాము చూసి నిర్ధారించుకుంటామని డిమాండ్‌ చేశారు. కాగా.. రైలు పట్టాలపై రాజు మృతదేహం కనిపించిందన్న వార్తలు తెలిశాక.. సింగరేణికాలనీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హత్యాచార ఘటన జరిగినప్పుడు నిందితుడు రాజు ఇంటిని కొంతమేర కూల్చిన స్థానికులు.. గురువారం మరోసారి ఇంటిపై దాడిచేసి కూల్చారు. రాజు మృతదేహాన్ని సింగరేణికాలనీకి తేవాలని డిమాండ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement