మరో దారుణం.. ఇంటి దగ్గర దింపేస్తామంటూ 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి | Sexual Assault On 12 Year Old Girl In Hyderabad Moghulpura | Sakshi
Sakshi News home page

మరో దారుణం.. ఇంటి దగ్గర దింపేస్తామంటూ 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి

Jun 6 2022 4:01 AM | Updated on Jun 6 2022 8:28 AM

Sexual Assault On 12 Year Old Girl In Hyderabad Moghulpura - Sakshi

చార్మినార్‌/గౌలిపుర: రొమేనియా బాలిక కేసుపై తీవ్ర చర్చ జరుగుతుండగానే.. హైదరాబాద్‌లో మరో బాలికపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచి్చంది. రోడ్డు పక్కన వెళ్తున్న 12 ఏళ్ల బాలికను ఇంటిదగ్గర దింపుతామంటూ ట్రాప్‌ చేసిన ఓ క్యాబ్‌ డ్రైవర్, అతడి స్నేహితుడు కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ కేసులో నిందితులు కిషన్‌బాగ్‌ ప్రాంతానికి చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ షేక్‌ కలీం అలీ, మహ్మద్‌ లుక్మన్‌ అహ్మద్‌ యజ్దానీలను శుక్రవారమే అరెస్టు చేసినా.. జూబ్లీహిల్స్‌ కేసుపై ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో విషయాన్ని గోప్యంగా ఉంచారు. కానీ ఈ విషయం మీడియాకు లీక్‌ కావడంతో ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. 

తల్లిదండ్రులను చూద్దామని వెళ్తుండగా.. 
హైదరాబాద్‌లో పహాడీ షరీఫ్‌ సమీపంలోని షాహిన్‌నగర్‌ ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల బాలిక.. సుల్తాన్‌షాహీలోని తన మేనమామ ఇంట్లో ఉంటోంది. తల్లిదండ్రులను చూడాలనిపించడంతో గత మంగళవారం (మే 31న) సాయంత్రం 6 గంటలకు సుల్తాన్‌షాహీ నుంచి కాలినడకన బయలుదేరింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో పహాడీ షరీఫ్‌ కమాన్‌ వద్దకు చేరుకుంది. ఆ సమయంలో అటుగా కారులో వెళ్తున్న క్యాబ్‌డ్రైవర్‌ షేక్‌ కలీం అలీ ఈ బాలికను గమనించి ఆగాడు.

ఎక్కడికి వెళ్తున్నావంటూ మాట కలిపాడు. షాహిన్‌నగర్‌లో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని, డబ్బులు లేకపోవడంతో నడుచుకుంటూ వెళ్తున్నానని ఆమె చెప్పింది. దీనిని ఆసరాగా తీసుకున్న కలీం.. డబ్బులు లేకపోయినా ఫర్వాలేదు, ఇంటివద్ద దింపేస్తానంటూ బాలికను తన క్యాబ్‌ ఎక్కించుకున్నాడు. ముర్గీచౌక్‌ ప్రాంతంలో పని ఉందని, అది చూసుకున్నాక దింపేస్తానని చెప్పాడు. రాత్రి 10గంటల దాకా బాలికను వివిధ ప్రాంతాల్లో తిప్పి.. తన స్నేహితుడైన మహ్మద్‌ లుక్మన్‌ అహ్మద్‌ యజ్దానీకి ఫోన్‌ చేశాడు. 

యజ్దానీ ఇంటికి తీసుకెళ్లి.. 
పాతబస్తీలోని డెక్కన్‌ ప్యాలెస్‌ వద్దకు వచి్చన యజ్దానీ వీరి కారు ఎక్కాడు. ఇద్దరూ కలిసి బాలికను కుందుర్గ్‌లోని యజ్దానీ ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడే బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తీవ్రంగా ఏడుస్తుండటంతో భయపడిన కలీం.. అర్ధరాత్రి తర్వాత ఆమెను కారులో సుల్తాన్‌షాహీ వద్ద విడిచిపెట్టి వెళ్లిపోయాడు. మరోవైపు రాత్రి 12.15 గంటల సమయంలో బాలిక బంధువులు ఆమె కనిపించడం లేదంటూ మొఘల్‌పుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కిడ్నాప్‌ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. 

గస్తీ సిబ్బందికి తారసపడటంతో.. 
గస్తీ బృందం బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో సుల్తాన్‌షాహీ వద్ద బాలికను గుర్తించి ఠాణాకు తీసుకువచ్చింది. తర్వాత బాలికను భరోసా కేంద్రానికి తరలించారు. అక్కడ వాంగ్మూలం నమోదు చేసిన అధికారులు.. సామూహిక అత్యాచారం జరిగిన విషయం గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసులో అత్యాచారం సెక్షన్లను చేర్చి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. 

కలీం ఫోన్‌ నంబర్‌ ఆధారంగా.. 
బాలికను క్యాబ్‌లో తీసుకువెళ్తున్న సమయంలోనే కలీం ఆమెకు తన ఫోన్‌ నంబర్‌ చెప్పాడు. బాలిక ఆ నంబర్‌ చెప్పడంతో పోలీసులు కాల్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీనితో సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు, సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేసిన పోలీసులు శుక్రవారం నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపర్చారు. 

విషయం బయటికి రాకుండా.. 
కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు కుందుర్గ్‌లోని యజ్దానీ ఇంటికి బాలికను తీసుకువెళ్లి ఆధారాలు సేకరించారు. భరోసా కేంద్రంలో ఆమె వాంగ్మూలం నమోదు చేయడంతోపాటు వైద్య పరీక్షలు చేయించారు. రొమేనియా బాలికపై అత్యాచారం ఘటనపై హడావుడి జరుగుతుండటంతో.. ఈ గ్యాంగ్‌రేప్‌ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. ఆదివారం ఈ విషయం మీడియాకు లీక్‌ కావడంతో పత్రికా ప్రకటన విడుదల చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement