సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫైబర్‌నెట్ కుంభకోణంలో నిందితుడు చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనపై పీటీ వారెంట్ జారీచేసేందుకు విజయవాడ ఏసీబీ న్యాయస్థానం అనుమతించింది. చంద్రబాబును సోమవారం విజయవాడ కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో అరెస్ట్ అయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఫైబర్‌నెట్, ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ కుంభకోణం కేసుల్లో కూడా నిందితుడిగా ఉన్న ఆయన్ని ఆ కేసుల్లో వేర్వేరుగా అరెస్ట్ చేసి విచారించేందుకు అనుమతించాలని కోరుతూ సీఐడీ న్యాయస్థానంలో పీటీ వారంట్ పిటిషన్లు దాఖలు చేసింది.
ఫైబర్‌నెట్ కుంభకోణంలో పీటీ వారంట్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీఐడీ న్యాయవాదులు.. చంద్రబాబు ప్రధాన కుట్రదారుగా ఈ కుంభకోణానికి పాల్పడ్డారని వివరించారు. పూర్తి ఆధారాలు సేకరించిన అనంతరమే ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. సీఐడీ న్యాయవాదుల వాదనలతో సంతృప్తి చెందిన న్యాయస్థానం చంద్రబాబుపై పీటీ వారంట్‌ను అనుమతిస్తూ గురువారం ఆదేశాలు జారీచేసింది.
ఆ సమయంలో చంద్రబాబు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై శుక్రవారం సుప్రీంకోర్టు విచారించనుందని చెప్పారు. అందుకే చంద్రబాబును సోమవారం న్యాయస్థానంలో హాజరుపరచాలని ఆదేశించినట్టు న్యాయాధికారి తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటలలోపు చంద్రబాబును విజయవాడ న్యాయస్థానంలో హాజరుపరచాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు శుక్రవారం నిర్ణయానికి లోబడే తమ తీర్పు ఉంటుందని చెప్పారు.
ప్రత్యేక పీపీపై దాడికి యత్నించిన టీడీపీ న్యాయవాదులు
ఫైబర్‌నెట్ కుంభకోణంలో చంద్రబాబుపై పీటీ వారంట్‌కు అనుమతించడంతో చంద్రబాబు న్యాయవాదులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. దాంతో వారు దాఖలు చేసిన కాల్ రికార్డ్స్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీఐడీ న్యాయవాదిగా ఉన్న ప్రత్యేక పీపీ వివేకానందపై ఒకదశలో దాడికి తెగబడటం న్యాయస్థానాన్ని విస్మయానికి గురిచేసింది. ఒకనొక దశలో తీవ్ర వాగ్వాదంతో న్యాయస్థానం దద్దరిల్లింది. టీడీపీ న్యాయవాదుల వైఖరితో న్యాయాధికారి నిశ్చేష్టురాలయ్యారు.
తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలు.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు విచారిస్తున్న, చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ అధికారుల కాల్ రికార్డులను భద్రపరిచేలా ఆదేశించాలని కోరుతూ టీడీపీ న్యాయవాదులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సీఐడీ తరఫున ప్రత్యేక పీపీ వివేకానంద వాదనలు వినిపించారు. సీఐడీ అధికారులు తమ విధులను నిర్వర్తిస్తున్నారని చెప్పారు. ఆ విధి నిర్వహణలో భాగంగానే కేసు దర్యాప్తు చేయడంతోపాటు పూర్తి ఆధారాలతో చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు.
ఆయన అరెస్ట్ సక్రమమని గుర్తించే న్యాయస్థానం రిమాండ్ విధించిందని గుర్తుచేశారు. కానీ కేవలం రాజకీయ దురుద్దేశంతో సీఐడీ అధికారుల కాల్ రికార్డులు భద్రపరచాలని టీడీపీ కోరుతోందన్నారు. అలా చేయడం సీఐడీ అధికారుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగకరమని న్యాయస్థానానికి నివేదించారు. గతంలో కొన్ని న్యాయస్థానాలు ఇచ్చిన ఇటువంటి ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేసిన విషయాన్ని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. వివేకాంంద వాదనలపై టీడీపీ న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం సృష్టించింది. పిటిషన్ వేసి ఇప్పటికే నెల రోజులైందని టీడీపీ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాసరావు అన్నారు. అసలు పిటిషన్‌కే అర్హత లేదని ప్రత్యేక పీపీ వివేకానంద బదులిచ్చారు.
దీంతో అక్కడే ఉన్న టీడీపీ న్యాయవాది లక్ష్మీనారాయణ ఒక్కసారిగా ప్రత్యేక పీపీ వివేకానందపైకి దూసుకెళ్లారు. సీఐడీ తరఫున లీగల్ సబ్మిషన్లు చెబుతున్న ఆయనపైకి దూసుకెళ్లి అత్యుత్సాహంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసినవారికి బెయిల్ ఇస్తారని ఈ కేసుతో సంబంధంలేని అంశాలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ కేసులో మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని లక్ష్మీనారాయణను న్యాయాధికారి ఆగ్రహంగా ప్రశ్నించారు.
లక్ష్మీనారాయణ తీరుపై వివేకానంద కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరుపక్షాల న్యాయవాదుల వాగ్వాదంతో న్యాయస్థానం కాసేపు దద్దరిల్లింది. న్యాయస్థానంలో అతిగా ప్రవర్తిస్తున్న వారిపేర్లను నమోదు చేయాలని న్యాయాధికారి ఆదేశించారు. న్యాయవాదులు లక్ష్మీనారాయణ, నాగరాజు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్‌లో ఉన్నారా అని న్యాయాధికారి ప్రశ్నించారు. వారిద్దరూ ఆ జాబితాలో లేరని చంద్రబాబు న్యాయవాదులు సమాధానం చెప్పారు. అడ్వకేట్స్ ఆన్ రికార్డ్‌లో ఉన్నవాళ్లు తప్ప అందరూ బయటకు వెళ్లాలని ఆదేశించిన జడ్జి.. ఈ విధంగా ఉంటే తాను ఈ కేసు విచారించాలేనని పేర్కొంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ బెంచ్‌దిగి వెళ్లిపోయారు.
ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ
Published Fri, Oct 13 2023 4:30 AM | Last Updated on Fri, Oct 13 2023 12:42 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment