రావులపాలెం పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ మాధవరెడ్డి
సాక్షి,రావులపాలెం: రావులపాలెం వద్ద జాతీయ రహదారిపై బియ్యం లారీని అడ్డగించి, డ్రైవర్‌ను, రూ.లక్షల్లో డబ్బులు ఇవ్వాలని సరకు యజమానిని బెదిరించిన ఆరుగురు విలేకరులను అరెస్టు చేసినట్టు అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డి తెలిపారు. గురువారం రావులపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 14 తేదీ తెల్లవారుజామున స్థానిక అరటిమార్కెట్ యార్డు సమీపంలో తణుకు నుంచి రావులపాలెం వస్తున్న బియ్యం లోడు లారీని కొత్తపేట నియోజకవర్గానికి చెందిన ఏడుగురు విలేకరులు ఆపారు. లారీ డ్రైవర్‌ను కిందకు దిగమని బిల్లులు చూపించాలని బెదిరించారు. డ్రైవర్ బిల్లులు చూపించినా ఇవి పీడీఎఫ్ రైస్, మీ ఓనర్‌కు ఫోన్ చేయ్, లేకపోతే కేసు పెట్టి జైలుకు పంపుతామని బెదిరించారు. ఫోన్‌లో రైస్‌మిల్లు గుమస్తాతో మాట్లాడి రూ.రెండు లక్షలు ఇస్తే లారీని వదులుతామని లేకపోతే సీజ్ చేస్తామని బెదిరించారు.
ఈ ఘటనపై సరకు యజమాని గుంటూరుకు చెందిన కె.గంగాధరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరిలో ఆకొండి వీరవెంకటసత్య సూర్యనారాయణమూర్తి (పశ్చిమవాహిని, తిరుపతి), చిర్రా నాగరాజు (ఆర్‌టీఐ యాక్ట్ న్యూస్ చానల్), అయినవిల్లి విజయబాబు (అనంత వాయిస్ తెలుగు దినపత్రిక), ఉందుర్తి రవికుమార్ (డీఆర్‌ఎస్ యూట్యూబ్ చానల్), పలివెల రాజు (జైజనని తెలుగు దినపత్రిక), ఉమ్మిడిశెట్టి వెంకటేశ్వరరావు (గోదావరి దినపత్రిక)లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి నాలుగు మోటారు సైకిళ్లు, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఏడో ముద్దాయి సీహెచ్ రాజేంద్రప్రసాద్ (వి10 న్యూస్ చానల్) పరారీలో ఉన్నాడని అతన్ని పట్టుకోవడానికి ఒక టీమ్‌ను ఏర్పాటు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. ముద్దాయిలను కొత్తపేట జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వద్ద హాజరు పర్చనున్నట్టు తెలిపారు. సమావేశంలో సీఐ వి.కృష్ణ, ఎస్సై పి.బుజ్జిబాబు, అడిషనల్ ఎస్సై ఆర్. బెన్నిరాజు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment