చిన్నారిని చిదిమేసిన కామాంధుడు | Small girl assassinated in tirupati district | Sakshi
Sakshi News home page

చిన్నారిని చిదిమేసిన కామాంధుడు

Published Sun, Nov 3 2024 5:26 AM | Last Updated on Sun, Nov 3 2024 5:26 AM

Small girl assassinated in tirupati district

తిరుపతి జిల్లాలో మూడున్నరేళ్ల గిరిజన బాలికపై బంధువు కిరాతకం

చాక్లెట్‌ ఆశ చూపి లైంగిక దాడి, హత్య 

బాలికను మురికి కాలువలో తొక్కేసిన కిరాతకుడు.. నిందితుడిని పోలీసులకు అప్పగించిన స్థానికులు, బంధువులు

రాత్రంతా చిన్నారి కోసం వెతుకులాట 

వేకువజామున మృతదేహం వెలికితీత   

సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లా పుంగనూరులో చిన్నారి హత్య ఘటన మరువక ముందే తిరుపతి జిల్లా వడమాలపేటలో మరో దారుణం జరిగింది. ముక్కుపచ్చలారని మూడున్నరేళ్ల గిరిజన చిన్నారిపై ఓ కామాంధుడు అతికిరాతకంగా లైంగిక దాడి చేసి, ఆపై హత్య చేశాడు. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. తిరుపతి జిల్లా కేవీబీ పురం ఓళ్లూరు గిరిజన కాలనీకి  చెందిన దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి దీపావళి పండుగ కోసం పది రోజుల క్రితం వడమాలపేట మండలం ఏఎం పురం ఎస్టీ కాలనీకి వచ్చారు. 

చిన్నారి మేనమామకు కాలు విరగడంతో ఆ బాలిక తండ్రి, కుటుంబీకులు సమీపంలోని పుత్తూరు రాచపాలెంలో శల్య వైద్య­శాలకు తీసుకెళ్లారు. ఆ సమయంలో చిన్నారి తల్లితో ఉంది. చిన్నారికి వరుసకు మేనమామ అయిన ఏఎం పురానికి చెందిన సుశాంత్‌ ఆ బాలికకు చాక్లెట్‌ ఇప్పిస్తానని అంగడికి తీసుకెళ్లాడు. దుకాణం నుంచి చిన్నారిని పక్కనే ఉన్న సచివాలయం, పాఠశాల మధ్యలోకి తీసుకెళ్లి కిరాతకంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటకు పొక్కకుండా చిన్నారిని పక్కనే ఉన్న మురికి కాలువలో తొక్కి అతి కిరాతకంగా చంపేశాడు. 

మృతదేహం పైకి కనిపించకుండా కాలువలోనే పూడ్చిపెట్టాడు. శరీరానికి బురద అంటుకోవడంతో పక్కనే స్నానం చేసి తిరిగి వచ్చాడు. సాయంత్రం వరకు చిన్నారి రాకపోవడంతో తల్లి చుట్టుపక్కల వెతికింది. ఎంతకీ కనిపించలేదు. ఈలోపు సుశాంత్‌ అక్కడికి రావడంతో పాప ఎక్కడ అని ప్రశ్నించింది. చాక్లెట్‌ ఇచ్చాక పాపను ఇంటి వద్దే వదలేశానని, నాకు తెలియదు అంటూ తడబడుతూ సమాధానం ఇచ్చాడు. గట్టిగా నిలదీ­యడంతో సుశాంత్‌ తప్పించుకునేందుకు పరుగులు పెట్టాడు. కాలనీ వాసులు సుశాంత్‌ని పట్టుకుని గట్టిగా నిల­దీశారు. 

ఎంతకూ సమాధానం చెప్పక­పోవడంతో శుక్రవారం రాత్రి చిన్నారి తల్లి, బంధువులు కలిసి అతన్ని వడమాలపేట పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. అప్పటికే అతను మద్యం, గంజాయి మత్తులో కూడా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా చిన్నారి అచూకీ కోసం తల్లిదండ్రులు, బంధువులు రాత్రంతా టార్చిలైట్ల వెలుతురులో పరిసర ప్రాంతాలన్నీ గాలించారు. ఎక్కడా ఆచూకీ దొరక్క­పోవడంతో తిరిగి పోలీస్‌ స్టేష­న్‌కు వచ్చారు. 

పోలీ­సులు తమదైన శైలిలో విచారించడంతో సుశాంత్‌ దారుణాన్ని ఒప్పుకున్నాడు. అతను చెప్పిన వివ­రాలతో శనివారం వేకువజామున మురికి కాలు­వలో నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న చిన్నారి బంధువులు, ఓళ్లూరు, ఏఎం పురం గిరిజన కాలనీల వారంతా పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు వచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement