నిందితులను అరెస్ట్ చూపుతున్న ఆదోని డీఎస్పీ వినోద్‌కుమార్
ఎమ్మిగనూరు రూరల్(కర్నూలు జిల్లా): ఆస్తి కోసం కుమారుడే తండ్రిని హతమార్చాడు. ఎవరికీ అనుమానం రాకుండా గోనెసంచిలో మృతదేహాన్ని మూటగట్టి ఎల్లెల్సీలో పడేశాడు. ఈ విషయం పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులను అరెస్ట్ చేసి, ఆ వివరాలను ఆదోని డీఎస్పీ వినోద్‌కుమార్ బుధవారం ఎమ్మిగనూరు సీఐ కార్యాలయ ఆవరణలో విలేకరులకు తెలిపారు.
గోనెగండ్ల వద్ద ఎల్లెల్సీలో ఈ నెల 17వ తేదీన గోనెసంచిలో గుర్తు తెలియని మృతదేహం బయటపడింది. మృతుడి జేబులో ఉన్న బ్యాంకు పాస్‌బుక్ ఆధారంగా దేవనకొండ మండలం కూకటికొండ గ్రామానికి చెందిన గోపాల్(60)గా గుర్తించారు. మృతుడి చిన్న కుమారుడు నాగశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తును ప్రారంభించారు.
ఆస్తి గొడవలు..
హత్యకు గురైన గోపాల్‌కు అతని పెద్దకుమారుడు బాలరంగడికి ఆస్తి విషయంలో గొడవలు ఉండేవి. గోపాల్ భార్య అనారోగ్యంతో 2017లో మృతి చెందింది. తాను రెండో పెళ్లి చేసుకుంటానని కుమారులకు గోపాల్ చెప్పేవాడు. తన తండ్రి రెండో పెళ్లి చేసుకుంటే ఆస్తి దక్కదని భావించి, ఈ వయస్సులో రెండో పెళ్లి ఎందుకు అంటూ తండ్రిని బాలరంగడు నిలదీసేవాడు.
దీంతో గోపాల్ ఇంటి నుంచి మూడు నెలల కిత్రం కర్నూలు వెళ్లి, అక్కడే జీవనం సాగిస్తున్నాడు. కర్నూలులో ఉంటూ తనకు తెలిసిన దేవనకొండ మండలం సింగాపురం గ్రామానికి చెందిన ఈరన్నతో రెండో పెళ్లి సంబంధం చూడాలని తెలిపాడు. పత్తికొండలో తన పేరున ఉన్న రెండున్నర సెంట్ల స్థలాన్ని రూ. 13 లక్షలకు విక్రయించటానికి బేరం కుదుర్చుకొని, అడ్వాన్సు కింద రూ. 2 లక్షలు తీసుకున్నాడు. విషయం తెలుసుకున్న పెద్ద కుమారుడు బాలరంగడు సింగాపురానికి వెళ్లి తన తండ్రికి రెండో సంబంధం చూడవద్దని, పెళ్లి చేసుకుంటే ఆస్తితో పాటు తమ పరువు పోతుందని ఈరన్నతో చెప్పాడు.
పక్కా ప్రణాళిక ప్రకారమే..
తన మాట వినని తండ్రిని హతమార్చేందుకు బాలరంగడు పక్కా ప్రణాళిక రూపొందించాడు. హత్యచేస్తే రూ.1.50 లక్షలు ఇస్తానని ఈరన్నతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నెల 14వ తేదీన గోపాల్‌కు ఫోన్ చేసి ఎమ్మిగనూరు మండలం సిరాలదొడ్డిలో అమ్మాయి ఉంది, సాయంత్రం వస్తే చూపిస్తానని ఈరన్న నమ్మబలికాడు. మోటారు సైకిల్ మీద గొల్ల గోపాల్‌ను ఈరన్న, మల్లికార్జున ఎక్కించుకొని గుడేకల్–సిరాలదొడ్డి గ్రామాల మధ్య ఉన్న తుంగభద్ర దిగువ కాలువ దగ్గరకు తీసుకెళ్లారు.
అప్పటికే అక్కడ ఉన్న బాలరంగడు తండ్రితో వాదనకు దిగాడు. ముగ్గురూ కలసి గోపాల్ గొంతుకు లుంగీ బిగించి, పిడిబాకుతో గొంతు కోసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి కాలువలో పడేశారు. మృతదేహం 17వ తేదీన గోనెగండ్ల దగ్గర బయటపడింది.
నిందితుల అరెస్ట్
అనుమానంతో బాలరంగడుని అదుపులో తీసుకొని పోలీసులు విచారించారు. తనతో పాటు మరో ఇద్దరు కలసి హత్య చేసినట్లు బాలరంగడు నేరం అంగీకరించాడు. దీంతో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వినోద్‌కుమార్ తెలిపారు. నిందితుల నుంచి ఒక మోటార్ సైకిల్, పిడిబాకు, రూ.25 వేల నగదను స్వా«దీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించారన్నారు. హత్య కేసును ఛేదించిన ఎమ్మిగనూరు రూరల్ సీఐ మంజునాథ్, ఎస్‌ఐ సునీల్‌కుమార్, గోనెగండ్ల ఎస్‌ఐ సురేష్‌లను డీఎస్పీ అభినందించారు. రివార్డుకు ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment