
ప్రతీకాత్మక చిత్రం
నగరి(చిత్తూరు జిల్లా): అత్తను హతమార్చి అల్లుడు పరారైన సంఘటన శుక్రవారం రాత్రి విజయపురం మండలం ఇల్లత్తూరు దళితవాడలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ నరేష్ కథనం.. గ్రామానికి చెందిన మణియమ్మ (42) తన కుమార్తె నిరోషను తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా మనువూరుకు చెందిన కార్తీక్ (28)కి ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేసింది. అప్పటి నుంచి కార్తీక్ ఇల్లరికపు అల్లుడుగా అత్తగారింట్లోనే ఉంటూ తాపీ మేస్త్రీ పనికి వెళ్లేవాడు.
చదవండి: నడిరోడ్డుపై భర్త దాష్టీకం.. భార్యను లారీ కిందకు తోసి..
వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇక, నిరోష మూడేళ్ల నుంచి శ్రీపెరంబదూర్‌లో ప్రైవేటు కంపెనీలో పనికి వెళ్తోంది. తన భార్య ఎవరితోనో వివాహేతర సంబంధం కలిగి ఉందనే అనుమానంతో కార్తీక్ తరచూ గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి కూడా తన భార్యతో కార్తీక్ గొడవ పడ్డాడు.
ఇది గమనించిన మణియమ్మ అడ్డుకుంది. దీంతో ఆగ్రహించిన కార్తీక్ చేతికి దొరికిన ఇనుప కమ్మీతో మణియమ్మను పొడవడంతో అక్కడికక్కడే ఆమె మృతిచెందింది. దీంతో కార్తీక్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి కార్తీక్ కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment