కర్నూలు: జిల్లాలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లలో పాచిపోయిన ఆహార పదార్థాలను వేడి చేసి వడ్డిస్తున్నట్లు తేలింది. బార్ అండ్ రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహార పదార్థాల నాణ్యతపై ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి ఆదేశాల మేరకు.. ఆ విభాగం కర్నూలు ప్రాంతీయ అధికారి తిరుమలేశ్వరరెడ్డి నేతృత్వంలో శనివారం కర్నూలు జిల్లాలోని పలు రెస్టారెంట్లు, బార్లు, హోటళ్లలో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పలు అక్రమాలు వెలుగుచూశాయి. కుళ్లిన కూరగాయలు వినియోగించడం, పాచిపోయిన ఆహారాన్ని వేడి చేసి వడ్డిస్తున్నట్లు గుర్తించారు. వంటశాలలు అపరిశుభ్రంగా ఉన్నాయి.
మాంసాహార పదార్థాలు రోజుల తరబడి ఫ్రిజ్‌లో ఉంచి అవసరమైనప్పుడు తీసి ఉడికించడం, లేదంటే వేడి చేసి మసాలాలు, రంగులు కలిపి రుచికరంగా తయారు చేసి అందిస్తున్నట్లు గుర్తించి పలు హోటళ్లు, రెస్టారెంట్లకు జరిమానాలు విధించారు. విజిలెన్స్ అధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీ, తూనికలు కొలతలు, శానిటరీ సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐలు నాగరాజు యాదవ్, కేశవరెడ్డి, ఏఏఓ షణ్ముఖ గణేష్, ఏజీ సిద్ధయ్య, ఎఫ్‌ఎస్‌ఓ శేఖర్‌రెడ్డి, రాముడు, తూనికలు కొలతల శాఖ అధికారి కుమార్, అనిల్ తదితరులు బృందాలుగా ఏర్పడి కర్నూలుతో పాటు కోడుమూరు, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
కర్నూలులోని ల్యాటిట్యూడ్ రెస్టారెంట్‌లో ముందు రోజు వండిన ఆహార పదార్థాలు ఫ్రిజ్‌లో పెట్టి అవసరమైనప్పుడు వేడి చేసి వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే రెడ్ ఫుడ్ కలర్ వాడినట్లు గుర్తించి రూ.5 వేలు జరిమానా విధించారు. అలాగే కర్నూలులోని మసాలా బౌల్ హోటల్, నాగార్జున పార్క్ లేన్ బేకర్స్‌లో వంటశాల అపరిశుభ్రంగా ఉండడంతో రూ.5 వేలు చొప్పున జరిమానా విధించారు.
బావార్చీ మల్టీ రెస్టారెంట్‌లో ముందు రోజు వండిన ఆహార పదార్థాలు ఫ్రిజ్‌లో ఉంచి వేడిచేసి వినియోగిస్తున్నందుకు రూ.10 వేలు, అనిల్ బార్ అండ్ రెస్టారెంట్‌లో సరైన శుభ్రత లేని కారణంగా రూ.5 వేలు అపరాధ రుసుం విధించారు. అలాగే కోడుమూరు రెడ్డీస్ హోటల్‌లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వాడుతున్నట్లు గుర్తించి 6ఏ కేసు నమోదు చేశారు. అలాగే కోడుమూరులోని శివ హోటల్‌లో వాటర్ బాటిళ్లు ఎంఆర్‌పీ కంటే రూ.5 అధికంగా విక్రయిస్తున్నట్లు గుర్తించి తూనికలు కొలతల శాఖ అధికారులు రూ.2 వేలు ఫైన్ వేశారు. ఎమ్మిగనూరులోని అమృత బార్ అండ్ రెస్టారెంట్, గ్రాండ్ మహల్ హోటళ్లలో వంటశాలలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించి రూ.10 వేలు, రూ.2 వేలు అపరాధ రుసుం విధించారు.
చదవండి: చదివింది ఏడో తరగతి.. వామ్మో ఈమె మామూలు లేడీ కాదు.. షిఫ్ట్ కారులో వచ్చి..
Comments
Please login to add a commentAdd a comment