
మృతురాలు హిమబిందు
పెనుకొండ: మండలంలోని కొండంపల్లి సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హిమబిందు (20) అనే ఇంజనీరింగ్ విద్యార్థిని దుర్మరణం చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. వివరాల్లోకెళితే.. కొత్తచెరువు మండలం ఎర్రబల్లికి చెందిన భాస్కరరెడ్డి వ్యవసాయంతో పాటు, ఆటో నడుపుతూ కుమార్తెను ఇంజనీరింగ్ చదివిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా ప్రభావంతో కుమార్తె ఇంటి వద్దే ఉండగా విద్యార్థిని అనారోగ్యంగా ఉండటంతో పెనుకొండకు చికిత్స నిమిత్తం ఆటోలో బయలుదేరారు.
మార్గమధ్యలో బండ్లపల్లికి చెందిన బాలాజీ, చెర్లోపల్లికి చెందిన ముత్యాలప్పలు ఆటోలో పెనుకొండకు ఎక్కారు. వీరు ప్రయాణిస్తున్న ఆటో కొండంపల్లి సమీపంలోని బీఈడీ కళాశాల వద్దకు రాగానే పెనుకొండ నుంచి వేగంగా వచ్చిన ఇండికా కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హిమబిందు అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని తండ్రి భాస్కరరెడ్డి, ముత్యాలప్పను పోలీసులు అనంతపురానికి తరలించారు. బాలాజీ స్వల్పగాయాలతో బయట పడ్డాడు. హిమబిందు మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. కారు యజమాని లక్ష్మీనారాయణ మందు సేవించి వేగంగా కారును నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment