జ్వరమా.. మరేదైనా కారణమా..? | Student died under suspicious circumstances | Sakshi
Sakshi News home page

జ్వరమా.. మరేదైనా కారణమా..?

Published Wed, Jul 17 2024 4:41 AM | Last Updated on Wed, Jul 17 2024 4:41 AM

Student died under suspicious circumstances

అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి

కొట్టి చంపారా? ఏమైనా చేశారా అంటూ బంధువుల ఆందోళన

ప్రిన్సిపాల్‌పై దాడి..

సూర్యాపేట జిల్లా దోసపహాడ్‌ బీసీ బాలికల గురుకుల పాఠశాలలో ఘటన 

పెన్‌పహాడ్‌: గురుకుల పాఠశాల విద్యార్థిని అను మానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే జ్వరంతో విద్యార్థిని చనిపోయిందని ప్రిన్సిపాల్‌ చెబుతుండగా, రాత్రే చనిపోతే ఉదయం వరకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహంతో మృతురాలి బంధువులు ప్రిన్సి పాల్‌పై దాడి చేశారు. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివ రాల ప్రకారం... సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలం మాచినపల్లి గ్రామానికి చెందిన కొంపెల్లి సోమయ్యకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. 

చిన్నకూతురు సరస్వతి(10) పెన్‌ పహాడ్‌ మండలంలోని దోసపహాడ్‌ బీసీ బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. సరస్వతికి సోమవారం రాత్రి జ్వరం వచ్చింది.గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న జీఎన్‌ఎం మంగళవారం తెల్లవారుజామున పరీక్షించి మరో ఉపాధ్యాయురాలితో కలిసి గ్రామంలోని ఓ ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లి ఇంజక్షన్‌ వేయించారు. అయినా జ్వరం తీవ్రత తగ్గకపోగా సీరియస్‌గా ఉండటంతో 108 వాహనంలో సూర్యాపేటలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. 

సరస్వతిని పరీక్షించిన డాక్టర్‌ అప్పటికే చని పోయిందని చెప్పారు. దీంతో ప్రిన్సిపాల్‌ విజయ లక్ష్మి..  మీ పాపకు సీరియస్‌గా ఉందంటూ సర స్వతి తల్లి దండ్రులకు ఫోన్‌ చేశారు. వారు వెంటనే ఆస్పత్రికి చేరుకోగా అప్పటికే మృతి చెందినట్టు తల్లిదండ్రులకు తెలియజేశారు. తమ కూతురు బాగానే ఉందని, అప్పుడే ఎలా చనిపోయిందని వారు ప్రిన్సిపాల్‌ను నిలదీశారు. 

ఆస్పత్రిలో బంధువులు, తల్లిదండ్రుల ఆందోళన
సరస్వతి మృతి చెందిన విషయం ప్రిన్సిపాల్‌ విజ యలక్ష్మి, పాఠశాల సిబ్బంది తమకు తెలియజే య కుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని ఆస్పత్రి లోని మార్చురీ వద్ద కుటుంబసభ్యు లు ఆందోళన చేశారు. తమ కూతురు సోమ వారం రాత్రే చని పోయిందని, ఆ విషయం చెప్పకుండా దాచిపెట్టి మంగళవారం  ఫోన్‌ చేసి సీరియస్‌గా ఉందని చెప్పారని తల్లిదండ్రులు వాపోయారు. తమ కూతురుని కొట్టి చంపారా.. లేక ఏదైనా చేశారా మాకు చెప్పాలని తండ్రి సోమయ్య డిమాండ్‌ చేశాడు. న్యాయం చేసే వరకు పోస్టుమార్టం చేయొద్దని పట్టుబట్టారు. 

మాట్లాడదామని చెప్పి...
ప్రిన్సిపాల్‌తో మాట్లాడించాలని రీజినల్‌ కోఆర్డి నేటర్‌ షకీనాను బంధువులు కోరగా, ఆమెను తీసుకొస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. ప్రిన్సిపాల్‌పై  సరస్వతి బంధువులు దాడి చేశారు. వెంటనే అక్కడే ఉన్న డీఎస్పీ రవి జోక్యం చేసుకొని ప్రిన్సిపాల్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. 

విషయం తెలుసుకున్న బీసీ గురుకుల అధికారులు మద్దిలేటి,వెంకటేశ్వర్లు ఆస్పత్రి వద్దకు వెళ్లి అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వారు మృతదేహాన్ని స్వగ్రామా నికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. మృతురాలి తండ్రి కొంపెల్లి సోమయ్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement