ప్రతీకాత్మక చిత్రం
మైసూరు: ప్రశాంత మైసూరు నగరంలో నగల షాపులో దోపిడీదొంగలు లూటీ చేసి ఒకరిని కాల్చిచంపిన సంఘటన జరిగి మూడురోజులు కాక ముందే మరో ఘోరం చోటుచేసుకుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానానికి కొంచెం దూరంలో ఒక యువతిపై సామూహిక లైంగికదాడి జరిగింది. మంగళవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో చాముండికొండ దగ్గర లలితాద్రిపుర సమీపంలో ఈ దారుణం జరిగింది. మైసూరు వర్సిటీలో పరిశోధక విద్యార్థినిగా భావిస్తున్న యువతి, ఆమె స్నేహితునితో కలిసి మాట్లాడుతూ ఉండగా, ఇద్దరు దుండగులు వారి వద్దకు వచ్చారు. డబ్బు, విలువైన వస్తువులను ఇవ్వాలని బెదిరించారు.
యువతి, స్నేహితుడు నిరాకరించడంతో యువకున్ని కొట్టారు. యువతిపై అక్కడే సామూహిక అత్యాచారానికి ఒడిగట్టి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో దుండగులు మద్యం తాగి ఉన్నారు. యువతి స్నేహితుడు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఇద్దరినీ అర్ధరాత్రి 1:30 సమయంలో ఆస్పత్రిలో చేర్పించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సామూహిక అత్యాచారం కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. బుధవారం ఉదయం సంఘటనాస్థలాన్ని పోలీసు అధికారులు పరిశీలించారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సీఎం బసవరాజ బొమ్మై తెలిపారు. హోంమంత్రి ఎ.జ్ఞానేంద్ర మాట్లాడుతూ తాను గురువారం మైసూరుకు వెళ్లి సమీక్షిస్తానని తెలిపారు. దుండగుల కోసం గాలింపు కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment