Sushanth Singh Rajupt Case: సుశాంత్‌ మృతి కేసు సీబీఐకి అప్పగించిన సుప్రీంకోర్టు | SC Orders CBI to Investigate - Sakshi
Sakshi News home page

సుశాంత్‌ మృతి కేసు సీబీఐకి అప్పగించిన సుప్రీంకోర్టు

Published Wed, Aug 19 2020 11:21 AM | Last Updated on Wed, Aug 19 2020 4:30 PM

Supreme Court orders CBI probe into Sushant Singh Rajput's death case - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసు విచారణను సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. సేకరించిన  దర్యాప్తు వివరాలను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులను సుప్రీంకోర్టు సూచించింది. దీంతో పాటు సీబీఐ విచారణకు సహకరించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఈ మేరకు న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. అలాగే సుశాంత్‌ సన్నిహితురాలు రియా పాత్రపైనా ఆరోపణలు వెల్లువెత్తిన విషయం విదితమే. దీంతో రియాపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌డం న్యాయ‌బ‌ద్ద‌మైన‌ని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో సింగిల్ బెంచ్ జ‌స్టిస్ హృషికేశ్ రాయ్ ఇచ్చిన తీర్పును సుశాంత్‌ కుటుంబసభ్యులు స్వాగతించారు. 

సుశాంత్‌ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై సీబీఐ దర్యాప్తు చేయనుంది. కాగా జూన్‌ 14లో సుశాంత్‌ తన నివాసంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మొదటి నుంచి అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసు బాలీవుడ్‌లోనే కాకుండా రాజకీయంగానూ ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్టు ఇప్పటికే కేంద్రం తెలపగా.. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం తీవ్రంగా వ్యతిరేకించింది.  (సుశాంత్ కేసు సాక్ష్యులకు భద్రత కల్పించాలి)

సుశాంత్‌ మృతి కేసుపై సీబీఐ విచారణకు బిహార్‌ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను కేంద్రం అంగీకరించింది. సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు బిహార్ సీఎం సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. అయితే, ఈ కేసులో తనపై పట్నాలో దాఖలైన కేసు విచారణను ముంబయికి బదిలీ చేయాలని కోరుతూ సుశాంత్‌ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆగస్టు 11 నాటి విచారణ సందర్భంగా.. రియా తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ... నిజం కంటే రాజకీయ జోక్యం ఎక్కువగా మారిందని స్పష్టమవుతోందన్నారు. అసంబద్ధమైన వాదనలతో బీహార్‌లో ఎన్నికల సందర్భంగా రాజకీయంగా ఈ కేసును వాడుకుంటున్నారని రియా చక్రవర్తి ఒక ప్రకటనలో తెలిపారు. (రూ.4.5 కోట్ల ప్లాటు.. రియా కోసం కాదు)

సుశాంత్‌ ఆత్మహత్యకు పాల్పడలేదని, హత్యకు గురయ్యారంటూ పలువురు రాజకీయ ప్రముఖులు సైతం ఆరోపిస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న నెల రోజుల తర్వాత ఆయన తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు చేశారు. రియా చక్రవర్తి, ఆమె కుటుంబం తన కుమారుడ్ని మోసం చేసిందని, ఆర్ధికంగా, మానసికంగా వేధించారని ఆయన ఆరోపించారు. కేసుకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి ఒక్కక్కరూ బయటకు వస్తున్నారని, వారికి భద్రత కల్పించాలని సుశాంత్‌ సింగ్‌ బంధువు, బీజేపీ ఎమ్మెల్యే నీరజ్‌ కుమార్‌ సింగ్‌ బబ్లు వ్యాఖ్యానించారు. ఈ కేసులో నిజాలు బయటపెట్టేందుకు చాలామంది సాక్ష్యులు ఉన్నారని, వారు ప్రాణ భయంతో బయటకు రావడం లేదన్నారు. కాబట్టి ఇప్పటికే ముందుకు వచ్చిన సాక్ష్యులకు భద్రత కల్పించాలన్నారు. రీల్‌ లైఫ్‌లో లాగానే... సుశాంత్‌ మృతి రియల్‌ లైఫ్‌లోనూ అనేక మలుపులు తిరుగుతూ చివరకూ సుప్రీంకోర్టుకు చేరింది. (అప్పుడే అందరికీ ప్రశాంతత: సుశాంత్ సోదరి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement