ఎస్‌ఐలు వీరేష్, రామకృష్ణ, రామకృష్ణారెడ్డి , సీఐ సుబ్రమణ్యం
తిరుపతి క్రైం: రక్షించాల్సిన పోలీసులే భక్షించారు. గోడౌన్ ఖాళీ చేయించి అందులో ఉన్న లక్షల విలువైన సిగరెట్లను దొంగచాటుగా అమ్ముకున్నారు. కాసులకు కక్కుర్తిపడి వాటాలు పంచుకున్నారు. తీగలాగిన డీఐజీ తిరుచానూరులో అవినీతి ఖాకీల డొంకను కదిలించారు. నాటి సీఐతో పాటు ముగ్గురు ఎస్‌ఐలను సస్పెండ్ చేయడమే కాకుండా సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు.
తిరుచానూరు పోలీసుస్టేషన్ పరిధిలోని శ్రీనివాసపురం పంచాయతీలో హైదరాబాద్‌కు చెందిన బిజి.నిశాంత్‌కు చెందిన వంద అంకణాల రెండు అంతస్తుల భవనం ఉంది. దీన్ని చెన్నైకి చెందిన ముత్తుకుమార్ లీజుకు తీసుకుని అందులో ఐటీసీ కంపెనీకి చెందిన సిగరెట్ ప్యాకెట్లు, బిస్కెట్లు, ఇతర సామగ్రిని ఉంచి వ్యాపారం చేసుకునేవారు. అయితే ముత్తుకుమార్ ఈ భవనాన్ని ఖాళీ చేయకపోవడంతో మణికంఠను ఆశ్రయించి ఆ భవనాన్ని విక్రయించాలని నిశాంత్ కోరారు.
మణికంఠ ప్రైవేట్ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ చదువుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. శ్రీనివాసపురంలో అదే భవనానికి ఎదురుగా ఉంటున్న డాక్టర్ రహమాన్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో భవనాన్ని విక్రయించాడు.
ఖాళీ చేయించి.. సిగరెట్లు అమ్ముకుని..
రిజిస్ట్రేషన్ అనంతరం భవనాన్ని ఖాళీ చేయాలని ముత్తుకుమార్‌ను కోరగా అతను నిరాకరించడమే కాకుండా భవనం తనదేనని పత్రాలు కూడా ఉన్నాయని అడ్డం తిరిగాడు. దీంతో మణికంఠ తిరుపతికి చెందిన ఇర్ఫాన్, శ్రీనివాస్, మరికొంతమందితో కలసి ఏప్రిల్ 9న దౌర్జన్యంగా భవనాన్ని ఖాళీ చేయించారు. ఆ సమయంలో దాదాపు రూ.20 లక్షల విలువైన సిగరెట్ ప్యాకెట్లు అక్కడ ఉండడాన్ని గమనించారు.
తిరుచానూరులో పనిచేస్తున్న ఎస్‌ఐ వీరేష్‌తో కలసి సిగరెట్ ప్యాకెట్లు విక్రయించి మణికంఠ సొమ్ము చేసుకున్నాడు. ఈ నగదును సీఐ సుబ్రమణ్యం, ఎస్‌ఐలు రామకృష్ణ, రామకృష్ణారెడ్డి, మణికంఠ, ఇర్ఫాన్, శ్రీనివాస్ పంచుకున్నారు. దీనిపై ఐటీసీ కంపెనీ మేనేజర్ అజయ్ ఫిర్యాదు మేరకు తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి విచారణ చేయించారు. సీఐతో పాటు ముగ్గురు ఎస్‌ఐలు కూడా లాలూచీ పడినట్లు విచారణలో తేలడంతో వారిని సస్పెండ్ చేస్తూ బుధవారం అనంతపురం డీఐజీ రవిప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment