మహిళా కమిషన్ సభ్యురాలు రేవతిరావుకు మొరపెట్టుకుంటున్న బాధితులు
సాక్షి, పెద్దపల్లి : ‘నా కూతురు మానసను అత్తింటివారే హత్యచేసి ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరిస్తున్నారని’ఇటీవల అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన తిప్పర్తి మానస తల్లి మంజుల మహిళా కమిషన్ సభ్యురాలు కటారి రేవతిరావుతో బుధవారం మొరపెట్టుకుంది. మానస అత్తింటి వారిని చట్టరీత్యా శిక్షించాలని తన కూతురు చావుకు కారణమైన అత్త మామ, ఆడపడుచులను అరెస్టు చేసి న్యాయం చేయాలని వినతిప్రతం సమర్పించింది. పెగడపల్లి గ్రామానికి చెందిన మూల మల్లారెడ్డి మంజుల పెద్దకూతురు మానసను 8ఇంక్‌లైన్ కాలనీలోని తిప్పర్తి లక్ష్మారెడ్డి పుష్పలత రెండో కుమారుడు సతీష్‌రెడ్డితో 2018వ సంవత్సరం జూలై ఆరో తేదీన వివాహం జరిపించారు. వీరికి ఏడాది వయసున్న బాబు ఉన్నాడు. పెళ్లి సమయంలో కట్నం కింద రూ.6 లక్షల నగదు, 20 తులాల బంగారం ముట్టజెప్పారు. బాబు పుట్టినప్పటి నుంచి అదనంగా మరో రూ.20 లక్షలు అదనపు కట్నం కావాలని అత్తింటి వారు వేధింపులకు గురి చేశారు. ఇటీవల పెగడపల్లి గ్రామంలో పంచాయితీ కూడా జరిగింది.
మానసను బాగా చూసుకుంటామని నమ్మించి కాపురానికి తీసుకెళ్లారు. ఈ నెల 10వ తేదీన బాబు పుట్టిన రోజు వేడుకకు 8ఇంక్‌లైన్‌కు రమ్మని మానస పుట్టింటి వారికి కబురు చేశారు. పథకం ప్రకారం మానసను ఒక రోజు ముందే ఈనెల 9వ తేదీన 8ఇంక్‌లైన్ కాలనీలోని క్వార్టరు నంబరు టి2–151లో ఉరివేసి చంపి ఆత్మహత్య చేసుకుందని డ్రామాకు తెరదించారన్నారు. అత్త పుష్పలత, మామ లక్ష్మారెడ్డి, ఆడపడుచు రజితను చట్టరీత్యా శిక్షించి న్యాయం చేయాలని రేవతిరావుకు మానస తల్లి మంజుల మొరపెట్టుకుంది. బాధిత కుటుంబాన్ని రేవతిరావు ఓదార్చారు. న్యాయం చేస్తామని హామీఇచ్చారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తనకు ఫోన్ చేయాలని 99493 31939 నంబర్ ఇచ్చారు. తొలిసారిగా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి వచ్చిన రేవతిరావును గ్రామస్తులు సన్మానించారు. ఆమె వెంట ఎంపీపీ సంపత్, జెడ్పీటీసీ తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ నిర్మల, నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment