సాక్షి, చెన్నై : జీతం కోసం ఒత్తిడి తెచ్చిన వృద్ధుడిని ఓ సెక్యూరిటీ సంస్థ నిర్వాహకులు పెట్రోల్ పోసి తగల బెట్టారు. ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న బాధితుడు ఆస్పత్రిలో శుక్రవారం అర్ధరాత్రి మరణించాడు. వివరాలు.. మదురై నగరం దక్షిణ మాసి వీధికి చెందిన రత్నవేల్(70) ఎస్‌ఎస్‌ఓ సెక్యూరిటీ సంస్థలో వాచ్‌మన్‌గా (కోయంబత్తూరులో) పని చేస్తున్నాడు. కొన్ని నెలలుగా నిర్వాహకులు దిలీప్‌కుమార్, జాన్ జీతం సరిగ్గా ఇవ్వకపోవడంతో రత్నవేల్ వారిపై ఒత్తిడి తెచ్చాడు. గురువారం జీతం ఇస్తామని నిర్వాహకులు సూచించారు. అదేరోజు రాత్రి వారు చెప్పిన చోటుకి రత్నవేల్ వెళ్లాడు.
అక్కడ వారు అవహేళనగా మాట్లాడుతూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో రత్నవేల్ వారికి ఎదురు తిరిగాడు. దీంతో ఆగ్రహించిన ఆ ఇద్దరు రత్నవేల్‌ను చితక్కొట్టారు. కారులో కొడిస్సీయా వద్దకు తీసుకొచ్చి.. పెట్రోల్ పోసి నిప్పు అంటించి పరారయ్యారు. మంటల్లో కాలుతూ వృద్ధుడు పెట్టిన కేకల్ని విని అటుగా వెళ్లేవారు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. రత్నవేల్ ఇచ్చిన వాంగ్ములం మేరకు నిర్వాహకులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. అజ్ఞాతంలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అదే సమయంలో తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ఉన్న రత్నవేల్ శుక్రవారం అర్ధరాత్రి చికిత్స ఫలించక తుదిశ్వాస విడిచాడు.
Comments
Please login to add a commentAdd a comment