మలివిడతలోనూ ‘దేశం’ దౌర్జన్యకాండ | TDP Crimininal Activities In Second Phase Panchayat Elections Of AP | Sakshi
Sakshi News home page

మలివిడతలోనూ ‘దేశం’ దౌర్జన్యకాండ

Published Sun, Feb 14 2021 4:21 AM | Last Updated on Sun, Feb 14 2021 4:21 AM

TDP Crimininal Activities In Second Phase Panchayat Elections Of AP - Sakshi

అపస్మారక స్థితికి చేరిన తలారి బయన్న

సాక్షి, అమరావతి: ఏకగ్రీవాల సంఖ్య పెరగడం, తొలివిడతలో ప్రజాతీర్పు అధికార పార్టీకి అనుకూలంగా ఉండటంతో జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులు పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా శనివారం పలుచోట్ల దౌర్జన్యానికి పాల్పడ్డాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో 18 రెవెన్యూ డివిజన్లలో 167 మండలాలకు చెందిన గ్రామాలు, వార్డుల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. పలు ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టి దాడులకు దిగడడంతో పోలీసులు రంగంలోకి దిగి చెదరగొట్టారు. మలివిడత పోలింగ్‌లో దాదాపు 9 వేలకు పైగా అతి సమస్యాత్మక, సమస్యాత్మక గ్రామాల్లో పోలింగ్‌ను వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పర్యవేక్షించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద మాస్కులు, శానిటైజర్లతోపాటు వైద్య ఆరోగ్య సిబ్బందిని నియమించి కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకున్నారు. 

మలి విడతలోను టీడీపీ దౌర్జన్యపర్వం
విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం కృష్ణపల్లిలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడైన సర్పంచ్‌ అభ్యర్ధిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు దౌర్జన్యానికి దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది. కృష్ణా జిల్లా కొత్త నిమ్మకూరులో ఓ వృద్ధురాలితో కలసి పోలింగ్‌ బూత్‌ లోపలికి ప్రవేశించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించగా వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు అభ్యంతరం తెలపడంతో దాడికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కృష్ణా జిల్లా పామర్రు మండలం పెరిసేపల్లిలో పోలింగ్‌ బూత్‌లో ఏజెంట్‌గా ఉన్న దాసి ప్రవీణ్‌కుమార్‌ను మాస్క్‌ ధరించలేదనే నెపంతో టీడీపీ నేతలు దాడి చేశారు.

గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో దొంగ ఓట్లు వ్యవహారం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ప్రకాశం జిల్లా కొనకనమిట్ట మండలం బోడపాడులో టీడీపీ అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ మద్దతుదారైన అభ్యర్థి కమలాకర్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద బైఠాయించడంతో వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం కోళ్లబైలులో బ్యాలెట్‌ పెట్టెల తరలింపు ఉద్రిక్తతకు దారితీసింది. తమ గ్రామంలోనే కౌంటింగ్‌ జరపాలంటూ పోలింగ్‌ బూత్‌కు తాళాలు వేసి గ్రామస్తులు అందోళనకు దిగారు. విశాఖ, విజయనగరం జిల్లాల్లోని మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

పామర్రు ఎమ్మెల్యే అనిల్‌పై డీఐజీ అసహనం
కృష్ణా జిల్లా పామర్రు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకుని బయటకు వస్తున్న ఎమ్మెల్యే అనిల్‌ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై టీడీపీ శ్రేణుల దౌర్జన్యకాండను డీఐజీ మోహనరావుకు వివరించే ప్రయత్నం చేయగా డీఐజీ పట్టించుకోలేదు. వెళ్లవయ్యా.. వెళ్లు అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఓ ప్రజాప్రతినిధిగా తాను చెప్పేది వినకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మనస్తాపం చెందిన ఎమ్మెల్యే అనిల్‌ డీఐజీ కారు వద్ద నిరసన తెలిపారు. దీనిపై అసెంబ్లీ స్పీకర్‌కు, డీజీపీకి ఫిర్యాదు చేస్తానన్నారు. డీఐజీ తీరుకు నిరసనగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపాయి. దీంతో తాను ఎమ్మెల్యేను గుర్తుపట్టలేదంటూ డీఐజీ నిష్క్రమించారు. 

టీడీపీ నేతల బరితెగింపు
తాడిపత్రి రూరల్‌: ఓటర్లకు డబ్బు పంచుతున్న విషయాన్ని పోలీసులకు సమాచారం ఇస్తారేమోననే భయంతో టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడికి తెగబడిన ఘటన అనంతపురం జిల్లా ఆలూరులో శనివారం జరిగింది. తాడిపత్రి మండలం ఆలూరులో టీడీపీ మద్దతుదారైన అగ్రహారం శంకర్‌.. టీడీపీ నేత తిరుపాల్‌రెడ్డి, కార్యకర్తలతో కలిసి ప్రచారం ముసుగులో ఓటర్లకు డబ్బులు పంచడంలో నిమగ్నమయ్యాడు. దీనిని వైఎస్సార్‌సీపీ కార్యకర్త రవిచంద్రారెడ్డి గమనించడంతో పోలీసులకు సమాచారం ఇస్తాడేమోననే ఉద్దేశంతో  తిరుపాల్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, వెంకటనారాయణ, రమేష్, వెంకటప్రసాద్, సర్పంచ్‌ అభ్యర్థి శంకర్, నాగరంగయ్య అలియాస్‌ బుజ్జి, అగ్రహారం ప్రసాద్, శివ, రంగనాయకులు, వేణుగోపాల్, గురుస్వామి మరికొందరు అతనిపై రాళ్లు, కట్టెలతో దాడికి తెగబడ్డారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ అభిమానులు అతడిని కాపాడేందుకు అక్కడికి పరుగెత్తుకు రాగా.. వారిపైనా దాడి చేశారు. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రవిచంద్రారెడ్డి, ప్రవీణ్‌కుమార్, తలారి బయన్న, వంశీలకు గాయాలయ్యాయి. వీరిని చికిత్సకు తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించకుండా పోలీసులు గంటకు పైగా పోలీసుస్టేషన్‌లోనే ఉంచడం విమర్శలకు తావిస్తోంది.

ఓటమిని జీర్ణించుకోలేక రాళ్ల దాడి
కొలిమిగుండ్ల: కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంకమ్మవారిపల్లెలో ఓటమిని జీర్ణించుకోలేని టీడీపీ కార్యకర్తలు శనివారం   వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై రాళ్లతో దాడి చేశారు. సర్పంచ్‌ పదవికి వైఎస్సార్‌సీపీ అభిమాని తమ్మినేని కొండయ్య, టీడీపీ తరఫున రాందాస్‌చౌదరి పోటీపడగా.. తమ్మినేని కొండయ్య 123 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటుండగా టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడికి దిగారు. రాముడు, గురుచంద్ర, వెంకటేశ్వరరావుతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement