శాంతి భద్రతల్లేవు... భయం లేదు..
శ్రీ సత్యసాయి జిల్లాలో బాలికపై టీడీపీ నేత అత్యాచార యత్నం
నిందితుడిపై పోక్సో కేసు నమోదు
విశాఖలో మానసిక దివ్యాంగురాలిపై వ్యక్తి లైంగికదాడి
ఇప్పటి వరకూ కేసు నమోదు చేయని పోలీసులు
పుట్టపర్తి అర్బన్/డాబాగార్డెన్స్: రాష్ట్రంలోని రెండు వేర్వేరు జిల్లాల్లో చిన్నారులపై మృగాళ్లు రెచ్చిపోయారు. శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి మండలంలోని ఓ టీడీపీ నేత చిన్నారిపై లైంగికదాడికి యత్నించగా, విశాఖపట్నంలోని డాబా గార్డెన్స్ పరిధిలో ఓ దివ్యాంగురాలిపై 45 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి చేశాడు. శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి మండలం, బత్తలపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఓ బాలిక ఐదోతరగతి చదువుతోంది.
బుధవారం పాఠశాల అనంతరం ఇంటికి వచ్చిన బాలిక మరుగుదొడ్డి లేక బహిర్భూమి కోసం బయటకు వెళ్లింది. ఆ సమయంలో అక్కడే ఉన్న గ్రామానికి చెందిన టీడీపీ నేత సూర్యనారాయణ అనే వ్యక్తి రోడ్డు పక్కన ఉన్న బాత్‌రూంలోకి బాలికను ఎత్తుకెళ్లి అత్యాచార యత్నం చేశాడు. ఇష్టానుసారం చిన్నారిని కొరుకుతూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు.
భయంతో బాలిక పెద్ద పెట్టున కేకలు వేయగా.. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక వెంటనే ఇంటికి వెళ్లి విషయం కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వారు పరువుపోతుందని సమీప గ్రామం పెడవల్లిలోని ఓ ప్రైవేటు వైద్యుడి వద్దకు బాలికను తీసుకెళ్లి గుట్టుచప్పుడు కాకుండా వైద్యం చేయించినట్లు తెలిసింది.
బాధిత కుటుంబానికి ‘టీడీపీ’ బెదిరింపులు
నిందితుడు సూర్యనారాయణ స్థానిక టీడీపీ నేత. ఆయన సోదరి మాజీ ఎమ్మెల్యే పల్లె రాఘునాథరెడ్డి అనుచరురాలు. దీంతో టీడీపీ నేతలు నిందితుడికి అండగా నిలిచారు. బాధితురాలి కుటుంబాన్ని భయపెట్టారు. అయితే ఈ నోటా... ఆ నోటా... ఈ ఘటన పోలీసుల వరకూ వెళ్లడంతో బుధవారం రాత్రి పొద్దుపోయాక పోలీసులే బాధితురాలి ఇంటికి వచ్చిన విచారణ జరిపారు.
ఎవరికీ భయపడాల్సిన పనిలేదని చెప్పడంతో గురువారం బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు సూర్యనారాయణపై పోక్సో కేసు నమోదైంది. ప్రస్తుతం పరారీలో ఉన్న సూర్యనారాయణ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా నిందితుడికి భార్య, పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
విశాఖలో మానసిక దివ్యాంగురాలిపై లైంగికదాడి
విశాఖపట్నం వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలోని అఫీషియల్ కాలనీ మూడోలేన్ దరి గొల్లవీధి ప్రాంతంలో 12 ఏళ్ల మానసిక దివ్యాంగురాలు తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఇదే వీధిలో వాడమదుల జోగారావు (45) కూడా నివసిస్తున్నాడు. అతనికి వివాహం కాలేదు. బాధితురాలు తరచూ జోగారావు ఇంటికి ఆడుకోవడానికి వెళ్తుంటుంది. ఎప్పటి నుంచో బాలికపై కన్నేసిన జోగారావు రెండు రోజుల కిందట ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బుధవారం ఉదయం బాలిక తీవ్ర మంటతో బాధపడుతుంటే తల్లిదండ్రులు కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించి వైద్యులు లైంగిక దాడికి గురైనట్టు నిర్ధారించారు. ఈ విషయాన్ని వన్‌టౌన్ పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పటి నుంచి ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి కోసం పోలీసులు ఆరా తీశారు.
బాధితురాలికి నిందితుడి ఫొటో చూపగా గుర్తించింది. దీంతో విచారణ చేపట్టారు. ఘటన జరిగి రెండు రోజులైనా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. దీనికి సంబంధించి పోలీసులను వివరాలు అడగ్గా ఎలాంటి స్పందన లేదు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment