
గాయపడ్డ శివయ్య
కేవీబీపురం (చిత్తూరు జిల్లా): తమ పార్టీకి ఓటు వేయలేదన్న దుగ్ధతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై టీడీపీ నేతలు దాడి చేసిన ఘటన మంగళవారం చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ గోపి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అంజూరుకు చెందిన కె.శివయ్య వైఎస్సార్‌సీపీకి మద్దతుగా పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేశాడు. దీంతో కక్ష పెంచుకున్న టీడీపీ నేత సి.శివయ్య అతడిపై తప్పుడు ప్రచారం చేస్తూ దూషణకు పాల్పడ్డాడు. కె.శివయ్య నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
సోమవారం అర్ధరాత్రి టీడీపీ నేతలు సి.శివయ్య, వెంకటేశులు, చంద్రశేఖర్, ప్రకాశ్‌లు ఇంట్లో నిద్రిస్తున్న కె.శివయ్యపై దాడికి పాల్పడి ఆయన ఇంటిని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో కె.శివయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడిని అడ్డుకోబోయిన ఆయన తమ్ముడు సుబ్రహ్మణ్యం, భార్య ద్రాక్షాయణికి కూడా గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన నలుగురు టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. శివయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment