
వైఎస్సార్‌సీపీ మహిళా కార్యకర్తలపైకి దూసుకొస్తున్న టీడీపీ మహిళా కార్యకర్తలు
లబ్బీపేట, కృష్ణలంక (విజయవాడ తూర్పు): విజయవాడలో టీడీపీ వర్గీయులు వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్‌సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్ చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొనడానికి మంగళవారం తారకరామ నగర్‌లో పలువురు వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు ఎదురు చూస్తున్నారు.
అంతలో టీడీపీకి చెందిన షేక్ ఫాతిమా రమీజా మరికొందరు అక్కడికి వచ్చి వారితో దురుసుగా వ్యవహరించారు. మాటలతో రెచ్చగొడుతూ వారిపైకి దూసుకెళ్లారు. వెంట తెచ్చుకున్న కారం వారి కళ్లల్లో చల్లి.. కర్రలతో దాడి చేస్తూ భయానక వాతావరణం సృష్టించారు. ఈ దాడిలో వైఎస్సార్‌సీపీకి చెందిన బచ్చు మాధవి, సునీత మరికొందరికి గాయాలయ్యాయి. అక్కడే ఉన్న వలంటీర్ శాంతిరెడ్డిపైనా దాడికి యత్నించారు.
టీడీపీ దాడిలో గాయపడిన సునీత, బచ్చు మాధవి
సౌత్ ఏసీపీ రవికిరణ్, కృష్ణలంక సీఐ దుర్గారావు పోలీసు సిబ్బందితో వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తమ కళ్లల్లో కారం చల్లి, దాడి చేశారని బి.సునీత.. టీడీపీకి చెందిన షేక్ ఫాతిమా, రమీజా, శైలు, మరో 10 మందిపై ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని, వైఎస్సార్‌సీపీ నేతలే తమ వాళ్లపై దాడి చేశారని ఆందోళన చేపట్టారు.
బచ్చు మాధవి, రామిరెడ్డి, దామోదర్, మరో 11 మంది తమపై దాడి చేశారంటూ ఫాతిమా, రమీజా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాల ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో తనకు లభిస్తున్న ఆదరణ చూసి ఓటమి భయంతోనే టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని దేవినేని అవినాష్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment