Ongole: నా వెనకుంది దామచర్ల.. నన్నేమీ చేయలేరు..!  | TDP Leaders Land Grabbing In Ongole | Sakshi
Sakshi News home page

Ongole: నా వెనకుంది దామచర్ల.. నన్నేమీ చేయలేరు..! 

Published Thu, Jul 14 2022 9:01 AM | Last Updated on Thu, Jul 14 2022 9:04 AM

TDP Leaders Land Grabbing In Ongole - Sakshi

చెరువుకొమ్ముపాలెం సమీపంలోని అమృత నగర్‌

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నేతలు, సానుభూతిపరులు సాగించిన భూదందా నేటికీ కొనసాగుతోంది. అమాయక పేద ప్రజలకు స్థలాల ఆశ చూపి గతంలో డబ్బు గుంజిన టీడీపీ నాయకులు నేడు అదే పంథాను అనుసరిస్తున్నారు. ఒంగోలు నగరంలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై కోర్టులో కేసులు వేసి రాక్షసానందం పొందుతున్న టీడీపీ నేతలు.. అదే ఒంగోలు నగర కార్పొరేషన్‌ పరిధిలో భూదందా సాగిస్తుండటం సంచలనంగా మారింది.
చదవండి: విభేదాలతో సై’కిల్’.. టీడీపీలో కుంపట్ల కుమ్ములాట

పెళ్లూరు. చెరువుకొమ్ముపాలెం మధ్య ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా ఆక్రమించి బిట్లు బిట్లుగా విక్రయించిన మహిళా నాయకురాలు.. తాజాగా మరికొంత ప్రభుత్వ భూమిని ఆక్రమించి అమ్మేసే యత్నం చేస్తోంది. దీనిపై అభ్యంతరం తెలిపిన స్థానికులను చంపేస్తామంటూ రౌడీలతో బెదిరిస్తుండటంతో వారు ప్రాణ భయంతో బుధవారం  ఎస్పీ మలికాగర్గ్‌ వద్దకు వెళ్లి రక్షణ కల్పించాలని మొరపెట్టుకున్నారు.

ఒంగోలు నగర కార్పొరేషన్‌ పరిధిలోని చెరువుకొమ్ముపాలెం–పెళ్లూరు పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూమి గత టీడీపీ ప్రభుత్వంలో ఆక్రమణకు గురైంది. ఈ అక్రమాల దందాకు ప్రధాన సూత్రధారురాలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ అనుచర వర్గానికి చెందిన పాలేటి అమృత. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ఆమె.. దానికి ఏకంగా అమృత నగర్‌గా పేరుపెట్టింది. అందులో గుడిసెలు వేసి పట్టాలిప్పిస్తానని చెప్పడంతో సుమారు 55 మంది వరకు ఆశపడ్డారు. ఒక్కొక్కరికి 10 గదుల చొప్పున స్థలం కేటాయించిన అమృత రూ.లక్ష చొప్పున అప్పనంగా దండుకుంది.

రౌడీ మూకలతో బెదిరింపులు..
చెరువుకొమ్ముపాలెం ఎస్సీ కాలనీలో 55 మంది గుడిసెలు వేసుకోగా ప్రస్తుతం అక్కడ 30 కుటుంబాలే కాపురముంటున్నాయి. సుమారు 25 మంది అమృత బెదిరింపులకు భయపడి గుడిసెలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. మామిడిపాలేనికి చెందిన కొందరు రౌడీïÙటర్లను పంపి తరచూ బెదిరిస్తుండటంతో చేసేదేమీ లేక వారంతా ఖాళీ చేసి వెళ్లిపోయారు. అలా ఖాళీ చేసి వెళ్లిన వారి గుడిసెలను కూడా అమృత రూ.లక్ష చొప్పున మళ్లీ బేరానికి పెట్టి అమ్మేసింది. అమృత నగర్‌ వెనుక ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఇటీవల కాలంలో ప్రభుదాస్‌ అనే వ్యక్తితో కలిసి ప్లాట్లు వేసి 15 మందికి విక్రయించడంతో స్థానికులు తమకు ఇబ్బందులొస్తాయని ఎదురుచెప్పడం అమృతకు కంటగింపుగా మారింది. బుధవారం రాత్రి పది గంటల సమయంలో అమృతతోపాటు 10 మంది వ్యక్తులు గుడిసెల వద్దకు వచ్చి బెదిరించడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.

అమ్మో ఆ వేధింపులు తాళలేం... 
సుబానీ బ్యాచ్, ప్రభుదాస్‌ బ్యాచ్‌ పేరుతో కొందరు రౌడీలు అర్ధరాత్రి పూట వచ్చి ఇళ్ల వద్ద నానాయాగీ చేస్తున్నారని కాలనీ వాసులు వాపోయారు. ఇళ్ల మధ్యలో మద్యం తాగి సీసాలు పగలగొట్టడంతో పాటు రాళ్లు వేస్తున్నారని, తలుపులు కొట్టి బెదిరిస్తుండటంతో నిత్యం నరకం అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రభుత్వ భూమిని చదును చేస్తుండగా అడ్డుకోవడానికి వచ్చిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులతోపాటు సచివాలయ సిబ్బందిని కూడా అమృత బెదిరించిందని స్థానికులు ఆరోపించారు. ‘‘మీరు ఎక్కడికెళ్లినా నాకేమీ కాదు. నాకు దామచర్ల జనార్దన్‌ సపోర్ట్‌ ఉంది’’ అంటూ పాలేటి అమృత బహిరంగంగా బెదిరిస్తోందని చెప్పారు. ‘కుక్క జోలికెళ్లి చక్కదనం పోగొట్టుకోవడం ఎందుకని వదిలేశాం’ అంటూ గుడిసెలు ఖాళీ చేసి వెళ్లిన బాధితులు అమృత వ్యవహార శైలిని ఉద్దేశించి వ్యాఖ్యానించడం గమనార్హం.

ఎస్పీగారూ మీరే కాపాడాలి.. చెరువుకొమ్ముపాలెం కాలనీ వాసుల మొర 
‘ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానంటూ అమృత అనే మహిళ తమ వద్ద నుంచి లక్ష రూపాయల చొప్పున తీసుకుని ప్రభుత్వ స్థలాన్ని చూపింది. గతంలో ఆమె మీద కేసు కూడా నమోదైంది. మళ్లీ రూ.50 వేలు డబ్బు ఇవ్వాలంటూ రౌడీలను పంపించి బెదిరిస్తోంది. రెండు రోజుల నుంచి రాత్రిపూట ఇళ్ల వద్దకు రౌడీలు వచ్చి రచ్చరచ్చ చేస్తున్నారు. ప్రశి్నస్తే దాడి చేస్తున్నారు. మంగళవారం తాలూకా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం. అమృత బారి నుంచి మాకు రక్షణ కలి్పంచండి’ అని కాలనీ వాసులు బుధవారం ఎస్పీని వేడుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement