జెడ్పీ కార్యాలయానికి తాళాలు వేసిన దృశ్యం
ఒంగోలు అర్బన్: జిల్లా ప్రజా పరిషత్ అధికారులపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగిన ఉదంతమిది. ఆ పార్టీ నాయకుల తీరుతో ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ (జెడ్పీ) కార్యాలయం వద్ద శనివారం సాయంత్రం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లకు సంబంధించి గతంలో నామినేషన్ల ఉపసంహరణల్లో బలవంతాలు, నామినేషన్‌లు వేయలేని పరిస్థితులు ఉన్నవారు ఫిర్యాదులు ఇవ్వొచ్చని ఎన్నికల కమిషన్ ఆదేశాలు పేర్కొనడంతో కొందరు అభ్యర్థులు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఫిర్యాదులు అందజేశారు. వారిలో కొందరు ఎక్‌నాలెడ్జ్‌మెంట్ ఇవ్వాలని అధికారులను కోరగా.. ఫిర్యాదులు, వాటి నకళ్లను పరిశీలించిన అనంతరం ఇస్తామని అధికారులు చెప్పారు. దీంతో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఈలోగా కలెక్టరేట్‌లో సమావేశం ఉందని బయలుదేరుతున్న జెడ్పీ సీఈవో కైలాష్ గిరీశ్వర్ కారును టీడీపీ నేతలు నిలువరించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కార్యాలయం గేటుకు కూడా తాళం వేయాల్సి వచి్చంది. అధికారులకు ఇచి్చన ఫిర్యాదుల్లో డీటీపీ సెంటర్లలో రెడీమేడ్‌గా తయారు చేసిన కాపీలు, సంతకాలు లేని కాపీలు ఉండటం గమనార్హం.
జెడ్పీ సీఈవో ఏమన్నారంటే..
ఫిర్యాదుల ఒరిజినల్ కాపీ, నకళ్ల కాపీని క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుందని, శుక్రవారం చాలా తక్కువ ఫిర్యాదులు రావడంతో వాటిని చదివి వెంటనే ఎక్‌నాలెడ్జ్‌మెంట్ ఇచ్చామని జెడ్పీ సీఈవో కైలాష్ గిరీశ్వర్ చెప్పారు. శనివారం అభ్యర్థులు పదుల సంఖ్యలో గుంపులుగా రావడంతో వెంటనే ఫిర్యాదుల్ని చదివి ఎక్‌నాలెడ్జ్‌మెంట్ ఇచ్చే పరిస్థితి లేక పరిశీలించిన అనంతరం ఇస్తామని చెప్పామన్నారు. అయినా లేనిపోని రాద్ధాంతం చేశారన్నారు. పరిశీలించకుండా నకళ్లు కాపీని ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌గా ఇస్తే వాటిలో ఫిర్యాదుల్లో ఇవ్వని డాక్యుమెంట్‌లు ఏవైనా ఇచ్చినట్టు అదనంగా రాసుకుంటే చట్టపరమైన ఇబ్బందులు వస్తాయన్నారు. ఫిర్యాదులకు సంబంధించి నామినేషన్ వేయలేకపోవడం, బలవంతపు ఉపసంహరణ వంటి వాటికి కచ్చితంగా తగిన ఆధారాలు ఉండాలని, అలా ఆధారాలు లేకపోతే ఫిర్యాదుదారులతో ఫిర్యాదుపై ఎటువంటి ఆధారాలు లేవని రాయించుకుని ఎక్‌నాలెడ్జ్‌మెంట్ ఇస్తున్నామని, ఇంత పారదర్శకంగా పనిచేస్తుంటే లేనిపోని యాగీ చేయడం బాధాకరమని పేర్కొన్నారు.
చదవండి: తీవ్రంగా నష్టపోయాం.. హోదాతో ఆదుకోండి
మున్సిపల్ ఎన్నికలు..ఎస్‌ఈసీ కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment