
కదిరి ఏరియా ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు
నల్లమాడ(అనంతపురం జిల్లా): బొగ్గలపల్లిలో వైఎస్సార్‌సీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు దమనకాండ సాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఒక ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్తులు, బాధితుల సమాచారం మేరకు... బుధవారం ఉదయం టీడీపీకి చెందిన ఒక మహిళ వైఎస్సార్‌సీపీకి చెందిన వారి పొలంలోకి వెళ్లి పరక పుల్లలు కోస్తోంది. గమనించిన పొలం యజమాని అభ్యంతరం తెలిపాడు. ఇది మనసులో పెట్టుకున్న టీడీపీ వర్గీయులు అదే రోజు సాయంత్రం 6.30 గంటల సమయంలో కొడవలి, గొడ్డలి, చాకు, కర్రలు చేతబూని వైఎస్సార్‌సీపీ వర్గీయుల ఇళ్లలోకి చొరబడి దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో వైఎస్సార్‌సీపీ వర్గీయులు ఆదెప్ప, ఈశ్వరమ్మ, బాలాజీ, శాంతమ్మ, పెద్ద వెంకట్రామన్న, శ్రీనివాసులు, శ్యామసుందర్, అరుణమ్మ తీవ్రంగా గాయపడ్డారు.
చదవండి: చావు బతుకుల్లో పావని.. రెండు కిడ్నీలకు ఇన్‌ఫెక్షన్
వీరందరూ కదిరి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. టీడీపీకి చెందిన శ్రీకాంత్, క్రిష్ణమూర్తి, వంశీ, సునందమ్మ, విజయమ్మ, పార్వతి, జయప్ప, చంద్రశేఖర్ తమపై దాడికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. రెండు నెలల క్రితం కూడా ఉపాధి పనుల విషయంలో టీడీపీ వారు దాడులు చేసినట్లు చెప్పారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు బొగ్గలపల్లిలో నిఘా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ వర్గీయులను ఆ పార్టీ మండల కన్వీనర్ పొరకల రామాంజనేయులు, కో ఆప్షన్ సభ్యుడు మహమ్మద్ రసూల్, నాయకులు ఆంజనేయులు నాయక్, నాగరాజునాయుడు, బాలాజీనాయుడు, కమలాకర్‌నాయుడు, రమణ తదితరులు పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment