సాక్షి, హైదరాబాద్: వివిధ బ్యాంకుల్లో తెలుగు అకాడమీకి చెందిన ఫిక్సిడ్ డిపాజిట్లను (ఎఫ్‌డీ) కొల్లగొట్టడానికి సాయికుమార్ నేతృత్వంలో రంగంలోకి దిగిన ముఠా పక్కా ప్లాన్ ప్రకారం వ్యవహరించింది. ఈ కేసులో తాము అరెస్టు అయినా... నగదు మాత్రం రికవరీ ఇవ్వకూడదనేలా వ్యవహరించింది. ఫలితంగా పోలీసులు ఈ కేసులో ఇప్పటికి 5% లోపు సొమ్మే స్వాధీనం చేసుకోగలిగారు. ఈ స్కామ్‌లో నిందితులు అకాడమీకి చెందిన మొత్తం రూ.64.5 కోట్లను స్వాహా చేశారు.
ఇప్పటివరకు సూత్రధారులతో పాటు మొత్తం 14 మందిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు సహాయకులు మాత్రమే చిక్కాల్సి ఉంది. అయితే నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకుంది రూ.3 కోట్లు మాత్రమే. స్కామ్ సొమ్ముతో ఖరీదు చేసిన స్థిరాస్తులు పెద్దగా బయటకు రాలేదు. ఓ నిందితుడు పెద్ద అంబర్‌పేటలో రూ.5 కోట్లు వెచ్చ ంచి భూమి, మరొకరు ఓ ఫ్లాట్ ఖరీదు చేసినట్లు మాత్రమే తేలింది. మిగిలిన సొమ్ము ఏమైందనే దానిపై స్పష్టత రాలేదు. అరెస్టయిన నిందితుల్లో 9 మంది పోలీస్ కస్టడీలో ఉండగా, వీరి విచారణ గడువు మంగళవారంతో ముగియనుంది.
వీరిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్న సీసీఎస్ పోలీసులు.. కెనరా బ్యాంకు మాజీ మేనేజర్ సాధనను కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ మేరకు న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది. మరో నలుగురిని కూడా కస్టడీలోకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. నిందితుల నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టేందుకు మళ్లీ కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ స్కామ్‌పై సీసీఎస్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఒక కేసులోనే అరెస్టులు, కస్టడీలు సాగుతున్నాయి. ఇది ముగిసిన తర్వాత మరో రెండింటిలోనూ విచారణ కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment