శ్రావణి (ఫైల్)
అమీర్‌పేట(హైదరాబాద్): టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి (24) ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మధురానగర్‌లో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రావణి ఎనిమిది సంవత్సరాల నుంచి తెలుగు టీవీ సీరియల్స్‌లో నటిస్తోంది. మౌనరాగం, మనసు మమత లాంటి పాపులర్ సీరియల్స్‌లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం మధురానగర్ హెచ్ బ్లాక్ 56లో గల ఓ అపార్ట్‌మెంట్‌లో శ్రావణి కుటుంబం ఉంటోంది. టిక్ టాక్ ద్వారా ఏపీలోని కాకినాడకు చెందిన దేవరాజ్‌రెడ్డి అలియాస్ సన్నీతో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. తనకు వెనకా ముందు ఎవరూ లేరని, ఆశ్రయం కల్పిస్తే ఏదైనా పనిచేసుకుంటానని అతను కోరడంతో శ్రావణి తల్లిదండ్రులు అంగీకరించారు. గత సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీ నుంచి దేవరాజ్ వారి ఇంట్లో ఉంటున్నాడు.
ఈ నేపథ్యంలో వీరి మధ్య మరింత చనువు ఏర్పడింది. శ్రావణి టీవీ సీరియల్స్‌కు చెందిన ఓ కార్యాలయంలో దేవరాజ్‌కు పనికూడా పెట్టించింది. సుమారు 4 నెలల పాటు బాగానే ఉంటూ వచ్చారు. తరువాత వీరి మధ్య విభేదాలు రావడంతో విడి విడిగా ఉంటున్నారు. అయితే తనను దూరం పెట్టిందన్న కోపంతో శ్రావణితో చనువుగా ఉండగా తీసిన ఫొటోలు, వీడియోలను అడ్డం పెట్టుకుని దేవరాజ్ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అవసరమైనప్పుడల్లా ఫోన్లు చేసి డబ్బులు ఇవ్వాలని, లేదంటే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని డబ్బులు తీసుకునేవాడు. అతడి వేధింపులు మరింతగా పెరగడంతో శ్రావణి మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో బాత్‌రూంలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాత్‌రూంలో నుండి శ్రావణి ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి తల్లిదండ్రులు తలుపు పగలగొట్టి లోపలకు వెళ్లి చూడగా ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రావణి తల్లి పాపారత్నం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దేవరాజ్‌రెడ్డి వేధింపులు భరించలేకే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని, అతడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరారు. శ్రావణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
మరో యువతిని మోసం చేయడంతో..
శ్రావణితో ఒకవైపు బాగా ఉంటూనే దేవరాజ్‌రెడ్డి ప్రేమపేరుతో మరో యువతిని మోసం చేశాడు. ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న శ్రావణి, ఎలాగైనా అతడిని దూరంగా పెట్టాలని నిర్ణయించుకుంది. దీంతో అతడు శ్రావణిపై కక్ష పెంచుకున్నాడు. ఆమెతో చనువుగా ఉన్న సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలను బూచిగా చూపి బ్లాక్‌మెయిల్ చేస్తూ వస్తున్నాడు. శ్రావణి వద్ద నుండి వెళ్లిపోయి స్నేహితుల వద్ద ఉంటున్న దేవరాజ్.. ఆమెకు ఫోన్ చేసి డబ్బులు పంపించాలని బెదిరించడంతో గూగుల్ పే ద్వారా ఒకసారి రూ.30 వేలు పంపింది. గత ఫిబ్రవరి 25వ తేదీన శ్రావణి ఇంటికి వచ్చిన దేవరాజ్ అత్యాచార యత్నానికి పాల్పడటంతో ఆమె అరుపులు విని చుట్టుపక్కల వారు రావడంతో పారిపోయాడు. రెండు రోజుల అనంతరం ఫోన్ చేసి తనకు లక్ష రూపాయలు కావాలని డిమాండ్ చేయటంతో మొదట రూ.60 వేలు, ఆ తరువాత మరో రూ.40 వేలు పంపించింది. కాగా, దేవరాజ్‌రెడ్డి వేధింపులు అధికం కావడంతో ఈ ఏడాది జూన్ 22న ఎస్‌ఆర్‌నగర్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుండి నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు దేవరాజ్‌ను పట్టుకోవడానికి గతంలో కాకినాడకు కూడా వెళ్లారు. నిందితుడిని ఎలాగైనా పట్టుకుని శిక్షిస్తామని తెలిపారు.
నాకేం సంబంధం లేదు..
తన కారణంగానే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దేవరాజ్‌రెడ్డి దీనిపై సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టాడు. సాయి అనే వ్యక్తి శ్రావణిని తన ముందే చంపాలని చూశాడని ఆరోపించాడు. పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని శ్రావణిని సాయి బెదిరించాడన్నాడు. ఆమె ఆత్మహత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. శ్రావణి కుటుంబ సభ్యులు, సాయి అనే వ్యక్తి వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని, కుటుంబ సభ్యులు కొట్టారనే అవమానమే ఆమె ఆత్మహత్యకు కారణమని పేర్కొన్నాడు. డబ్బుల కోసం తానేమీ బ్లాక్ మెయిల్ చేయలేదని దేవరాజ్ అన్నాడు. గతంలో ఇంట్లో వాళ్ల ఒత్తిడితోనే తనపై కేసు పెట్టిందని తెలిపాడు.
దేవరాజ్‌వల్లే..: సాయి
ఇదిలా ఉండగా.. దేవరాజ్‌రెడ్డి శ్రావణిని మానసికంగా చిత్రహింసలకు గురి చేయడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని సాయి ఆరోపించాడు. శ్రావణి ఉరి వేసుకుందని ఆమె తల్లిదండ్రుల వద్ద నుండి సమాచారం రాగానే వెంటనే వారి ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి తానే ఆసుపత్రికి తీసుకువెళ్లానని పేర్కొన్నాడు. అంతేకాకుండా శ్రావణిని దేవరాజ్‌రెడ్డి ఫోన్‌లో బెదిరిస్తూ మాట్లాడినట్టు చెబుతు న్న ఆడియోను విడుదల చేశాడు.
ప్రతి పండుగకు గొల్లప్రోలుకు వచ్చేది..
పిఠాపురం: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదా వరి జిల్లా గొల్లప్రోలుకు చెందిన టీవీ సీరి యల్ నటి శ్రావణి ఆత్మహత్యతో ఆమె కు టుంబంలో విషాదం నెలకొంది. తమ తం డ్రి కొండపల్లి భాస్కరావు వ్యవసాయ కూలీ అని, చిన్ననాటి నుంచి సెలబ్రిటీగా ఎదగా లని శ్రావణి తపన పడేదని మృతురాలి అక్క విమల తెలిపారు. మృతురాలికి విమ ల, మహేశ్వరి అనే ఇద్దరు అక్కలు, శివ అనే సోదరుడు ఉన్నారు. తమ చెల్లి శ్రావణి ఎనిమిదేళ్ల కిందట హైదరాబాద్ వెళ్లి తెలిసిన వారి ద్వారా టీవీ సీరియల్స్‌లో నటించే అవకాశం సంపాదించిందని, తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుందని విమల తెలిపారు. సీరియల్స్‌లోనే కాకుండా ఆర్‌ఎక్స్ 100తోపాటు 30 సినిమాల్లో కూడా శ్రావణి నటించిందని ఆమె వెల్లడించారు. ఇటీవలే గొల్లప్రోలులో శ్రావణి సొంతంగా ఇల్లు కొనుగోలు చేసిందని, మూడేళ్ల కిందట తమ తల్లిదండ్రులను గొల్లప్రోలు నుంచి హైదరాబాద్‌లో తన వద్దకు తీసుకువెళ్లడంతో అక్కడే ఉంటున్నారని విమల చెప్పారు. ప్రతి పండుగకు గొల్లప్రోలు వచ్చి తమతో ఆనందంగా గడిపి వెళ్లేదని, ఇటీవల వరలక్ష్మి వ్రతానికి కూడా వచ్చిందని.. అంతలోనే ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆమె విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment