ముసుగులు.. గ్యాస్‌కట్టర్లు.. మారణాయుధాలు! | Theft At SBI ATM Center In Sunder Nagar Visakhapatnam | Sakshi
Sakshi News home page

సినీ ఫక్కీలో దోచేశారు

Published Fri, Oct 23 2020 8:42 AM | Last Updated on Fri, Oct 23 2020 10:01 AM

Theft At SBI ATM Center In Sunder Nagar Visakhapatnam - Sakshi

కాలిపోయిన రూ.500 నోట్లు

సాక్షి, ఆరిలోవ (విశాఖ తూర్పు): ముఖాలకు ముసుగులు... ఒకరితో ఒకరికి పరిచయమే లేని ఓ పది మంది... గ్యాస్‌కట్టర్లు, మారణాయుధాలు... వాటితో విశాఖలోని ఓ బ్యాంక్‌లోకి ప్రవేశించిన దుండగులు... ఆ బ్యాంక్‌ను కొల్లగొట్టి రూ.500ల కోట్లు దోచేస్తారు... ఇదీ ఓ తెలుగు సినిమాలోని సన్నివేశం. అచ్చం అలా సినీ ఫక్కీలోనే నగర శివారులోని ఓ ఏటీఎం కేంద్రాన్ని కొల్లగొట్టేసి రూ.9.6లక్షలు దోచేశారు అగంతకులు. నగరంలో సంచలనం రేపిన ఈ ఘటన జీవీఎంసీ 10వ వార్డు పరిధి ఆదర్శనగర్‌ ప్రాంతం సుందర్‌నగర్‌ ప్రధాన రహదారి పక్కన గల ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రంలో బుధవారం రాత్రి జరిగింది. ఇంతవరకు ఇలాంటి రీతిలో నగరంలో ఎన్నడూ దొంగతనం జరగలేదని పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...  చదవండి: బంగారం, బైక్‌ ఇవ్వాల్సిందే.. మనస్తాపంతో..

పక్కా ప్రణాళికతో ప్రవేశించి...  
ఆదర్శనగర్‌ సమీప సుందర్‌నగర్‌ ప్రధాన రహదారి రాత్రి పది గంటల తర్వాత ఎప్పుడూ నిర్మాణుష్యంగా ఉంటుంది. పెద్దగా జనసంచారం ఉండదని భావించిన దుండగులు ఇక్కడి ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ముందస్తు ప్రణాళికతో గ్యాస్‌ సిలిండర్లు (ఒకటి పెద్దది, ఇంకొకటి చిన్నది), కట్టర్లు, గుణపంతో కేంద్రంలోకి బుధవారం అర్ధరాత్రి సమయంలో చేరుకున్నారు. లోపల ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియకుండా షట్టర్‌ దించేశారు. అక్కడి సీసీ కెమెరాల కనెక్షన్‌ కూడా కట్‌ చేసేశారు. గ్యాస్‌ ఉపయోగించి కట్టర్ల సాయంతో నగదు ఉండే మిషన్‌ను కోసేశారు. అనంతరం దాన్ని పగులగొట్టి అందులోని సుమారు రూ.9.60 లక్షలు దోచుకుపోయారు. గ్యాస్‌ కట్టర్‌తో కోసే సమయంలో రేగిన నిప్పు రవ్వలకు కొన్ని రూ.500ల నోట్లు కాలిపోవడంతో వాటిని అక్కడే వదిలేశారు. దోపిడీ కోసం వెంట తీసుకొచ్చిన సామాగ్రి మాత్రం కేంద్రంలో విడిచిపెట్టేసి వెళ్లిపోయారు.  చదవండి: కరోనాతో భర్త.. బంగ్లాపై నుంచి దూకి భార్య!


                     దొంగలు ఉపయోగించిన గ్యాస్‌ సిలిండర్లు, కట్టర్లు

డబ్బులు నింపిన మూడు రోజులకే చోరీ  
సుందర్‌నగర్‌లోని ఏటీఎం కేంద్రంలో ఎప్పుడూ డబ్బులు అందుబాటులో ఉండేవి కాదని స్థానికులు చెబుతున్నారు. ఈ సారి మాత్రం అధికారులు మిషన్‌లో డబ్బులు నింపిన మూడు రోజులకే చోరీకి గురయ్యాయని అంటున్నారు. ఇక్కడి మిషన్‌లో నగదు నింపిన విషయం వినియోగదారులకూ తెలియదని, దొంగలకు మాత్రం బాగానే తెలిసిందని అంటున్నారు. ఈ చోరీకి  ఇంటిదొంగల సహకారం ఏమైనా ఉందా అని పలువురు అనుమానిస్తున్నారు. మరోవైపు కొన్ని నెలల నుంచి ఇక్కడి సీసీ కెమెరాలు కూడా పని చేయకపోవడంతో దొంగలు గుట్టుగా చక్కబెట్టేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

గ్యాస్‌ కట్టర్లు, సిలిండర్లు, గుణపం తీసుకొచ్చి చోరీ చేశారంటే కరుడుగట్టిన ముఠా పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇంత సరంజామా తీసుకొచ్చి ఏటీఎం కేంద్రంలో చోరీ చేసేందుకు సుమారు రెండు గంటల సమయం పడుతుందని.., అప్పటి వరకూ నైట్‌æరౌండ్స్‌ డ్యూటీలో ఉన్న ఆరిలోవ పోలీసులు ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ ఏటీఎం కేంద్రం వైపు తిరగలేదా..? తిరిగితే వారు దీన్ని పరిశీలించలేదా..? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వస్తున్నాయి.


       ఏటీఎం కేంద్రం వద్ద చోరీ వివరాలు తెలుసుకొంటున్న క్రైం డీసీపీ సురేబాబు

ఈ తరహా దోపిడీ నగరంలో తొలిసారి  
స్థానికుల సమాచారంతో గురువారం ఉదయం విషయం తెలుసుకొన్న ఆరిలోవ పోలీసులు సుందర్‌నగర్‌లోని ఏటీఎం కేంద్రం వద్దకు చేరుకొన్నారు. లోపల చిందరవందరగా ఉన్న మిషన్‌ను పరిశీలించిన సీఐ ఇమ్మాన్యుయేల్‌ రాజు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే క్రైం డీసీపీ సురేష్‌‌ బాబు, క్రైం ఏసీపీ పెంటారావు, సీఐలు, ఎస్‌ఐలు అక్కడకు చేరుకొన్నారు. క్లూస్‌ టీంను రప్పించి వేలిముద్రలు సేకరించారు. దొంగతనం జరిగిన విధానం పరిశీలించారు. ఈ సందర్భంగా క్రైం డీసీపీ సురేష్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ ఈ తరహాలో నగరంలోని ఏటీఎం కేంద్రాల్లో దొంగతనం జరగడం ఇదే తొలిసారన్నారు. బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఓ వ్యక్తి ఈ ఏటీఎం కేంద్రానికి వచ్చాడని.., డబ్బులు రాకపోవడంతో తిరిగి వెళ్లిపోయాడన్నారు. ఆ తర్వాత గుర్తు తెలియని దొంగలు ప్రవేశించి డబ్బులు ఎత్తుకుపోయారని తెలిపారు. మూడు రోజుల క్రితమే ఎస్‌బీఐ సిబ్బంది మిషన్‌లో డబ్బులు నింపారని.., ఆ విషయం తెలిసిన వారు రెక్కీ నిర్వహించి దోచేశారని అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించామని, సాధ్యమైనంత త్వరలో దొంగలను పట్టుకొంటామని పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement