SBI ATM center
-
దేశంలో స్తంభించిన ఎస్బీఐ సేవలు..
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ సేవలకు అంతరాయం ఏర్పడింది. గురువారం మధ్యాహ్నం నుంచి యోనో యాప్, యూపీఐ సేవలు నిలిచిపోయాయి. ఆన్లైన్ బ్యాంకింగ్, ఫండ్ ట్రాన్స్ఫర్ విషయంలోనూ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేస్తున్నారు. ఏటీఎం సెంటర్లో కూడా నగదు ఉపసంహరణ జరగడం లేదని వాపోతున్నారు. ఎస్బీఐ బ్యాంక్ సేవలు పనిచేయకపోవడంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు సేవలు ఎప్పుడు పునరద్ధరిస్తామనేది కూడా ఎస్బీఐ అధికారులు చెప్పలేకపోతున్నారు. అంతేగాక నెలాఖరు కావడంతో జీతాలు పడే వేళ ఇలా బ్యాంక్ సేవలు స్తంభించడంపై ఎస్బీఐ శాలరీ అకౌంట్లు ఉన్న ఉద్యోగుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఎస్బీఐ సైనేజీ కేసు,7 సంస్థలకు సీసీఐ జరిమానా
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శాఖలు, ఆఫీసులు, ఏటీఎంలకు సైనేజీలను సరఫరా చేసేందుకు సంబంధించిన బిడ్‌ను రిగ్గింగ్ చేసిన కేసులో 7 సంస్థలు, వాటి అధికారులకు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) జరిమానా విధించింది. మొత్తం రూ. 1.29 కోట్లు కట్టాలని ఆదేశించింది. అలాగే ఇకపై పోటీని దెబ్బతీసే విధానాలకు పాల్పడవద్దని హెచ్చరించింది. ఆయా కంపెనీలకు చెందిన తొమ్మిది మంది అధికారులు రూ. 54,000 పైచిలుకు జరిమానా కట్టాల్సి రానుంది. వివరాల్లోకి వెడితే.. పలు ప్రదేశాల్లో ఎస్బీఐ బ్రాంచీలు, కార్యాలయాలు, ఏటీఎంలకు ఉన్న సైనేజీ స్థానంలో కొత్త సైనేజీ సరఫరా, ఇన్స్టాలేషన్ కోసం 2018 మార్చిలో ఎస్బీఐ ఇన్ఫ్రా మేనేజ్మెంట్ సొల్యూషన్స్ సంస్థ బిడ్లు ఆహ్వానించింది. అయితే, ఈ టెండర్ విషయంలో బిడ్డర్లు కుమ్మక్కయ్యారంటూ ఆరోపణలు రావడంతో సుమోటో ప్రాతిపదికన సీసీఐ విచారణ చేసింది. బిడ్డింగ్ ప్రక్రియ సజావుగా జరగకుండా .. ధరల అంశంలో కంపెనీలన్నీ కూడబలుక్కుని మార్కెట్‌ను తమలో తాము పంచుకున్నట్లు ఇందులో తేలింది. దీంతో సీసీఐ తాజా ఆదేశాలు ఇచ్చింది. వీటి ప్రకారం డైమండ్ డిస్ప్లే సొల్యూషన్స్ ఏజీఎక్స్ రిటైల్ సొల్యూషన్స్, ఒపల్ సైన్స్, ఎవెరీ డెనిసన్ తదితర సంస్థలకు జరిమానా విధించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలు చిన్న, మధ్యతరహా కోవకి చెందినవే కావడం, విచారణలో సహకరించడంతో పాటు తమ తప్పులను అంగీకరించిన నేపథ్యంలో శిక్ష విషయంలో సీసీఐ కొంత ఉదారత చూపింది. పెనాల్టీని ఆయా సంస్థల టర్నోవరులో 1 శాతానికి పరిమితం చేసింది. -
ముసుగులు.. గ్యాస్‌కట్టర్లు.. మారణాయుధాలు!
సాక్షి, ఆరిలోవ (విశాఖ తూర్పు): ముఖాలకు ముసుగులు... ఒకరితో ఒకరికి పరిచయమే లేని ఓ పది మంది... గ్యాస్‌కట్టర్లు, మారణాయుధాలు... వాటితో విశాఖలోని ఓ బ్యాంక్‌లోకి ప్రవేశించిన దుండగులు... ఆ బ్యాంక్‌ను కొల్లగొట్టి రూ.500ల కోట్లు దోచేస్తారు... ఇదీ ఓ తెలుగు సినిమాలోని సన్నివేశం. అచ్చం అలా సినీ ఫక్కీలోనే నగర శివారులోని ఓ ఏటీఎం కేంద్రాన్ని కొల్లగొట్టేసి రూ.9.6లక్షలు దోచేశారు అగంతకులు. నగరంలో సంచలనం రేపిన ఈ ఘటన జీవీఎంసీ 10వ వార్డు పరిధి ఆదర్శనగర్ ప్రాంతం సుందర్‌నగర్ ప్రధాన రహదారి పక్కన గల ఎస్బీఐ ఏటీఎం కేంద్రంలో బుధవారం రాత్రి జరిగింది. ఇంతవరకు ఇలాంటి రీతిలో నగరంలో ఎన్నడూ దొంగతనం జరగలేదని పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చదవండి: బంగారం, బైక్ ఇవ్వాల్సిందే.. మనస్తాపంతో.. పక్కా ప్రణాళికతో ప్రవేశించి... ఆదర్శనగర్ సమీప సుందర్‌నగర్ ప్రధాన రహదారి రాత్రి పది గంటల తర్వాత ఎప్పుడూ నిర్మాణుష్యంగా ఉంటుంది. పెద్దగా జనసంచారం ఉండదని భావించిన దుండగులు ఇక్కడి ఎస్బీఐ ఏటీఎం కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ముందస్తు ప్రణాళికతో గ్యాస్ సిలిండర్లు (ఒకటి పెద్దది, ఇంకొకటి చిన్నది), కట్టర్లు, గుణపంతో కేంద్రంలోకి బుధవారం అర్ధరాత్రి సమయంలో చేరుకున్నారు. లోపల ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియకుండా షట్టర్ దించేశారు. అక్కడి సీసీ కెమెరాల కనెక్షన్ కూడా కట్ చేసేశారు. గ్యాస్ ఉపయోగించి కట్టర్ల సాయంతో నగదు ఉండే మిషన్‌ను కోసేశారు. అనంతరం దాన్ని పగులగొట్టి అందులోని సుమారు రూ.9.60 లక్షలు దోచుకుపోయారు. గ్యాస్ కట్టర్‌తో కోసే సమయంలో రేగిన నిప్పు రవ్వలకు కొన్ని రూ.500ల నోట్లు కాలిపోవడంతో వాటిని అక్కడే వదిలేశారు. దోపిడీ కోసం వెంట తీసుకొచ్చిన సామాగ్రి మాత్రం కేంద్రంలో విడిచిపెట్టేసి వెళ్లిపోయారు. చదవండి: కరోనాతో భర్త.. బంగ్లాపై నుంచి దూకి భార్య! దొంగలు ఉపయోగించిన గ్యాస్ సిలిండర్లు, కట్టర్లు డబ్బులు నింపిన మూడు రోజులకే చోరీ సుందర్‌నగర్‌లోని ఏటీఎం కేంద్రంలో ఎప్పుడూ డబ్బులు అందుబాటులో ఉండేవి కాదని స్థానికులు చెబుతున్నారు. ఈ సారి మాత్రం అధికారులు మిషన్‌లో డబ్బులు నింపిన మూడు రోజులకే చోరీకి గురయ్యాయని అంటున్నారు. ఇక్కడి మిషన్‌లో నగదు నింపిన విషయం వినియోగదారులకూ తెలియదని, దొంగలకు మాత్రం బాగానే తెలిసిందని అంటున్నారు. ఈ చోరీకి ఇంటిదొంగల సహకారం ఏమైనా ఉందా అని పలువురు అనుమానిస్తున్నారు. మరోవైపు కొన్ని నెలల నుంచి ఇక్కడి సీసీ కెమెరాలు కూడా పని చేయకపోవడంతో దొంగలు గుట్టుగా చక్కబెట్టేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్యాస్ కట్టర్లు, సిలిండర్లు, గుణపం తీసుకొచ్చి చోరీ చేశారంటే కరుడుగట్టిన ముఠా పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇంత సరంజామా తీసుకొచ్చి ఏటీఎం కేంద్రంలో చోరీ చేసేందుకు సుమారు రెండు గంటల సమయం పడుతుందని.., అప్పటి వరకూ నైట్æరౌండ్స్ డ్యూటీలో ఉన్న ఆరిలోవ పోలీసులు ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ ఏటీఎం కేంద్రం వైపు తిరగలేదా..? తిరిగితే వారు దీన్ని పరిశీలించలేదా..? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వస్తున్నాయి. ఏటీఎం కేంద్రం వద్ద చోరీ వివరాలు తెలుసుకొంటున్న క్రైం డీసీపీ సురేబాబు ఈ తరహా దోపిడీ నగరంలో తొలిసారి స్థానికుల సమాచారంతో గురువారం ఉదయం విషయం తెలుసుకొన్న ఆరిలోవ పోలీసులు సుందర్‌నగర్‌లోని ఏటీఎం కేంద్రం వద్దకు చేరుకొన్నారు. లోపల చిందరవందరగా ఉన్న మిషన్‌ను పరిశీలించిన సీఐ ఇమ్మాన్యుయేల్ రాజు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే క్రైం డీసీపీ సురేష్ బాబు, క్రైం ఏసీపీ పెంటారావు, సీఐలు, ఎస్ఐలు అక్కడకు చేరుకొన్నారు. క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలు సేకరించారు. దొంగతనం జరిగిన విధానం పరిశీలించారు. ఈ సందర్భంగా క్రైం డీసీపీ సురేష్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ ఈ తరహాలో నగరంలోని ఏటీఎం కేంద్రాల్లో దొంగతనం జరగడం ఇదే తొలిసారన్నారు. బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఓ వ్యక్తి ఈ ఏటీఎం కేంద్రానికి వచ్చాడని.., డబ్బులు రాకపోవడంతో తిరిగి వెళ్లిపోయాడన్నారు. ఆ తర్వాత గుర్తు తెలియని దొంగలు ప్రవేశించి డబ్బులు ఎత్తుకుపోయారని తెలిపారు. మూడు రోజుల క్రితమే ఎస్బీఐ సిబ్బంది మిషన్‌లో డబ్బులు నింపారని.., ఆ విషయం తెలిసిన వారు రెక్కీ నిర్వహించి దోచేశారని అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించామని, సాధ్యమైనంత త్వరలో దొంగలను పట్టుకొంటామని పేర్కొన్నారు. -
ఎస్బీఐ ఏటీఎంలో 200 బదులు 10 రూపాయలు
కర్నూలు/ కల్లూరు: నగర శివారులోని నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంలో రూ. 200కు బదులు రూ. 10 నోటు వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఏపీఎస్ఆర్టీసీ జోనల్ డ్రైవింగ్ ట్రైనింగ్ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసే ప్రసాద్‌శౌరి శేషాద్రి నగర్లో నివసిస్తున్నారు. రూ. 10 వేలు డబ్బు అవసరమై సమీపంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎం వద్దకెళ్లి డ్రా చేశాడు. అందులో రూ. 200 నోట్లు 49, రూ. 10 నోటు ఒకటి వచ్చింది. ఆశ్చర్యపోయిన ప్రసాద్ శౌరి ఈ విషయం ఏటీఎం నిర్వహించే ఏజెన్సీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఏటీఎంలలో నగదు ఉంచే ఏజెన్సీలే ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నాయని కస్టమర్లు ఆరోపిస్తున్నారు. -
దారుణం.. సెక్యూరిటీని కాల్చి తుపాకీతో పరార్!
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలో కాల్పుల కలకలం రేగింది. మజ్రాదబాద్‌లోని ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో బుధవారం పట్టపగలే ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సెక్యూరిటీ గార్డుపై కాల్పులు జరిపారు. సెక్యూరిటీ గార్డు వద్ద ఉన్న తుపాకీని లాక్కెళ్లిపోయారు. సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అసలేం జరిగిందంటే.. మజ్రాదబాద్‌లోని ఎస్బీఐ ఏటీఎం సెంటర్ వద్ద ఓ సెక్యూరిటీ గార్డు కాపాలా ఉన్నాడు. మరో వ్యక్తి ఏటీఎం సెంటర్లో ఉన్నాడు. ఆ సమయంలో హెల్మెట్లు పెట్టుకుని ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చారు. వచ్చీ రాగానే సెక్యూరిటీ తొలుత గార్డుపై కాల్పులు జరిపారు. ఏటీఎం సెంటర్ లోపల ఉన్న వ్యక్తిని కూడా కొట్టిన దుండగులు సెక్యూరిటీ దగ్గరున్న తుపాకీ లాక్కొనేందుకు యత్నించారు. సెక్యూరిటీ గార్డు ప్రతిఘటించడంతో గాల్లో కాల్పులు జరిపి బీభత్సం సృష్టించారు. తర్వాత బలవంతంగా తుపాకీ లాక్కొని బైక్‌పై పరారయ్యారు. సెక్యూరిటీని కాల్చి తుపాకీతో పరారయ్యారు -
బద్వేల్ ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో రూ.2.50 లక్షలు మాయం
వైఎస్సార్ జిల్లా: ఏటీఎం కేంద్రాలు నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారుతున్నాయి. ఏటీఎం కేంద్రాల వద్ద సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడం..సీసీ కెమెరాలు పనిచేయకపోవటంతో భద్రత డొల్లగా మారింది. దీంతో వరుస దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. పోలీస్ శాఖ , బ్యాంకర్ల పర్యవేక్షణ కొరవడటంతో నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది. ఏటీఎం కేంద్రాల్లో చోరీలు యథేచ్ఛగా సాగి పోతున్నాయి. వైఎస్ఆర్ జిల్లాలోని బద్వేల్లో పోరుమామిళ్ల రోడ్డులో గల ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో రూ.2.50 లక్షలు మాయమైయ్యాయి. దీంతో బ్యాంకు అధికారులు బద్వేల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు బ్యాంకు అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.