![Cci Penalises 7Entities For Bid Rigging In Tender Related To Sbi Signage - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/5/Cci-Penalises.jpg.webp?itok=othrhleQ)
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) శాఖలు, ఆఫీసులు, ఏటీఎంలకు సైనేజీలను సరఫరా చేసేందుకు సంబంధించిన బిడ్‌ను రిగ్గింగ్ చేసిన కేసులో 7 సంస్థలు, వాటి అధికారులకు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) జరిమానా విధించింది. మొత్తం రూ. 1.29 కోట్లు కట్టాలని ఆదేశించింది. అలాగే ఇకపై పోటీని దెబ్బతీసే విధానాలకు పాల్పడవద్దని హెచ్చరించింది. ఆయా కంపెనీలకు చెందిన తొమ్మిది మంది అధికారులు రూ. 54,000 పైచిలుకు జరిమానా కట్టాల్సి రానుంది.
వివరాల్లోకి వెడితే.. పలు ప్రదేశాల్లో ఎస్‌బీఐ బ్రాంచీలు, కార్యాలయాలు, ఏటీఎంలకు ఉన్న సైనేజీ స్థానంలో కొత్త సైనేజీ సరఫరా, ఇన్‌స్టాలేషన్ కోసం 2018 మార్చిలో ఎస్‌బీఐ ఇన్‌ఫ్రా మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ సంస్థ బిడ్లు ఆహ్వానించింది. అయితే, ఈ టెండర్ విషయంలో బిడ్డర్లు కుమ్మక్కయ్యారంటూ ఆరోపణలు రావడంతో సుమోటో ప్రాతిపదికన సీసీఐ విచారణ చేసింది.
బిడ్డింగ్ ప్రక్రియ సజావుగా జరగకుండా .. ధరల అంశంలో కంపెనీలన్నీ కూడబలుక్కుని మార్కెట్‌ను తమలో తాము పంచుకున్నట్లు ఇందులో తేలింది. దీంతో సీసీఐ తాజా ఆదేశాలు ఇచ్చింది. వీటి ప్రకారం డైమండ్ డిస్‌ప్లే సొల్యూషన్స్ ఏజీఎక్స్ రిటైల్ సొల్యూషన్స్, ఒపల్ సైన్స్, ఎవెరీ డెనిసన్ తదితర సంస్థలకు జరిమానా విధించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలు చిన్న, మధ్యతరహా కోవకి చెందినవే కావడం, విచారణలో సహకరించడంతో పాటు తమ తప్పులను అంగీకరించిన నేపథ్యంలో శిక్ష విషయంలో సీసీఐ కొంత ఉదారత చూపింది. పెనాల్టీని ఆయా సంస్థల టర్నోవరులో 1 శాతానికి పరిమితం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment