రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు దుర్మరణం  | Three boys deceased in road accident at Palnadu | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు దుర్మరణం 

Published Wed, Apr 20 2022 4:18 AM | Last Updated on Wed, Apr 20 2022 4:18 AM

Three boys deceased in road accident at Palnadu - Sakshi

సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మైనర్లు మృత్యువాత పడ్డారు. సత్తెనపల్లి మండలం కంకణాపల్లికి చెందిన ఆవుల వెంకయ్య, శివలక్ష్మిల కుమారుడు ఆవుల తిరుమలరావు(17), గండికోటయ్య, ప్రభావతిల కుమారుడు గండి మహేష్‌బాబు(17), వావిలాల నగర్‌కు చెందిన శ్రీధర్, సత్యవాణిల కుమారుడు సత్యంశ్రీధర్‌(17) మిత్రులు. బెల్లంకొండ మండలం కందిపాడుకు వెళ్లేందుకు కంకణాలపల్లి నుంచి బైక్‌పై బయల్దేరారు.

ధూళిపాళ్ల వద్ద ఆర్టీసీ బస్సును దాటేందుకు ప్రయత్నించగా.. ఎదురుగా మరో ఆర్టీసీ బస్సు రావడంతో బైక్‌ వేగాన్ని తగ్గించారు. కాగా, వీరిముందు ఉన్న బస్సుకు బైక్‌ హ్యాండిల్‌ తగలడంతో రోడ్డుకు కుడివైపున పడిపోయారు. దీంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వీరి మీదుగా వెళ్లడంతో తిరుమలరావు, సత్యంశ్రీధర్‌ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలపాలైన గండి మహేష్‌బాబును గుంటూరు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు.

ఆవుల తిరుమలరావు పదో తరగతి పూర్తి చేసి సిమెంటు పనులకు వెళుతుండగా, సత్యంశ్రీధర్‌ ఇంటర్, గండి మహేష్‌బాబు పదో తరగతి చదువుతున్నారు. మహేష్‌బాబు సోదరి మమతశ్రీకి త్వరలో వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో కందిపాడులో నగదు ఇచ్చేందుకు మహేష్‌బాబుతో పాటు స్నేహితులు బైక్‌పై వెళుతుండగా దారుణం జరిగింది. ముగ్గురి మృతదేహాలనూ పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సత్తెనపల్లి రూరల్‌ సీఐ రామిశెట్టి ఉమేష్‌ చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement