కొణిజర్ల: కుమారుడికి ఆరోగ్యం బాగా లేకపోతే తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లాలనుకుంది. పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తూ కలెక్టరేట్‌లో గన్‌మెన్‌గా ఉన్న భర్తకు తీరిక లేకపోవడంతో మరిదిని వెంట పెట్టుకుని బయలుదేరిన క్రమంలో ఆస్పత్రికి చేరకుండానే జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం విదితమే. కొణిజర్ల మండలం తనికెళ్లకు చెందిన జెర్రిపోతుల సంధ్య తన కుమారుడు మహంత్‌ను తీసుకుని మరిది పుల్లారావుతో ఖమ్మంలోని ఆస్పత్రికి బుధవారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు.
(చదవండి: తల్లికి కరోనా పాజిటివ్.. బిడ్డకు నెగెటివ్)
మార్గమధ్యలో వారిని టిప్పర్ ఢీకొట్టింది. పుల్లారావు, మహంత్ తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృత్యువాత పడగా సంధ్య హైదరాబాద్ చికిత్స పొందుతూ మృతి చెందింది. వీరి మృతదేహాలను గురువారం స్వగ్రామానికి తీసుకురాగా కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులంతా చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆస్పత్రికి బయలుదేరుతున్నప్పుడు గంటలో వస్తామని చెప్పిన వారు మృతదేహాలుగా రావడంతో కుటుంబీకులు రోదించిన తీరు అందరికీ కన్నీళ్లు పెట్టించింది.
డ్యూటీ నిమిత్తం ఎక్కడకు వెళ్లినా గంటగంటకూ తనతో వీడియో కాల్‌లో మాట్లాడే కుమారుడు, భార్య మృతదేహాలను చూస్తూ నాగరాజు ఏడుస్తూ స్పృహ తప్పారు. ఇక ఆయన కుమార్తె రిషిత తల్లి, సోదరుడిని చూస్తూ అమాయకంగా రోదిస్తుండడం కలిచివేసింది. అలాగే, అన్న నీడలా వెన్నంటి ఉండే పుల్లారావు మృతితో ఆయన భార్య పద్మ, 8 నెలల కుమారుడు భార్గవ్ రోదిస్తుండగా ఆపడం ఎవరివల్లా కాలేదు. ముగ్గురి మృతదేహాలను ఒకే ట్రాక్టర్‌పై ఉంచి అంతిమయాత్ర నిర్వహించి కన్నీటి వీడ్కోలు పలికారు.
చదవండి: పెళ్లి సంబంధాలు రాక.. ఒంటరిగా ఉండలేక యువతి
Comments
Please login to add a commentAdd a comment