సాక్షి, మహబూబ్‌నగర్(భూత్పూర్): వారం రోజుల క్రితం ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిన ముగ్గురు గిరిజన యువకులు సోమవారం రాత్రి బిహార్‌లో అనుమానాస్పదంగా మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని మిఠ్యాతండాకు చెందిన వెంకటేష్(22), గుబ్బడితండాకు చెందినవినోద్ (20), సంతోష్(22).. ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతున్నారు. వీరు పది రోజుల క్రితం ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా ‘మేం ఎక్కడుంటే మీకెందుకు..’ అంటూ ఫోన్ కట్ చేసేవారు. దీంతో కొన్ని రోజులకు వారే తిరిగి వస్తారని కుటుంబసభ్యులు అనుకున్నారు.
ఈ నేపథ్యంలో బిహార్ రాజధాని పాట్నాలోని పీఎంసీహెచ్ (పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్)లో తీవ్ర అస్వస్థతతో చేరిన వెంకటేష్, వినోద్, సంతోష్‌లు అక్కడే చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందారు. ఆస్పత్రికి చెందిన వైద్యులు మృతుల వద్ద ఉన్న సెల్‌ఫోన్‌లోని నంబర్ ఆధారంగా హైదరాబాద్‌లో ఉంటున్న వారి బంధువు పాండుకు వీడియో కాల్ చేసి సమాచారం అందించారు. మృతదేహాలను చూసి గుర్తించిన పాండు.. విషయం తండాలోని తమ బంధువులకు చేరవేశారు.
చదవండి: (‘పిల్లలను చూసైనా బతకాలనిపించలేదా?’)
మృతికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియనప్పటికీ.. కల్తీ మద్యం తాగడం వల్ల మృతిచెందినట్లు సమాచారం. వినోద్ తండ్రి స్థానికంగా పెయింటింగ్ కూలీగా పనిచేస్తుండగా.. మిగిలిన ఇద్దరి తండ్రులు కొన్నేళ్ల క్రితమే మృతిచెందారు. మృతుల కుటుంబాల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని, యువకులు మృతి చెందడానికి గల కారణాలు తెలియదని ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు.
చిన్నతనంలో తండ్రి మృతి..
సంతోష్ చిన్నతనంలోనే తండ్రి కిషన్‌నాయక్ మృతిచెందగా తల్లి దివ్యాంగురాలు కావడంతో మేనమామ సాదు గుబ్బడితండాలో చిన్నపాటి ఇళ్లు నిర్మించి ఇచ్చారు. పదో తరగతి వరకు చదివిన సంతోష్, నక్కలబండతండాకు చెందిన శంకర్ వద్ద టైల్స్ వేసేందుకు కూలీగా వెళ్తుండేవాడు. డిసెంబర్ 31న మధ్యాహ్నం గుబ్బడితండాలో ఉన్నాడు. అదేరోజు నుంచి కనిపించడం లేదని, ఇంట్లో తల్లి హస్లీకి చెప్పకుండా వెళ్లాడు. ఉన్న ఒక కుమారుడు మృతిచెందిన విషయం తెలుసుకున్న తల్లి హస్లీ రోదన పలువురి తండావాసులను కంటతడి పెట్టించాయి. – హస్లీబాయి, గుబ్బడితండా
కూలీ పని చేస్తూ జీవనం..
గుబ్బడితండాకు చెందిన లలిత, లాలుకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమారుడు వెంకటేష్‌కు వివాహం కాగా హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. తండాలో ఇల్లు కూలిపోయే స్థితిలో ఉండగా ఇద్దరు కుమార్తెలు, కుమారుడు వినోద్‌తో కలిసి భూత్పూర్‌లోని బీసీకాలనీలో ఇల్లు అద్దె తీసుకొని ఉంటున్నారు. రెండో కుమారుడు వినోద్ మధ్యలోనే చదువు ఆపేసి ఖాళీగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే ఐదురోజుల క్రితం ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. వినోద్‌కు పెళ్లి సంబంధాలు చూస్తున్నామని, ఇంతలోనే ఇలా జరిగిపోయిందని వాపోయారు. –లాలూ, గుబ్బడితండా
చెప్పకుండానే వెళ్లిపోయాడు
నా భర్త చనిపోవడంతో కూలీ పనిచేస్తూ వెంకటేష్‌ను పోషిస్తున్నా. భూత్పూర్‌లోని ఓ దుకాణంలో పనిచేసేవాడు. 25 రోజుల క్రితం తండాలో జరిపిన పోచమ్మ పండగకు వచ్చి 20 రోజుల క్రితం చెప్పకుండా పోయాడు. తరుచూ వెళ్లి అక్కడకక్కడ తిరిగి వచ్చేవాడు. మళ్లీ వస్తాడని అనుకున్నా. మధ్యలో ఒకసారి ఫోన్ చేస్తే ఎక్కడుంటే నీకెందుకు వస్తాలే అన్నాడు. అంతలో చనిపోయాడని తెలిసింది. ఎట్లా చనిపోయాడో నాకు తెలియదు. –రుక్కి
Comments
Please login to add a commentAdd a comment