మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీసీపీ నారాయణరెడ్డి తదితరులు.. ఇన్‌సెట్లోనిరంజన్ (ఫైల్)
భూదాన్‌పోచంపల్లి: కెమికల్ కంపనీలో పనిచేస్తున్న బిహార్ రాష్ట్రానికి చెందిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మండలంలోని దోతిగూడెం శివారులో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దోతిగూడెంలోని రావూస్ కెమికల్ కంపెనీలో గత 6 నెలలుగా బిహార్ రాష్ట్రంలోని ధరురాంపూర్‌కు చెందిన నిరంజన్‌కుమార్(22) పనిచేస్తున్నాడు. అతడి సోదరులు రవికుమార్, లక్ష్మికాంత్‌తో పాటు మరో ఐదారుగురు కలిసి కంపెనీ సమీపంలో అద్దె గదిలో ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం 8.30 గంటలకు డ్యూటీ దిగిన నిరంజన్‌కుమార్ కడుపునొప్పిగా ఉందని టాబ్లెట్ తెచ్చుకోవడానికి దోతిగూడెంకు వెళ్తున్నానని సోదరులకు చెప్పాడు. అర్థరాత్రి అయినా ఇంటికి రాకపోయేసరికి సోదరుడు రవికుమార్ నిరంజన్‌కుమార్ మొబైల్‌కు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది.
కంపెనీలో పనిచేసే తోటి కార్మికులను విచారిస్తున్న పోలీసులు
రక్తపుమడుగులో విగతజీవిగా..
కాగా సోమవారం ఉదయం కంపెనీకి కాస్త దూరంలో నిర్మానుష్య ప్రాంతంలో దోతిగూడెం గ్రామానికి చెందిన వస్పరి నర్సింహకు రక్తమడుగులో యువకుడి మృతదేహం కనిపించడంతో అతడు వెంటనే గ్రామస్తులతో పాటు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించారు. భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి, చౌటుప్పల్ ఏసీపీ ఉదయ్‌రెడ్డి, సీఐ వెంకటయ్య, ఎస్‌ఐ సైదిరెడ్డి, ఏఎస్‌ఐలు శ్రీనివాస్‌రెడ్డి, ఇద్దయ్య ఘటనా స్థలాన్ని సందర్శించి హత్య జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సైదిరెడ్డి తెలిపారు.
శరీరాన్ని తూట్లుగా పొడిచి..
కాగా నిరంజన్‌కుమార్‌ను గుర్తుతెలియని దుండగులు పొడవైన స్క్రూడ్రైవర్ వంటి పదునైన ఆయుధంతో తల, కణత, మెడ, కడుపులో మొత్తం 32 చోట్ల తూట్లు తూట్లుగా దారుణంగా పొడవడంతో కడుపులోని పేగులు కొద్దిగా బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మృతదేహానికి కొద్ది దూరంలో మద్యం సేవించిన ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో ఘర్షణకు చోటుచేసుకొని అది హత్యకు దారితీసి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి జేబులోని పర్సు, సెల్‌ఫోన్ కూడా దుండగులు తీసుకెళ్లారు. అయితే రావూస్ కెమికల్ కంపెనీలో బిహార్ రాష్ట్రానికి చెందిన మరో 30 మంది వరకు యువకులు పనిచేస్తున్నారు. అనుమానిత యువకులందరినీ పోలీసులు తమదైన శైలిలో విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment